రాశి ఫలాలు (సౌరమానం)

Weekly Rasi Phalalu inTelugu (17-08-19 to 23-08) - Sakshi

జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్‌! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (ఆగస్ట్‌ 17 నుండి 23 వరకు)మీ రాశి ఫలితాలుడా‘‘ మైలవరపు శ్రీనివాసరావు జ్యోతిష్య పండితులు

మేషం(మార్చి 21 –ఏప్రిల్‌ 19)
కొంత పనిని చేసి– తర్వాత చూద్దాంలే!– అనుకున్న పక్షంలో పని ఏమాత్రమూ పూర్తి కాదనేది నిర్వివాదాంశం. పని పూర్తయ్యేవరకూ పట్టుదలతో ఉండి తీరాల్సిందే. మీకు సాధ్యం కాని పక్షంలో ఓ రూపాయి ఎక్కువైనా సరే పనిని సకాలంలో పూర్తి చేసుకోవడం అత్యవసరం. కాలం దాటితే ఆ పనిని ముగించేందుకు అవకాశం అనుమతీ లభించకపోవచ్చు. పట్టుదల ఉంటే విజయం తథ్యం. లోకంలో కొందరు నిష్కారణంగా మన ఉన్నతికి బాధపడుతూ మనకేదైనా ఇబ్బందీ విఘ్నం నష్టం వంటివి కలిగితే బాగుండునని ఎదురు చూస్తూ ఉండచ్చు. మీరు ‘నా గతి ఇంతే అనో, నష్టం విఘ్నం కష్టం వస్తుందేమో’ అనే తీరు వ్యతిరేక భావాలతో ఉండకండి. తప్పక విజయం లభిస్తుంది. అయితే విజయ సాధన పట్ల గుంభన అవసరం. విజయ రహస్యాన్నీ పొంగిపోతూ నలుగురికీ చాటింపు వేసుకోవడం మరింత అనవసరమని గ్రహించండి. ప్రభుత్వపరంగా మీకు రావలసిన సహాయం ఈ వారంలో రాకపోవచ్చుననే దృఢ నిర్ణయంతో ఉండండి. అలాగే మీకు మీ అవసర కాలంలో రుణాన్నిచ్చినవాళ్లు ఒత్తిడి చేస్తారేమోననే భయంతో ఉండకండి. ఇంతకుముందు కూడా ఇలాగే వచ్చిన సంఘటనలెన్నో ఉన్నాయి– ఒడ్డుకి చేరుకున్న సంఘటనలూ ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. ఆర్థికంగానైతే పొంగి పొర్లిపోయేంత ధనమూ ఉండదు– అలాగని బీద అరుపులు అరుచుకోవాల్సిన స్థితీ ఉండదు. ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. అయితే కుటుంబ వాతావరణం ఆత్మీయులతో సంబంధ బాంధవ్యాలూ చక్కని తీరులో ఉండే కారణంగా ధన బలహీనత అనేది మీకు ఒక లోపంగా అనిపించనే అనిపించదు. అనుకోని అవాంతరం తప్పదు. ఆ వెంటనే అది పరిష్కరింపబడటం కూడా తప్పదు. దుఃఖపడే అవసరం తప్పదు.

లౌకిక పరిహారం: పట్టుదల విడవకండి. గుంభనని పాటించండి.
అలౌకిక పరిహారం: శ్రావణ మంగళవారం నాడు గౌరీపూజని శ్రద్ధగా చేసుకోండి.

వృషభం (ఏప్రిల్‌ 20 –మే 20)
ఏ మాటని మాట్లాడబోతున్నా– ఏమైనా అపార్థం ఎదుటివాళ్లకి స్ఫురిస్తుందా?– అని ఆలోచించుకుని మాట్లాడటం అవసరం. వాద వివాదాలొచ్చే అవకాశముందని అనిపిస్తే ఆ ప్రదేశాన్ని వీడి Ðð ళ్లిపోవడం గాని, వాదించుకోబోతున్న అంశాన్ని మార్చేయడం గాని సర్వదా శుభప్రదం. కుజుడు మారబోతున్న కారణంగా మానసికమైన ఆందోళన కలగచ్చు. అయితే పని ముగిసింతర్వాత ‘ఎందుకాందోళన పడ్డాననే తీరు ఆలోచనకి వస్తారు. ఉన్న సొమ్ముతో భూమి కొనుగోలు ప్రయత్నాలు చేసే అవకాశముంది. అయితే ఉన్న ఆస్తిని అమ్మేసి కొనడం మాత్రం సరికాదు. ఇరుగు పొరుగులతో మాటా మాటా బంధువులనుండి అపనిందలూ, ఉద్యోగంలో పై అధికారుల ఒత్తిడులూ, తోటి ఉద్యోగుల అసహకారం వంటి వాటిలో ఏదో ఒకటి మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. అయితే అది హానికరం కానే కాదు. సహజమైన కిట్టనితనం కారణంగానే ఈ ఒత్తిడి కాబట్టి తట్టుకోండి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు మీ ద్వారానే సాగే అవకాశముంది కాబట్టి ఇంటికి స్నేహితులు, బంధువులు, ఆప్తులు ఎరిగున్నవారు వచ్చే అవకాశముంది. ఆర్థికంగా జాగ్రత్త తీసుకోని పక్షంలో వ్యయం పెరగచ్చు. ఇంటికి నలుగురొచ్చారు కదా! అని అనవసరమైన (గృహ విషయాల్లో) సందేహాలని వాళ్ల మధ్య పెట్టకండి. తగినంత ఓపికగాని లేవనిపించిన పక్షంలో రా వీలుపడదనే మాటని చెప్పండి తప్ప మాట దాటేసి నిందపడకండి. అయిన వారితో కంటె ఇటీవల పరిచయమయ్యే వ్యక్తుల నడవడికను గమనించి ప్రవర్తించుకోవడం ఉత్తమం. వ్యవసాయ దారులకీ వాహనాలని అద్దెకి తిప్పే వారికీ షేర్లు వ్యాపారం చేసే వారికీ మధ్యమ ఫలితాలుండవచ్చు. నడుమూ పాదాలూ ఆరోగ్యపరంగా బాగుండకపోవచ్చు. తగినంత ఆరోగ్యవృద్ధిని పాటించండి.

లౌకిక పరిహారం: అపార్థం రాకుండా అవసరమైనంతే మాట్లాడుతూ ఉండండి.
అలౌకిక పరిహారం: శ్రావణ మంగళవారం నాడు గౌరీ అష్టోత్తరాన్ని పఠించండి.

మిథునం(మే 21 –జూన్‌ 20)
కుటుంబంలో ఐకమత్యం బాగా ఉండే కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయితే ఆర్థికపరమైన అంశాలకి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేక కొన్ని ఇబ్బందులకి లోనవుతారు. ప్రశాంతంగా ఉండే ధోరణిలో ఉండే ఈ రాశివారు ఒక సందర్భంలో ఆవేశానికి లోనవుతారు. ఆ కారణంగా  తమ మనసులోని ఆలోచన కాస్తా బయటికి వచ్చేసే అవకాశముంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగరీత్యా దూరంగా ఉన్న భార్య/భర్త వద్దకి వెళ్లే అవకాశముంది. అయితే ప్రయాణాల్లో వస్తు జాగ్రత్తలు అత్యవసరం. దంపతులు బాగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి వచ్చే కారణంగా మంచి భూమినో పొలాన్నో ఇంటినో కొనే ఆలోచన తప్పనిసరి ఔతుంది. సరైన తీరులో పత్రాలని దానికి సంబంధించిన వారికి చూపించుకుని కొనుక్కోవడం మంచిది. ఈ రాశివారు ఓ సాహసోపేత నిర్ణయాన్ని చేసి లోగడ నుండి మనోవ్యధని కలిగిస్తున్న ఆ సమస్యకి పరిష్కారాన్ని పొందుతారు. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి మరింతగా ఆలోచనలని చేస్తూ కొద్దిగా మానసిక శ్రమకి తాత్కాలికంగా గురి ఔతారు. మీ ఆలోచనలని ఆచరణలో పెట్టేందుకు మీ బంధువులు తోడ్పడతారు కూడా. స్థానచలనం గురించిన ఆలోచనని అస్సలు చేయద్దు. ఉన్న చోటనే విజయం లభించే అవకాశం ఉన్న కారణంగా  ఉద్యోగంలో మరింతగా మీ చురుకుదనాన్ని చూపించండి. కొత్త మెళకువలని తెలుసుకోండి. ఏ విధమైన వ్యతిరేకతా కనిపించడం లేదు కాబట్టి అనవసరమైన ఆందోళన పడకండి. ఉద్యోగపు మార్పుని గురించిన ఊహతో అస్సలుండకండి. ప్రయాణమేదైనా చేయాల్సి వస్తే ‘దానివల్ల నాకు కలిసొచ్చేది ఎంత’ అని నిర్భయంగా ఆలోచించుకుని మాత్రమే ప్రయాణించండి తప్ప వ్యర్థ ప్రయాణాలని చేసి శారీరక శ్రమకీ అనారోగ్యానికీ గురి కాకండి.

లౌకిక పరిహారం: భూమి, గృహం, పొలం.. వంటివి కొనే ఆలోచన సరైనదే.
అలౌకిక పరిహారం: శ్రావణ మంగళవారం నాడు ఓ ముల్తైదువుకి చీరతోపాటు వాయనాన్నిచ్చుకోండి.

కర్కాటకం(జూన్‌ 21 –జూలై 22)
ముద్దొచ్చినప్పుడే చంకకెక్కాలనేది సామెత. ప్రస్తుతం మీకు గ్రహదశంతా అనుకూలంగా ఉంది కాబట్టి మీ జీవిత గమనంలో వేగాన్ని పెంచుకుని పనుల వాయిదా వేయకండి. పని పూర్తయ్యేవరకూ విశ్రమించకండి. మీరు చేసే పని మీకూ ఒక తీరుగా సంఘానికీ కూడా ప్రయోజనాన్ని కల్గించేదిగా ఔతుంది కాబట్టి పనిని ఆపుకోకండి– ఎవరి సూచన మీదటో పనిని ఆపనీయకండి. విదేశాల నుండి ఆహ్వానం లభించినా కూడా దాన్ని తిరస్కరిస్తూ మీ ఆలోచనలకనుగుణంగా ఏదో ఒక కొత్త సంస్థని స్థాపించాలనే గట్టి నిర్ణయానికొస్తారు. స్వదేశంలో ఉంటే మీకు మీరు ఎదుగుతారు. అదే మరి విదేశాలకెళ్తే వాళ్ల ఎదుగుదలకి మీకు సహకరించిన వారు ఔతారు. ఈ ఆలోచనతోనే విదేశాగమనానికి ఇష్టాన్ని చూపించరు. ఇంట్లో వాళ్లెవరైనా మీరు పెట్టబోయే వ్యాపారంలో సహకరిస్తామని గాని అంటే– తిరస్కరించవద్దు. ‘నీకేం తెలుసు?’ నని ఆ తీరుగా అవమానించద్దువ. ఎంతటి సాధు గోమాతకైనా నీకేం తెలియదన్న మాటని పదిమందితో అంటే ఓ చిన్న అభిమానం పొడుచుకొచ్చి ఇక విరోధ బుద్ధితోనే ఉండాలనే నిశ్చయానికి వచ్చేస్తారు. ముఖ్యంగా స్త్రీ సంతానమైతే వాళ్లతో మరింత జాగ్రత్త అవసరం. కొత్త చదువుల్ని చదివే అవసరం రావచ్చు. మళ్లీ చదువా? అనుకోకండి. ఉద్యోగంలో పదవీ ఉన్నతీ ఆర్థిక ఉన్నతీ కూడా కలిగే అవకాశముంది. పైగా చదవడానికి మొదలెడితే మీ దశ ప్రస్తుతం బాగున్న కారణంగా ఆ చదవబోతున్న చదువుకి సంబంధించిన వ్యక్తి మీకు పరిచితుడో చుట్టమో అయ్యే అవకాశముంది కూడా. ఏటిలో ఒక కెరటం తర్వాత మరొక కెరటం వచ్చేట్టుగా మీక్కూడా చేయాల్సిన పనుల పరంబపర అలా వచ్చేస్తూ ఎంతగా విశ్రాంతిని తీసుకోవాలని ప్రయత్నిస్తే అంతగా పనిభారం పెరిగిపోతూ ఉండచ్చు ఈవారంలో. పనిలోనే ఆనందాన్ని పొందండి. తప్పదు.

లౌకిక పరిహారం: పనీ కొత్త చదువూ తప్పనిసరి కావచ్చు. శ్రమించండి.
అలౌకిక పరిహారం: శ్రావణ మంగళవారం నాడు అమ్మ అష్టోత్తరాన్ని గుళ్లో చదువుకుని రండి.

సింహం(జూలై 23 –ఆగస్ట్‌ 22)
అప్పటికి ఆ పనైపోతే చాలు అనే పూర్వ ధోరణిని పూర్తిగా విడిచిపెట్టండి. అప్పటికప్పుడు... అనే ఆలోచన ఉంటే చేసే పని తప్పక ఆనాలోచితమే ఔతుంది. ముందుచూపుతో, రేపటి రోజున ఎలా ఉండబోతోందనే గట్టి ఊహతో పని చేస్తే నష్టం ఎక్కువ శాతంలో ఉండదు.  దశ బాగుండలేదు కనుక సరైన ఆలోచన తట్టని పక్షంలో ఆ పనిని తలెత్తుకోకండి. ఏది తోస్తే అది చేసేయకండి. ఒకప్పుడు మీరు మంచి కష్టకాలంలో ప్రయాణిస్తున్న సందర్భంలో మీకు సహాయపడిన ఎవరో ఒకరు  ఓ విషయంలో కొద్దిగా మొగమాట పెట్టచ్చు. సాధ్యం కాదని స్పష్టంగా కృతజ్ఞతాపూర్వకంగా వినయంగా చెప్పండి. ఎందుకు సాధ్యపడదో కూడా చెప్పండి. ‘అలాగే’ అని చెప్పి ఆయన మీ మీద ఆశపెట్టుకుని ఉన్నాక చివర్లో మీరు వ్యతిరేక ధోరణిని క్రియాత్మకంగా ప్రదర్శించడం కృతఘ్నత అవుతుంది. అది సరికాదు. మీకు లోకానుభవం గట్టిగా ఉంటుంది. దానికి తోడు గత అనుభవజ్ఞానం కూడా బాగా ఉంది. ఆ కారణంగా నిజానికి మీకెవరూ ప్రత్యేకించి సలహా ఇయ్యవలసిన అవసరం లేదు. అలాగని మీకు మీరే నిర్ణయం చేసుకుని పనిలోకి దూకిపోకండి. బాగా విశ్వసనీయ వ్యక్తితో సంప్రదించి చేయడం మంచిదని గ్రహించుకోండి. దాదాపు చాలామందికి... ఏదో ఒక పనిని రహస్యంగా చేసేసి దాని వల్ల వచ్చిన ఫలితాన్ని భర్త/ భార్యకి చూపించి అతని/ఆమె ఆనందాన్ని పొందాలనే మనస్తత్వం సాధారణంగా ఉంటుంది. ప్రస్తుతం దశ అంత అనుకూలంగా లేని కారణంగా గుంభన మంచిది కాదు. కుటుంబ సభ్యులతో చెప్పి ముందువెనుకలు చూసుకుని పనిలోకి దిగండి. సాహసం చేయకండి. ఎదుటివానికి హాని కలగనప్పుడు అసత్యం పలకటం నేరం కాదు. కాబట్టి మధ్యవర్తిత్వం, బరువైన కార్యాన్ని చేసిపెడతానని వాగ్దానం చేయద్దు.

లౌకిక పరిష్కారం: కుటుంబ సభ్యులతో గుంభన వద్దు. పెద్దలతో సంప్రదించాలి.
అలౌకిక పరిష్కారం: ముత్తయిదువు పాదాలకు పసుపు పూసి ఆశీస్సులు పొందండి.

కన్య(ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
అనవసర భయాలతో ఆందోళనలతో ఉద్యోగాన్నీ, వృత్తినీ మారిస్తే ఎలా ఉంటుందనే కొత్త నిర్ణయంతో సతమతమౌతున్న మీకు ఆ అవసరం లేదనే యథార్థం దృఢంగా తెలిసి మంచి ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగస్థులు పదవీ ఉన్నతితో పాటు ఆర్థికలాభాన్ని కూడా పొందే అవకాశముంది. ఏ సమస్య పరిష్కారం గురించి ఎక్కువగా మధనపడుతున్నారో ఆ విషయాన్ని... మీకు సంబంధించిన ఆప్తులూ, రహస్యాన్ని ఎవరికీ చెప్పనే చెప్పరనే నమ్మకం మీకు కలిగించినవాళ్లు అయిన ఓ ఇద్దరితో మాత్రమే చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నించండి. సమష్టిగా చేయబోయే నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది. మీ గుండెలో బాధని అలా తరిమికొడుతుంది. ఏదో ఓ శుభవార్త వినే అవకాశముంది. సోదరుల్లో ఎవరికో వివాహమో గృహప్రవేశమో వంటి వార్త కావచ్చు లేదా మీకు సంబంధించిన శుభవార్త కావచ్చు. కొద్దిగా మనసు బాధగా ఉన్నకాలంలో మనకి లేదా మన సంబంధికులెవరికైనా శుభం జరుగుతోందనే వార్త వింటే మనసు తేలికపడుతుంది కదా? ఖర్చులు తప్పనిసరిగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి కొంత ఆర్థిక క్రమశిక్షణ అవసరం. అలాగని ఎవరికో ఋణాన్ని ఈయడమైతే సరికాని పని. దానికి కారణం మీకు తిరిగి వసూలు చేసుకోగల కరకుదనం లేకపోవడం, తెగించి అడుగుదామనుకున్నా అది ఎందుకో సాధ్యపడకపోవడం. ధనాన్ని ఋణంగా ఇచ్చి తిరగడం కంటె ఇవ్వవలేననడం మంచిది కదా. ఒకవేళ మైత్రి తెగిపోయినా సరే అనుకుంటూ ఈ ఋణ తిరస్కరణ చేయండి. మీరు చేస్తున్న వ్యాపారానికి మంచి గుర్తింపు లభించే కారణంగా వ్యాపారాభివృద్ధి ఉంది.

లౌకిక పరిష్కారం: ఆప్తులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక క్రమశిక్షణ అవసరం.
అలౌకిక పరిష్కారం: శ్రావణ మంగళవారం నాడు ముత్తయిదువ పాదాలకు నమస్కరించి అక్షతలను వేయించుకోండి.

తుల(సెప్టెంబర్‌ 23 –అక్టోబర్‌ 22)
గ్రహాలన్నీ ఒకచోట చేరి మీకు ఏ తీరు శుభాన్ని కలిగించాలా? అని చర్చించుకుంటూన్నట్లుగా గోచార స్థితి ఉన్న కారణంగానూ ఒక్క శుక్రుడు మాత్రమే సందేహాస్పద దృష్టితో ఉన్న కారణంగానూ వ్యవసాయదారులైన వారికి పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉండి లోగడ లాభం అంతంత మాత్రమనుకున్న పరిస్థితి పోయి ఆశాజనకంగా ఉంటుంది. చక్కటి దిగుబడి వస్తుంది. సాహిత్య పండితులకీ, విజ్ఞాన రంగం వారికీ, ముఖ్యంగా సంగీత శాస్త్రజ్ఞులకీ మంచి గుర్తింపూ గౌరవమూ ఉండచ్చు. వైద్య న్యాయశాస్త్ర కోవిదులకి ఆదాయం మరింతగా ఉండదేమోగాని బాగానే ఉంటుంది. విశేషించి తమ తమ వృత్తుల పట్ల ఆదరణ బాగా ఉంటుంది. కొందరైతే తాము చేసే వృత్తి పట్ల నిరాదర భావంతో ఉంటారు గాని ఈ రాశివారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తి. ఎంత జాగ్రత్తల్ని తీసుకున్నా అనారోగ్యం మాత్రం తప్పక పోవచ్చును. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తని పాటిస్తున్నా ఔషధ సేవని అవసరమైనంత వరకూ చేయడమే మంచిది. రోజుకోచోట వైద్యం కానిపక్షంలో సత్ఫలితాలు లభించవచ్చు. ముఖ్యంగా కోపం, దుడుకు ప్రవర్తనం... అనే వీటిని అదుపు చేసుకోగలిగితే శరీరంలో రజస్తమోగుణాల అదుపు కారణంగా రక్త ప్రసరణలో మార్పు కలిగి ఆరోగ్యం బాగుంటుందంటుంది శాస్త్రం. మీ కుటుంబ విషయాలని కావాలని అడిగి తెలుసుకుని ఎన్నెన్నో సూచనలు, సలహాలు, తీర్పులు, న్యాయాన్యాయాలు గురించి చర్చించాలని ఎవరైనా ఉత్సాహపడుతుంటే వాళ్లకి విషం అర్థమయ్యీ కాకుండా ఉండేలా చెప్పి వాళ్లకి వాళ్లు విరమించుకునేలా లౌక్యంగా వ్యవహరించడం ఉత్తమం తప్ప పూర్తి వివరాల్ని అవగాహనమయ్యేలా చెప్పడం సరికాదు. వాళ్లు కార్యసాధనకి తోడ్పడేవాళ్లు కాదు. కేవలం శ్రోతలు మాత్రమే.

లౌకిక పరిహారం: ఆరోగ్య రక్షణ కోసం ఆవేశం వద్దు. తేలికపాటి ఔషధ సేవ మంచిది.
అలౌకిక పరిహారం: శ్రావణ మంగళవారం నాడు కుంకుమ భరిణని ముల్తైదువుకి బహూకరించండి.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వివాహానికి ఏర్పాట్లన్నీ దాదాపుగా సిద్ధం అయిన వేళ లేదా ఎప్పటినుంచో ఎదురు చూసిన భూమి కొనుగోలుకి అంతా సమకూరిన వేళ లేదా గృహ ప్రవేశం.. ఇలా శుభకార్యానికి అంతా సవ్యంగా ఉందనుకున్నవేళ ఆ శుభకార్యక్రమం ఏదో కారణంగా వాయిదా పడే సూచన కనిపిస్తోంది కాబట్టి దానికి సంబంధించిన ముందు వెనకల్ని  స్థిరమైన అవగాహనతోనూ స్పష్టమైన నిర్ణయాలతోనూ దృఢం చేసుకోండి. ఏ ఇబ్బందీ రాదు. దాదాపు 6 సంవత్సరాలుగా మానసికంగా బలహీనతతోనే ఉంటున్న కారణంగా తీర్థయాత్రలకీ పుణ్యస్నానాలకీ దైవదర్శనాలకీ వెళ్లాలని అనిపించవచ్చు. అయితే పదిమందితో గాని వెళ్లినట్లయితే ఆ తీర్థయాత్ర వినోద విహార యాత్రగా మారే అవకాశముంది కాబట్టి వీలైతే ఏకాంతంగానూ లేదా ఆస్తిక భావనలతో ఉండే వారితో కలిసి వెళ్లడం వల్ల దైవదర్శన యాత్ర సఫలమవుతుంది. జపం ధ్యానం చేసుకుంటూ పుణ్యాన్ని సాధించుకోగలుగుతారు. ఉద్యోగరీత్యా భార్య/ భర్త దూరంగా ఉన్నప్పటికీ ప్రతికూల బుద్ధితో దూరంగా ఉన్నప్పటికీ – లోపలున్న సౌహార్థం కారణంగా శ్రావణంలో ఏదో ఒక వస్త్ర– స్వర్ణ బహుమానాలని ఈయాలనే ఆలోచన ఉంటుంది. అవకాశం చేసుకుని పంపండి. పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. న్యాయస్థాన అభియోగాలు గాని ఉంటే ప్రస్తుత కాలంలో అనుకూలమైన తీర్పు లభించకపోవచ్చు. అయితే దాని ప్రభావం వల్ల ఇబ్బందులుండకపోవచ్చు గాని కొంత మానసిక నిరుత్సాహం కలగచ్చు. సంతానాన్ని చూసే అవకాశం లభించకపోవచ్చు ఎదుటివారి పట్టుదల కారణంగా. లేదా ఏదో కొంతసేపు గడిపే అవకాశం మాత్రమే కలగచ్చు. అలా   దర్శించడం తాకట్టులో ఉన్న బంగారాన్ని చూసినట్లే అనిపించవచ్చు.

లౌకిక పరిహారం: శత్రువులో పట్టు ఏమాత్రమూ సడలదు. జాగ్రత్త అవసరం.
అలౌకిక పరిహారం: శ్రావణ మంగళవారం నాడు ముల్తైదువుకి కొబ్బరి బొండాన్నిచ్చి ఆశీస్సులందుకోండి.

ధనుస్సు(నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
‘నేను ఉన్నదున్నట్లుగా మాట్లాడతాను. అది నాకు నా చిన్నప్పటి నుండీ వచ్చిన అలవాటు’ అనుకుంటూ ఆ మాటనే వల్లించుకుంటూ ఉండకండి. కలియుగంలో ఏ మాటని మాట్లాడినా సూటిగా గుచ్చుకునేదిగా ఉన్నట్లయితే – అది ధర్మమే కావచ్చు. కచ్చితంగా ఒక్కొక్కరు చొప్పున శత్రువుల సంఖ్యని మీరు పెంచుకుంటూ వెళ్తున్నట్లే. మాట మెత్తగా వినయంగా ఉండాలి. ఎదుటివారికి గట్టిగా అర్ధం కావాలి. ఆ తీరుని అభ్యాసం చేయండి. కొనదలిచిన భూ గృహ స్థలాల వంటివి ఒకవేళ వాయిదాపడినా చిన్న చిన్న పేచీలకి గురి అయినా కంగారుపడకండి. ఒకవైపు ఎండపడుతూంటే ఆ ఎండలో నడుస్తున్నప్పుడు ఒక చెంప వేడిగా ఉన్నట్టూ మరో చెంప మామూలుగా ఉన్నట్టూ ఎలా ఉంటుందో ఆ తీరుగా అలాంటి గొప్ప ఆస్తి సమీకరణమనేది ఆనందాన్నీ – ఇటువంటి ఇబ్బందులు మనోవ్యధనీ కల్గిస్తాయి తాత్కాలికంగా. దిగులు పడకండి. ఆ వస్తువు మీదే అవుతుంది. తల్లిదండ్రులు పెద్దవాళ్లై వీలునామా గాని రాసే అవకాశముంది. అందరూ సమావేశమైన వేళ అందరి అభిప్రాయాలనీ విన్నాక మీ అభిప్రాయాన్ని – ధర్మబద్ధంగా మాత్రమే వెల్లడించండి తప్ప మీకు మీరుగా దూసుకుపోతూ కుండపగులగొట్టినట్టు మాట్లాడేసి ఇబ్బందిని తెచ్చుకోకండి. తోబుట్టువులందరి దృష్టిలో మీవల్ల ఈ పని అడ్డం తిరిగిందనే నిందకి పాల్పడకండి. ఎప్పటì నుండో మీకు మాత్రమే ఇవ్వాలని దాచిన ఓ పిత్రార్జితం మీకు లభించవచ్చు. సంతోషకారణం కావచ్చు. రావలిసిన ద్రవ్యం విషయంలో బద్ధకించకండి. అన్యాయంగా రావచ్చుననిపించే దానికి ప్రయత్నమే చేయకండి. శని నడుస్తున్న కాలంలో ఎంత ధర్మబద్ధంగా మీరుంటే అంతటి శాంతీ మీకు సొంతం. అంతటా ఆనందమూ మీకు కరతలామలకం.

లౌకికపరిహారం: అధర్మార్జనవైపుకి వెళ్లకండి. వ్యాపారం కూడ ధర్మబద్ధంగానే చేయండి.
అలౌకిక పరిహారం: శ్రావణమంగళవారంనాడు దధ్యోదనాన్ని ముల్తైదువుకి వాయనంగా సమర్పించండి.

మకరం(డిసెంబర్‌ 22 – జనవరి 19)
చేస్తున్న ఉద్యోగాన్ని యధాలాపంగానూ ఇష్టారాజ్యంగానూ కాకుండా నిబద్ధతతో చేయని పక్షంలో ఉద్యోగపరమైన ఇబ్బందుల్ని తోటి ఉద్యోగులు కల్గించవచ్చు. మీ మీద నేరాలని పై అధికారిదృష్టికి రాతపూర్వకంగా కూడ చేర్చవచ్చు. ఉద్యోగాన్ని క్రమశిక్షణతో నిర్వహించుకోవడం మంచిది! కుజుడు 8వ ఇంట ఉండే కారణంగా తేలికగా కన్పించిన అనారోగ్యం – సూదితో వస్త్రాలదొంతర మీద గుచ్చుతుంటే తెలియకుండా అది లోలోతుగా వెళ్లిపోతున్నట్లు – క్రమంగా పెరుగుతూ వెళ్లచ్చు కాబట్టి అనారోగ్యం అన్పించగానే అశ్రద్ధ చేయకండి. నివారణకి అవకాశముంది. ఔషధసేవ లేకుండా బయటపడిపోతారు. ఇతరుల మీద విమర్శలనీ చాడీలని వారి పరోక్షంగా వారి పట్ల మీకున్న అభిప్రాయాలనీ.. ఇలా ఏమీ వెల్లడించకండి. బుధ శుక్రులు అననుకూలురుగా ఉన్న కారణంగా తేలికగానూ పరిహాసాస్పదంగానూ వేళాకోళం కోసం మనం మాట్లాడిన మాటలు రకరకాలుగా మారి చేరరాని వాళ్ల వద్దకి వెళ్లే అవకాశముంది కాబట్టి సంయమనంతో ఉండండి. ముఖ్యంగా ఇతరుల గురించి మాటల విషయంలో. వంటకి అన్నీ సిద్ధం చేసుకుని నలభీమపాకాన్ని సిద్ధం చేయదలిచి ఉన్న వేళ పొయ్యిలో ఇంధనం గాని లేని పక్షంలో ఎలా ఉత్సాహమంతా ఆవిరైపోతుందో అలా పిల్లలకి సత్ఫలితాలు లభించినా ప్రవేశాలు మరింత ఆలస్యమౌతూ తాత్కాలిక నిరుత్సాహానికి మిమ్మల్ని గురి చేయచ్చు. కళాశాలా ప్రవేశమంటూ నిశ్చయమైతే ఎక్కడుండాలి? కుటుంబాన్ని ఎక్కడికి మార్చాలి? వంటివన్నీ నిర్ణయించుకోవచ్చు కదా! ఆ నిర్ణయం ఆలస్యం కావచ్చు. మానసికంగా దృఢంగా ఉండండి. ఇబ్బంది రాదు, 

లౌకిక పరిహారం: ఉద్యోగాన్ని శ్రద్ధగా చేయండి. దేనికీ నిరుత్సాహపడకండి.
అలౌకిక పరిహారం: శ్రావణమంగళవారం నాడు ముల్తైదువుకి పుష్పమాలని బహుకరించి పాదాభివందనం చేయండి.

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
‘ఆరోగ్యమే మహాభాగ్య’మని బాగా తెలుసుకున్న మీరు శారీరక ఆరోగ్యం పట్ల అనేక విధాల జాగ్రతలని పాటిస్తూ, ఆ ఆరోగ్య కారణంగా బుద్ధిపరమైన నిర్ణయాలని చక్కగా చేయగలుగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు కూడ. ఏదైనా సమస్య వచ్చినా – అవలీలగా విజయాన్ని సాధించుకుంటారు. కుజ బుధుల అనుకూలత కారణంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కలగచ్చు. అంతే కాక ఆ వ్యాపారప్రారంభానికి సరిపడిన సహాయసహకారాలు కూడ లభించవచ్చు. మేఘం నుండి పడుతుందో పడదో తెలియని వర్షాన్ని నమ్ముకోవడం కంటె పక్కింటి నుండి నూతినీటిని తెచ్చుకోవడం సరైన పని అన్నట్టుగా వ్యాపారాన్ని సంబంధించిన సాధ్యాసాధ్యాలని ఎప్పుడో కాకుండా ఇప్పటి నుండీ తెలుసుకుంటూ ఉండడం అసవరం మంచిది కూడ. వ్యాపారాన్ని ప్రారంభించాక తెలుసుకోవడం అనేది మరో దృక్పథం, అవశ్యకర్తవ్యమున్నూ. విదేశాల్లో ఉండాలనీ అక్కడికే కుటుంబాన్ని పూర్తిగా తరలించేయడం ఉత్తమమనీ సంతానం బాగా పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక్కడ మీరు సర్వతంత్ర స్వతంత్రులు. అక్కడ అలాటి స్థాయి మీకు ఉండకపోవచ్చు. ఎంతవరకూ విదేశ నివాసం మంచిదో ఆ విషయాన్ని గురించి బాగా ఆలోచించుకోండి. ఒక చోట కూర్చుని భార్య/ భర్తతో లోతుగా సంప్రదిస్తూ జ్యోతిశ్శాస్త్రపరంగానైతే ఆ నిర్ణయం అంత సముచితం కాదు మరి. పారిశ్రామిక రంగాల వారు వాహనాలు యంత్రపరికరాలూ ముఖ్యంగా విద్యుత్‌ వినియోగ వస్తువుల విషయంలో తగిన భద్రతా నియమాలని పాటించడం, ప్రయాణాల్లో వస్తు జాగ్రతని తీసుకోవడం అవసరం కూడ.

లౌకిక పరిహారం: విదేశనివాసం గురించి కూలంకషంగా ఆలోచించండి.
అలౌకిక పరిహారం: శ్రావణ మంగళవారం నాడు ముల్తైదువుకి పాయసాన్ని ఇచ్చి ఆశీస్సులు అందుకోండి.

మీనం(ఫిబ్రవరి 19 – మార్చి 20)
 గురుగ్రహం శుభదృష్టి కారణంగా అనుకున్న తీరుగా వివాహాది శుభకార్యాలు అవాంతరాల్లేకుండా జరిగిపోతాయి. దీని కారణంగా మీ మీద దృష్టి దోషం (నరఘోష) ఉండచ్చు. మీకు జరిగిన, జరుగుతున్న విజయాలనీ శుభాలనీ అలా చెప్పేసుకుంటూ ఎదుటివారికి అసూయని పెరిగేలా చేసుకోకండి. గృహాలకి మరమ్మతులు చేపట్టే అవకాశముంది. ఆర్థికంగా ఓ ప్రణాళికని వేసుకుని దానికి మించకుండా వెళ్లడం వల్ల ఇబ్బంది రాదు. రుణాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురు కాదు. వ్యవహారాల్లో కచ్చితంగా ఉండడం మంచిది తప్ప చూసీ చూడనట్లూ, ఎలాగైనా పరవాలేదన్నట్లూ ఉండద్దు. వృత్తీ వ్యాపారాల ఆదాయం నష్టాలు లేకుండా, ఆశించినంత లాభం లేకుండా ఉంటుంది. ఉన్న వ్యాపారపు సరుకుని వదిలించుకునే ప్రయత్నం మంచిది తప్ప ధర పెరగచ్చు గదా! అనే ఆలోచనతో నిలవ చేయడమనేది సరైన పని కాదు. సంతానం ఇంకా విద్యార్థి దశలో గాని ఉంటే వాళ్ల దృష్టి పూర్తి ఆధ్యాత్మికం వైపుకి గాని ప్రధాన విద్యకంటె వేరైన క్రీడలూ సంగీతం వాద్యపరికరాలూ చిత్రలేఖనం వంటివాటి మీదికి గాని వెళ్లే అవకాశముంది కాబట్టి, విద్యార్థులు మీ వద్దే ఉంటే గమనించుకోండి. పొరుగు ప్రాంతంలో ఉంటే హఠాత్తుగా వెళ్లి విషయాన్ని అర్ధం చేసుకోండి. ఈ రాశివారిలో వ్యాపారదృష్టి ఉండే అవకాశమున్న కారణంగా వ్యాపారదృష్టి ప్రస్తుతానికి సరికాదనే విషయాన్ని బాగా అర్ధమయ్యేలా చెప్పి ఒప్పించండి. న్యాయస్థానంలో ఏవైనా సమస్యలుంటే రాజీమార్గాన్ని ఆశ్రయించి సరిచేసుకునే ప్రయత్నం చేసుకోండి. లేని పక్షంలో మీ వ్యక్తిగత కార్యాలన్నిటికీ ఈ రాకపోకలు అటు ధనపరంగానూ అటు సహాయపరంగానూ నష్టపరుస్తాయని గమనించండి.

లౌకిక పరిహారం: విద్యార్థుల్లో విద్యేతరదృష్టీ వ్యాపార దృష్టీ రాకుండా చూసుకోండి.
అలౌకిక పరిహారం: శ్రావణమంగళవారం ముల్తైదువులకి పులిహోరనిచ్చి పాదాభివందనం చేసి రండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top