17,356 ఫ్లాట్లు ఫర్‌ సేల్‌!

17,356 flats for sale! - Sakshi

హైదరాబాద్‌లో ఏడాదిలో 38 శాతం తగ్గిన ఇన్వెంటరీ

సాక్షి, హైదరాబాద్‌: 2017... స్థిరాస్తి రంగానికి మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ రియల్టీ రంగం గుర్తుంచుకోవాల్సిన సంవత్సరం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీకి ఈ ఏడాదిలో ముహూర్తం కుదిరింది. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లతో సప్లయి తగ్గడంతో ఇన్వెంటరీ ఫ్లాట్ల కొనుగోళ్లు పెరిగాయి. జస్ట్‌.. ఏడాది కాలంలో హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 38 శాతం తగ్గడమే ఇందుకు నిదర్శనమని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక తెలిపింది.

హైదరాబాద్‌లో 2016 డిసెంబర్‌ నాటికి అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 28,088 ఉండగా.. 2017 డిసెంబర్‌ ముగింపు నాటికి 17,356 యూనిట్లకు చేరింది. అంటే 38 శాతం తగ్గింది. ఇందులో దిక్కుల వారీగా ఇన్వెంటరీ గణాంకాలను పరిశీలిస్తే.. నార్త్‌లో 2,993 యూనిట్లు, వెస్ట్‌లో 10,130, సెంట్రల్‌లో 1,037, ఈస్ట్‌లో 908, సౌత్‌లో 2,286 యూనిట్లున్నాయి.

నగరంలో 18 ఏళ్లుగా ఫర్‌ సేల్‌..
నగరాల వారీగా అమ్ముడుపోకుండా ఉన్న ఫ్లాట్ల వయస్సును పరిశీలిస్తే.. ౖఎన్‌సీఆర్‌లో అత్యధికంగా 18.5 ఏళ్ల నుంచి విక్రయంకాని ఇన్వెంటరీ ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో దాదాపు 18 ఏళ్లుగా ఉన్న ఇన్వెంటరీ ఉంది. అహ్మదాబాద్‌లో 10 ఏళ్లుగా, ముంబైలో 16 ఏళ్లుగా, పుణెలో 13 ఏళ్లుగా, కోల్‌కతాలో 12 ఏళ్లుగా, చెన్నైలో 14 ఏళ్లుగా, బెంగళూరులో 13 ఏళ్లుగా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ ఉంది.

హైదరాబాద్‌లో 3 శాతం ధరల వృద్ధి..
నగరాల వారీగా చ.అ. ధరల పెరుగుదల పరిశీలిస్తే.. ఆశ్చర్యకరంగా హైదరాబాద్, అహ్మదాబాద్‌ మినహా మిగిలిన అన్ని ప్రధాన నగరాల్లో  ధరలు తగ్గాయి. ఏడాది కాలంలో ఎన్‌సీఆర్‌లో 2 శాతం, ముంబైలో 5 శాతం, పుణెలో 7 శాతం, కోల్‌కతాలో 5 శాతం, బెంగళూరులో 5 శాతం, చెన్నైలో 3 శాతం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో మాత్రం 3 శాతం, అహ్మదాబాద్‌లో 2 శాతం ధరలు పెరిగాయి.

దేశంలో 5,28,494 ఫ్లాట్లు ఫర్‌ సేల్‌  
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఎన్‌సీఆర్, అహ్మదాబాద్, ముంబై, పుణె, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైల్లో 2017 డిసెంబర్‌ ముగింపునాటికి అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 5,28,494 యూనిట్లు. 2016 డిసెంబర్‌తో పోలిస్తే ఇది 16 శాతం తక్కువ.

    నగరాల వారీగా ఇన్వెంటరీ గణాంకాలివే
    నగరం               అమ్ముడుపోకుండా ఉన్న ఫ్లాట్లు
    హైదరాబాద్‌                  17,356
    ఎన్‌సీఆర్‌                  1,66,631
    బెంగళూరు                1,09,112
    ముంబై                    1,15,964
    చెన్నై                          24,640
    పుణె                          28,455
    కోల్‌కతా                      39,252
    అహ్మదాబాద్‌               26,884

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top