తలసరి ఆదాయంలో భారత్‌ ఒక మెట్టు పైకి..

 126 rank in  IMF statistics - Sakshi

ఐఎంఎఫ్‌ గణాంకాల్లో 126 ర్యాంకు..

బ్రిక్స్‌ దేశాలతో పోలిస్తే.. ఇంకా దిగువనే  

న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఆధారంగా తలసరి ఆదాయానికి సంబంధించి భారత్‌ ఒక మెట్టు పైకి ఎగబాకింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) గణాంకాల ప్రకారం తాజాగా భారత్‌ 126 ర్యాంకును సాధించింది. అయితే, బ్రిక్స్‌ దేశాల కూటమిలోని ఇతర దేశాలతో పోలిస్తే (బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా) మాత్రం అట్టడుగున ఉండటం గమనార్హం.

కొనుగోలు శక్తి ఆధారంగా(పర్చేజ్‌ పవర్‌ ప్యారిటీ) ప్రపంచంలోని 200 దేశాల జీడీపీలను లెక్కలోకి తీసుకొని ఐఎంఎఫ్‌ ఈ ర్యాం కింగ్స్‌ను నిర్ణయించింది. ఇటీవలి ‘ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం’ నివేదికలో భాగంగానే ఈ జాబితాను కూడా ప్రవేశపెట్టింది. ర్యాంకింగ్స్‌లో 1,24,930 డాలర్ల తలసరి ఆదాయంతో ఖతార్‌ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2,3 స్థానాల్లో మకావూ(1,14,430 డాలర్లు), లగ్జెంబర్గ్‌(1,09,190 డాలర్లు) నిలిచాయి. నివేదికలో ముఖ్యాంశాలివీ...

గతేడాది(2016) ఐఎంఎఫ్‌ గణాంకాల్లో భారత్‌ 6,690 డాలర్ల తలసరి ఆదాయంతో 127వ ర్యాంకులో ఉంది. ఈ ఏడాది(2017)లో తలసరి ఆదాయం 7,170 డాలర్లకు పెరగనుండటంతో  126కు చేరేందుకు దోహదం చేసింది.
 ఇక బ్రిక్స్‌ దేశాల్లో రష్యా తలసరి ఆదాయం 27,900 డాలర్లు,  చైనా 16,620 డాలర్లు, బ్రెజిల్‌ 15,500 డాలర్లు, దక్షిణాఫ్రికా 13,440 డాలర్లతో భారత్‌కంటే చాలా మెరుగైన స్థితిలో ఉన్నాయి.
సింగపూర్‌ 4వ ర్యాంకు(90,530 డాలర్లు), బ్రూనై 5వ ర్యాంకు(76,740 డా.), ఐర్లాండ్‌ 6వ ర్యాంకు(72,630 డా.), నార్వే 7వ ర్యాంకు (70,590 డా.), కువైట్‌ 8వ ర్యాంకు (69,670 డా.) యూఏఈ 9వ ర్యాంకు(68,250 డా.), స్విట్జర్లాండ్‌ 10వ స్థానం(61,360 డా.)లో నిలిచాయి.
అమెరికా 59,500 డాలర్ల తలసరి ఆదాయంతో 13వ స్థానంతో సరిపెట్టుకుంది.

పర్చేజ్‌ పవర్‌ ప్యారిటీ(పీపీపీ) అంటే..: ఏదైనా ఒక దేశం కరెన్సీని మరో దేశం కరెన్సీలోకి మార్పిడి చేసినప్పుడు మొదటి దేశంలోని నిర్ధేశిత కరెన్సీతో ఏవిధంగా వస్తు, సేవల పరిమాణం లభిస్తుందో.. అదేవిధంగా రెండో దేశంలో కూడా నిర్ధేశిత మొత్తం(కరెన్సీని మార్పిడి చేయడంద్వారా లభించే సొమ్ము)తో అంతే పరిమాణంలో సేవలు, వస్తువులను కొనుగోలు చేయగలగడం.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top