11,300 పాయింట్లపైకి నిఫ్టీ

2019 definitely feels much better than 2018 for stock market investors - Sakshi

కొనసాగిన ఎలక్షన్‌ ర్యాలీ 

మరింత జోరుగా విదేశీ నిధులు 

రెండు నెలల గరిష్టానికి రూపాయి 

సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు 

482 పాయింట్ల లాభంతో 37,535కు సెన్సెక్స్‌

133 పాయింట్లు పెరిగి 11,301కు నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్‌లో భారీ ఎలక్షన్‌ ర్యాలీ మంగళవారం కూడా కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతుండటం, డాలర్‌తో రూపాయి మరింతగా బలపడటం కలసివచ్చాయి. బ్రెగ్జిట్‌ డీల్‌లో మార్పులు, చేర్పులకు యూరోపియన్‌ యూనియన్‌ అంగీకరించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడడం సానుకూల ప్రభావం చూపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 11,300 పాయింట్లపైకి ఎగబాకింది. 133 పాయింట్లు పెరిగి 11,301 పాయింట్ల వద్దకు చేరింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 482 పాయింట్లు లాభపడి 37,535 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండు రోజుల్లోనే సెన్సెక్స్‌ 864 పాయింట్లు, నిఫ్టీ 266 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.  ఈ నెలలో ఇప్పటివరకూ సెన్సెక్స్‌1,668 పాయింట్లు, నిఫ్టీ 508 పాయింట్లుపెరిగాయి.  

రోజంతా లాభాలే... 
ఎన్నికల అనంతరం మళ్లీ స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడగలదన్న అంచనాలతో మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.లాభాల్లో ఆరంభమైన స్టాక్‌సూచీలు రోజంతా అదే జోరు చూపించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 533 పాయింట్లు, నిఫ్టీ 152 పాయింట్ల వరకూ లాభపడ్డాయి.  

ఆల్‌టైమ్‌ హైకి బ్యాంక్‌ నిఫ్టీ  
బ్యాంక్‌ షేర్లు వెలుగులు విరజిమ్మాయి. ఇంట్రాడేలో బ్యాంక్‌ నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయి, 28,488 ను తాకింది. చివరకు 477 పాయింట్ల లాభంతో 28,444 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టీతో పాటు పలు షేర్లు కూడా ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, యాక్సిస్‌ బ్యాంక్, టైటాన్‌ కంపెనీ, యూపీఎల్, బజాజ్‌ హోల్డింగ్స్, బాటా ఇండియా, దివీస్‌ ల్యాబ్స్, హావెల్స్‌ ఇండియా, ముత్తూట్‌ ఫైనాన్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. సెన్సెక్స్‌లో వెయిటేజీ అధికంగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌ అండ్‌ టీలు రేంజ్‌లో లాభపడ్డాయి. రూ.1.23 లక్షల కోట్లు పెరిగినఇన్వెస్టర్ల సంపద స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద కూడా భారీగానే పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1,23,921 కోట్లు పెరిగి రూ.1,48,17,502కు ఎగసింది.  

లాభాలకు కారణాలు ఇవీ...
►విదేశీ పెట్టుబడుల జోరు... 
► మళ్లీ మోదీకే ‘పట్టం’ అన్న అంచనాలు
► ప్రపంచ మార్కెట్ల పరుగు... 
► రెండు నెలల గరిష్టానికి  రూపాయి... 
► బ్రోకరేజ్‌ సంస్థల బుల్లిష్‌ అంచనాలు.... 

ఎన్‌ఎండీసీ మధ్యంతర డివిడెండు రూ.5.52 
మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ 2018–19 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండు ప్రకటించింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.5.52 డివిడెండు చెల్లించాలని మంగళవారం సమావేశమైన బోర్డు నిర్ణయించింది. మంగళవారం ఎన్‌ఎండీసీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 1.17 శాతం పెరిగి రూ.112 వద్ద స్థిరపడింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top