గుండెల్లో్ల పెట్టుకుంటా!

YSRCP YS Jagan Meeting in YSR Kadapa - Sakshi

మా కుటుంబాన్ని ఆదరించి అక్కున చేరుకున్నారు..

మీ గుండె చప్పుడే ధైర్యం నింపింది

సొంత కొడుకుగా దీవించి పంపారు..

పదేళ్లు కష్ట నష్టాలకోర్చి నావెంటే ఉన్నారు..

ర్యాంప్‌పై నడక.. కార్యకర్తలతో ముఖాముఖీ

ఆకట్టుకున్న కడప యాసతో సంబోధన..

సాక్షి ప్రతినిధి కడప: ఎక్కడైనా రాజకీయ పార్టీల్లో కార్యకర్తలని పిలుస్తారు. మీరు కార్యకర్తలు కాదు.. వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు. మిమ్మల్ని గుండెళ్లో పెట్టుకుంటా. ఈగడ్డ నాకు, నా కుటుంబానికి అండగా నిలిచింది. మూడు దశాబ్దాలుగా జిల్లా వాసులు రాజకీయంగా మా వెన్నంటే ఉన్నారు. 1978లో నాన్నగారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. నాన్న గారి జీవితంలో కేవలం 5 సంవత్సరాల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 31 సంవత్సరాలపాటు నాన్నగారిని ఈ జిల్లా గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. 2009లో చనిపోయారు. ఆ బాధలో నుంచి బయట పడటానికి ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా? మీ గుండె చప్పుడు నుంచే వచ్చింది. నాన్న ఎక్కడికీ పోలేదు.. చనిపోతూ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని ధైర్యం వచ్చింది. నాన్న చనిపోయి 2019కి పదేళ్లు కావస్తోంది. ఆయన పోయిన తర్వాత జగన్‌ అనే నన్ను కొడుకుగా ఆదరించింది ఈ జిల్లా. మీరు ఆదరించారు కాబట్టే, దీవించి పంపారు కాబట్టే రాష్ట్రం వైపు నేను కన్నెత్తి చూడగలుగుతున్నానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పేర్కొన్నారు. గురువారం కడప మున్సిపల్‌గ్రౌండులోనిర్వహించిన సమరశంఖారావం సూపర్‌ సక్సెస్‌ అయింది.

ఆకట్టుకున్న చంద్రబాబు సినిమా కథలు..
వైఎస్సార్‌సీపీ బూత్‌ కమీటీలను ఉద్దేశించి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాల హామీలు గుప్పించిన వైనం, 2014 ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకహోదా నీరుగార్చిన నేపథ్యం, నాలుగున్నరేళ్ల తర్వాత బీజేపీతో తెగతెంపులు చేసుకొని ధర్మపోరాటదీక్షలు పేరుతో చేపట్టిన నాటకం, అసెంబ్లీ వేదికగా అవలంభిస్తోన్న తీరు, నవరత్నాలను కాపీ కొడుతూ ఓట్ల గాలం వేస్తున్న వైనంపై ‘ఎన్నికలకు 6నెలల ముందు, 3నెలల కోసం’ ప్రత్యేకంగా సినిమాలు చూపుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరించిన వైనం శ్రేణులను ఆకట్టుకుంది. చంద్రబాబు చేపట్టిన సినిమాలను అక్కచెల్లెమ్మలకు, అవ్వతాతలకు, అన్నతమ్ముళ్లుకు, స్నేహితులకు వివరించాలని సూచించారు. చంద్రబాబు నక్కజిత్తుల ఎత్తులను పసిగట్టి అప్రమత్తంగా ఉండాలని ఓటరు లిస్టులు తనిఖీ చేస్తూ, తొలిగించిన ఓట్లును ఫారం–6 ద్వారా తిరిగి చేర్పించాలని అందులో బూత్‌ కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.

ర్యాంప్‌పై నడక..
ప్రతిపక్షనేత ప్రసంగం ముగియగానే బూత్‌కమిటీ కన్వీనర్లతో ముఖాముఖి నిర్వహించారు. ర్యాంప్‌ పై నడుస్తూ పార్టీ శ్రేణులు రాసిఇచ్చిన ప్రతులను రాజంపేట, కడప పార్లమెంటు అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కొత్తమద్ది  సురేష్‌బాబు చదివి విన్పిస్తే అందుకు సమాధానాలు ఇస్తూ శ్రేణుల మధ్యకు కదిలారు. బి.మఠంకు చెందిన బద్వేల్‌ శ్రీనివాస్, లక్కిరెడిడపల్లెకు చెందిన అహమ్మద్‌ బాషా, జమ్మలమడుగు చెందిన ఉదయ్, హనుమంతరెడ్డిలు, ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్‌యాదవ్, రైల్వేకోడూరుకు చెందిన వెంకటరమణలు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. ఈసందర్భంగా ఆరోగ్యశ్రీ పటిష్టం చేస్తామని రూ.1000 పైబడిన వైద్యఖర్చులను పూర్తిగా భరించేలా పథకాన్ని రూపొందిస్తామని, కుటుంబ పెద్ద ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయించుకొని తర్వా త విశ్రాంతిలో ఉన్న కాలనీ కుటుంబపోషణ నిమిత్తం నెలకు రూ.10వేలు చెల్లిస్తామని ప్రకటించారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరో గ్యం, విద్యకు ప్రత్యేక శ్రద్ధ చూపారని, కొడుకుగా నేను మరో రెండు అడుగులు ముందుకు వేస్తానని స్పష్టం చేశారు. తరతమ భేదం లేకుండా అర్హులందరీకి సంక్షేమపథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఖాళీలున్నా ఉద్యోగాలన్నీ ఏపీపీఎస్‌సీ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు.

కొంచెం వెనక్కి జరగాలబ్బా..
ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో మూడుసార్లు మైక్‌ కట్‌ అయింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎగబడి మైకు సిస్టమ్‌ వైర్లపై పడడంతో మైక్‌ పనిచేయలేదు. ఈ సందర్భంగా ఆయన జోక్యం చేసుకొని ‘మైకు మీద నుంచి కొంచెం వెనక్కి జరగాలబ్బా’ మీరే మైకు మీద పడితే ఎట్లన్నా.. అంటూ సంబోధించారు. శ్రేణులను ఆకట్టుకుంది. ఎర్ర టీషర్టు కొంచెం తప్పుకోబ్బా.. ఓ టోపీ కొంచెం ప్రక్కకు రా.. ఇలా వ్యాఖ్యానించడాన్ని ఆసక్తిగా విన్నారు. ప్రతిపక్షనేతతో సెల్పీల కోసం అటు అన్నపిలుపు కార్యక్రమానికి వెళ్లిన గ్లోబల్‌ కళాశాల వద్ద, ఇటు సమరశంఖారావం కార్యక్రమంలో అభిమానులు ఎగబడ్డారు.

కార్యకర్తల సమరోత్సాహం..
రాబోయే ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా జాగ్రతలు పాటించాలని, చంద్రబాబు సర్కార్‌ కుయుక్తులను కనిపెట్టాలని, ప్రజలను మభ్యపెడుతున్న  వైనాన్ని ఎండగట్టాలని అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం కార్యకర్తలల్లో సమరోత్సహం నింపింది. బూత్‌ కమిటీలకు దిశానిర్దేశం లక్ష్యం నెరవేరడంపై పార్టీ శ్రేణులు ఆనందడోలికలల్లో ఉన్నాయి. కడప గడపలో ఉక్కుఫ్యాక్టరీ నెలకొల్పే బాధ్యత తనదేనని ఘంటాపథంగా చెప్పడాన్ని జిల్లా వాసులు హర్షించారు. ఉదయం నుంచే సభా ప్రాంగణానికి చేరుకోవడం ఆరంభించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన శ్రేణులు అభిమాన నేత కోసం నిరీక్షించారు. వారి నిరీక్షణకు తగ్గట్లుగా ప్రసంగం ఉండడంతో హర్షం వ్యక్తం చేయసాగారు.

వినయం, సంస్కారంతో కట్టిపడేసిన జన నేత
ముందుగా నిర్ణయించినదాని ప్రకారం 11 గంటలకు కడప గ్లోబల్‌ కళాశాలలో అన్నపిలుపు కార్యక్రమంలో భాగంగా తటస్థులతో ముఖాముఖి సమావేశానికి హాజరయ్యేందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి విమానంలో కడపకు చేరుకున్నారు. రోజూ 10.20 గంటలకు వచ్చే విమా నం గురువారం గంట ఆలస్యంగా చేరుకుంది. విమానాశ్రయం నుంచి నేరుగా గ్లోబల్‌ కళాశాలకు 12.10 గంటలకు చేరుకున్న ఆయన తన తప్పు లేకపోయినా.. మీరంతా నిరీక్షించినందుకు ముందుగా క్షమాపణ కోరుతున్నా.. విమానం గంట ఆలస్యమైందని వివరించారు. వైఎస్‌ జగన్‌ అలా క్షమాపణ కోరి వారి అభిమానాన్ని చూరగొన్నారు. వినయం, సంస్కారంలో మేటిగా నిలుస్తున్న తీరు వారిని ఆకట్టుకుంది. దేశం కోసం పరితపిస్తున్న మాజీ సైనికుల గౌరవాని కి భంగం కలగకుండా చూస్తామని హామీ ఇవ్వడం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పట్ల సానుకూలతతో ఉంటామని, మానవీయ విలువలను కాపాడతామని భరోసా ఇవ్వడాన్ని మేథావులు హర్షించారు.

రోడ్డుపై నిలిచిపోయిన శ్రేణులు..
వైఎస్సార్‌సీపీ సమరశంఖారావం సభకు 25వేల మంది బూత్‌కమీటీ సభ్యులు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అందుకోసం పటì ష్ట ఏర్పాటు చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. అంచనాలు మించి రావడం ఎర్రటి ఎండను లెక్కచేయకుండా సభా ప్రాంగణంలో తిష్ట వేయసాగారు. కాగా పోలీసులు ఆంక్షలు కారణంగా దాదాపు సగం మంది శ్రేణులు రోడ్లుపై నిలిచిపోయారు. నగరంలో పలుచోట్లు పోలీసులు సభకు వెళ్లే వారిని నియంత్రించడంపై ఆవేదన వ్యక్తం చేయసాగారు. ఎంతో దూరం నుంచి వచ్చినా పోలీసులను దాటుకొని సభలోకి వెళ్లలేకపోయామనే బాధను వెళ్లగక్కడం విశేషం.

మీ బాగోగుల బాధ్యత నాదే...
పదేళ్లుగా మీరంతా ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు. అవమానాలు సహించారు.. కేసులు భరించారు.. లాఠీ దెబ్బలు తిన్నారు.. కొందరు ఆస్తులు.. మరికొందరు కుటుంబ సభ్యుల ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. ఈ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మీకు తగిలిన ప్రతి దెబ్బ నా గుండెకు కూడా తగిలిందన్న విషయాన్ని కచ్చితంగా చెబుతున్నాను. రేపు పొద్దున దేవుడు, ప్రజలు ఆశీర్వాదిస్తాడన్న నమ్మకం నాకుంది. నేను మీకందరికీ ఒక మాట చెబుతూ ఉన్నాను. మీ బాగోగులన్నీ నేను చూసుకుంటానని మాత్రం గట్టిగా చెబుతున్నా. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తీసుకొస్తా. అన్ని రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు అంటారు, వైఎస్సార్‌ సీపీలో ఉన్న మీరంతా నా కుటుంబ సభ్యులని చెబుతాను. ప్రజల చల్లని ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వచ్చాక కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేద వాడికి అందించడంలో మీ అందరి పాత్ర క్రియాశీలకంగా ఉంటుందని ప్రతిపక్షనేత వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

జననేతకు ఘన స్వాగతం
కడప అర్బన్‌: వైఎస్సార్‌సీపీ సమరశంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి గురువారం కడప విమానాశ్రయంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. కడప మాజీ ఎంపి వైఎస్‌ అవినాష్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్‌బాష, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి,  అఫ్జల్‌ఖాన్, బివై రాములు, హఫీజుల్లాలతో పాటు పలువురు నేతలు అభిమానులు పాల్గొన్నారు. ఆయన కడప విమానాశ్రయం చేరుకోగానే.. జై జగన్‌ అంటూ జ«యధ్వానాలు పలికారు. అక్కడి నుంచి కడప నగర శివార్లలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ  కొమ్మా వారు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో కొమ్మా సోమశేఖర్‌ రెడ్డి, జనార్ధన్‌ రెడ్డి, డాక్టర్‌ ప్రణీత్‌ రెడ్డి, రాం పవన్‌ రెడ్డి లతో పాటు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు వున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top