మార్చి 1 నుంచి ఏటీఎంలో 200 నోటు!

200 notes in  ATM from March 1st! - Sakshi

గ్రామీణ ప్రాంతాల్లో రూ. 50 నోట్లు కూడా..

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మార్చి 1 నుంచి ఏటీఎంలలో రూ.200 నోటు దర్శనమివ్వనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలలో అయితే రూ.50 నోట్లు కూడా రానున్నాయి. ప్రస్తుతం ఈ నోట్లు చలామణిలోకి వచ్చినా... అవన్నీ బ్యాంకుల్లో విత్‌డ్రా ద్వారా వచ్చినవే. రూ.200, రూ.50 నోట్ల సైజు నిర్ధారణ, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, ఇప్పటికే చాలా ఏటీఎంలలో ఈ ప్రక్రియ పూర్తయిందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి స్థాయిలో మార్చి 1 నుంచి అందుబాటులోకి రావచ్చని తెలిపాయి. ప్రస్తుతం ఏటీఎంలలో రూ.2,000, రూ.500, రూ.100 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో రూ.50 నోట్లు..
స్థానిక అవసరాలను బట్టి ఏటీఎంలలో నోట్లను అమరుస్తున్నారని, పట్టణాల్లో రూ.2,000, రూ.500, రూ.200, రూ.100 నోట్లకు డిమాండ్‌ ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, రూ.200, రూ.100, రూ.50 నోట్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఒకరు ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో చెప్పారు. అందుకే గ్రామాల్లోని అన్ని ఎస్‌బీఐ ఏటీఎంల్లోనూ రూ.200, రూ.50 నోట్లను అందుబాటులోకి తేనున్నట్లు తెలియజేశారు.

కాగా ప్రస్తుతం ఏటీఎంలలో అందుబాటులో ఉన్న రూ.2,000, రూ.500, రూ.100 నోట్లకన్నా సైజులో రూ.200 నోటు చిన్నది. దీంతో మళ్లీ అన్ని ఏటీఎంలలోని సాఫ్ట్‌వేర్‌లను మార్చాల్సి వస్తోందని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ జనరల్‌ సెక్రటరీ ఎస్‌ వెంకటేశ్వర్‌రెడ్డి చెప్పారు.

నిర్ధారణ వ్యయం రూ.110 కోట్ల పైనే..
ఏటీఎంలలో నోట్ల నిర్ధారణ, సాఫ్ట్‌వేర్‌ మార్పు బ్యాంకులకు వ్యయంతో కూడుకున్న పని. ఇందుకోసం సుమారు రూ.110 కోట్లకు పైగానే ఖర్చవుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఒక్కో ఏటీఎం నిర్ధారణకు రూ.5 వేలు ఖర్చవుతుందని.. ఏటీఎంలోని ఒక్కో క్యాసెట్‌లో 2,500 నోట్లు పడతాయని ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2017 డిసెంబర్‌ నాటికి దేశంలో ఆన్‌సైట్‌లో 1,09,908, ఆఫ్‌సైట్‌లో 97,128 ఏటీఎంలున్నాయి. వీటిల్లో అత్యధిక ఏటీఎంలు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐవే.

విపణిలోకి సెల్ఫ్‌సర్వ్‌ ఏటీఎం
విడుదల చేసిన ఎన్‌సీఆర్‌
ప్రముఖ ఓమ్నీ చానల్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ విపణిలోకి కొత్త తరహా ఏటీఎంను విడుదల చేసింది. సెల్ఫ్‌సర్వ్‌ రీసైకిల్‌ ఏటీఎం ఆర్థిక సంస్థలకు ఎంతగానో ఉపయుక్తమని, మారుమూల ప్రాంతాల్లోనూ సులువుగా, వేగవంతంగా ఏటీఎం సేవలందించే వీలుంటుందని ఎన్‌సీఆర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్, జీఎం జోస్‌ రిసెన్‌డిజ్‌ తెలిపారు. 2018 నాటికి 18.5 బిలియన్ల లావాదేవీలు ఏటీఎం ద్వారా జరుగుతాయని.. 2022 నాటికిది 26 బిలియన్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top