హక్కుల సాధన కోసం ‘అనంత’లో యువభేరి

Yuvabheri at ananthapur for the right of the Andhra people - Sakshi

ఈ నెల 10న నిర్వహించనున్న సదస్సుకు హాజరుకానున్న వైఎస్‌ జగన్‌ 

ఉత్సాహంగా పాల్గొనడానికి ఎదురు చూస్తున్న విద్యార్థులు  

హోదాతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలొస్తాయంటున్న యువత 

మూడేళ్లుగా పోరాటం సాగిస్తున్న వైఎస్సార్‌సీపీ 

సాక్షి, అమరావతి/అనంతపురం : విభజన వల్ల అన్ని విధాలా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవనిగా భావించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తొలి నుంచీ పోరాడుతోంది. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే రాయితీలొస్తాయి.. రాయితీలొస్తే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి.. పెట్టుబడులు వస్తే లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని ఆది నుంచి వివరిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. విద్యార్థులు, యువతతో మమేకమవుతూ హోదా ఆవశ్యకత గురించి వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి దాకా తొమ్మిది చోట్ల ‘యువభేరి’ సదస్సులు నిర్వహించారు.

ఈ సదస్సులకు విద్యార్థులు, మేధావులు, యువత నుంచి భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన అనంతపురం జిల్లాలో మళ్లీ ఆ పార్టీ యువభేరిని నిర్వహించబోతోంది. ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో జరగనున్న ఈ యువభేరిలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. గుంటూరులో 2015 అక్టోబర్‌ 7 నుంచి 13వ తేదీ వరకు వైఎస్‌ జగన్‌ ఏడు రోజుల పాటు నిరవధిక దీక్షను చేపట్టి ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.

హోదా కోసం ఎందాకైనా..
ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతను వివరిస్తూ 2015 సెప్టెంబర్‌ 15వ తేదీన తిరుపతిలో తొలిసారి నిర్వహించిన ‘యువభేరి’ బ్రహ్మాండంగా విజయవంతం అయింది. అప్పటి నుంచి దశల వారీగా వరుసగా విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, విజయనగరం, గుంటూరులో 9 యువభేరీలు జరిగాయి. గుంటూరులో ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఈ సదస్సు నిర్వహించాక, ప్రస్తుతం  ఈ నెల 10వ తేదీన అనంతపురంలో యువభేరి జరుగబోతోంది. ఫిబ్రవరి తర్వాత విద్యార్థుల  పరీక్షలు ఉండటం.. అదే సమయంలో ఉద్యోగార్థులు పోటీ పరీక్షల  కారణంగా యువభేరీలకు తగిన సమయం కాదని వైఎస్సార్‌ సీపీ కొంత కాలం పాటు వాయిదా వేసింది.

హోదా వద్దన్నారు.. : రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 ఏళ్లు కాదు.. 15 ఏళ్లు కావాలని ఎన్నికల సమయంలో ఊరూరా నినదించిన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక ఆ ఊసే ఎత్తక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ పెద్దలు రాని ప్యాకేజీని చూపించి.. అసలు ప్రత్యేక హోదానే అవసరం లేదని చెప్పారు. అటు ప్యాకేజీ రాక, ఇటు హోదా దక్కక రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. కేంద్రంలో అధికారం పంచుకుంటూ.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడని టీడీపీ.. హోదా కోసం పోరాడుతున్న ప్రతిపక్షం పైనే ఎదురు దాడి చేస్తోండటం గమనార్హం. ఈ పరంపరలో విద్యార్థి, యువజనులను మరోమారు జాగృతం చేసేందుకు ఈ నెల 10న అనంతపురంలోని బళ్లారి రోడ్డులోగల ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాలులో జరగనున్న యువభేరి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top