మూడు..ప్రగతికి తోడు..

YV Subbareddy Rally For Support Three Capitals - Sakshi

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానులు

సీఎం ప్రతిపాదనకు మద్దతుగా రావులపాలెంలో ర్యాలీ

పాల్గొన్న టీటీడీ చైర్మన్‌ వైవీ

సుబ్బారెడ్డి, మంత్రులు మోపిదేవి, బోస్, శ్రీరంగనాథరాజు

రావులపాలెం: రాష్ట్ర విభజనతో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని తిరుమల – తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు రావులపాలెంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కళావెంకట్రావు సెంటర్‌ నుంచి రింగ్‌రోడ్డు మీదుగా ట్రాన్స్‌కో కార్యాలయం వరకూ జరిగిన ఈ ర్యాలీలో వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్‌ శాఖల మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యేలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం స్థానిక నాయకులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డిలను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, వాడపల్లి దేవస్థానం చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, గనిశెట్టి రమణలాల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్‌ కన్వీనర్‌ మార్గన గంగాధరరావు, మిండగుదిటి మోహన్, పీకే రావు, మట్టపర్తి నాగేంద్ర, రెడ్డి రాధాకృష్ణ, జిల్లా పారిశ్రామిక విభాగం కన్వీనర్‌ మంతెన రవిరాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, మాజీ ఎంపీపీ కోట చెల్లయ్య, సేవాదళ్‌ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మూడు రాజధానులతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి
ప్రస్తుత పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రావులపాలెం సీఆర్‌సీ ఓల్డేజ్‌ హోమ్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు వల్ల పంటలు పండే భూముల రైతులు నష్టపోతారని, ఆ ప్రాంతానికి ముంపు ప్రమాదం ఉందని గతంలో శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందని, అయినప్పటికీ స్వలాభం కోసం చంద్రబాబు ప్రభుత్వం అక్కడే రాజధాని ఏర్పాటు చేసిందని అన్నారు. ఇప్పటివరకూ రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ అక్కడ సరైన రోడ్లు, విద్యుద్దీపాలు లేవని అన్నారు. రాత్రయితే రాజధాని ఎక్కడుందో వెతుక్కోవాల్సిన దుస్థితి ఉందన్నారు. రూ.లక్ష కోట్ల సంపాదనకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప, రాజధాని నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం ఎంతమాత్రమూ శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి రాజధాని నిర్మించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని, కర్నూలులో జ్యుడీషియల్‌ రాజధాని ఏర్పాటు చేసుకుని, ప్రస్తుత అమరావతిలో ఉన్న తాత్కాలిక భవనాలతో లెజిస్లేటివ్‌ రాజధాని కొనసాగించుకోవడం మంచిదని వివరించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. జీఎన్‌ రావు కమిటీ నివేదిక కూడా రాజధానిపై ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. త్వరలో జరిగే క్యాబినెట్‌ సమావేశంలో దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు.

నవరత్న హామీల అమలు దిశగా..
నవరత్న హామీలను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అమలు చేయాలన్న కృతనిశ్చయంతో సీఎం జగన్‌ ముందుకు సాగుతున్నారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆరు నెలల్లోనే 60 శాతం హామీలు అమలు చేశారన్నారు. రాష్ట్రంలో 4 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 40 వేల మందికి గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రైతుభరోసా పథకం కింద 6.60 లక్షల మంది రైతులకు రూ.306 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఆక్వా రైతులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. ఆక్వాకల్చర్‌ కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్న విషయాన్ని జగన్‌ తన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారన్నారు. ఈ జిల్లాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా నివారించి, ప్రతి ఇంటికీ కుళాయి ఏర్పాటు చేసేలా సుమారు రూ.8 వేల కోట్లతో మంచినీటి పథకం సిద్ధమవుతోందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారని, అలాగే, సీఎం జగన్‌ జనవరి 9న అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నారని అన్నారు. కడప జిల్లా వాసుల కల అయిన స్టీల్‌ప్లాంట్‌ను త్వరలో రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనుందని చెప్పారు. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఇటీవలే ప్రతి నేతన్న కుటుంబానికీ ఏడాదికి రూ.24 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారని సుబ్బారెడ్డి చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top