సిక్కోలు సింహనాదం

YSRCP Won 8 Seats In Srikakulam District - Sakshi

ఎనిమిది స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయహాసం

ప్రభుత్వ విప్‌ కూనకు పరాభవం

మార్పు కోరుతూ సిక్కోలు తీర్పు చెప్పింది.. రామ రాజ్యం కోసం రాజన్న బిడ్డకే పట్టం కట్టింది.. జనం కోసం జనం మధ్య జనం కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగిన బహుదూరపు బాటసారికి విజయం కట్టబెట్టింది.. సత్యమేవ జయతే అని మరోసారి నిరూపించింది.. జననేత వైఎస్‌ జగన్‌ను సింహాసనం ఎక్కించి తనను తాను విజేతగా ప్రకటించుకుంది.. మంచి రోజుల కోసం.. దుర్మార్గ పాలన నుంచి విముక్తి కోసం.. తిరుగులేని తీర్పు చెప్పింది.. వైఎస్సార్‌సీపీ తరపున జిల్లాలో ఎనిమిది మందిని అసెంబ్లీకి పంపింది.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  టీడీపీ ఆవిర్భావం నుంచీ కంచుకోటగా ఉన్న సిక్కోలు గడ్డపై వైఎస్సార్‌సీపీ విజయపతాకం ఎగురవేసింది. ఫ్యాన్‌ స్పీడ్‌కు సైకిల్‌కు పంక్చర్‌ అయ్యింది. పది అసెంబ్లీ స్థానాల్లో ఇచ్ఛాపురం, టెక్కలి మినహా మిగిలిన ఎనిమిది స్థానాల్లో జగన్‌ సేన ఘనవిజయం సాధించింది. 2009 ఎన్నికలలో తొలిసారిగా టీడీపీ కంచు కోటను బద్ధలుకొట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కింది! ఇప్పుడు మరోసారి అంతటి విజయాన్ని ఆయన కుమారుడు జగన్‌ నాయకత్వంలో సాధ్యమైంది. శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఘన విజయంతో ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌ సోదరులు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం కూడా ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ను ఆమదాలవలసలో మట్టికరిపించారు. రాజాం, పాలకొండ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి భారీ మెజార్టీతో మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

ఎచ్చెర్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావును భారీ మెజార్టీతో మట్టి కరిపించిన గొర్లె కిరణ్‌కుమార్‌ అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. అలాగే పలాసలో గౌతు కోటపై విజయ పతాకం ఎగురవేసిన డాక్టరు సీదిరి అప్పలరాజు, పాతపట్నంలో టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణను మట్టి కరిపించిన రెడ్డి శాంతి కూడా తొలిసారిగా చట్టసభ గడపతొక్కనున్నారు. జిల్లాలో టీడీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపు దక్కించుకుంది. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ ముచ్చెమటలు పట్టించారు. చివరి రౌండ్లలో ఓట్లు కలిసిరావడంతో అచ్చెన్న స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కగలిగారు. ఇచ్ఛాపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పిరిమా సాయిరాజ్‌పై టీడీపీ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ గెలుపొందారు.

మార్పు కోసం తీర్పు
గత నెల 11వ తేదీన జరిగిన 2019 సాధారణ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. జిల్లావ్యాప్తంగా 2,905 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరిగిన ఈవీఎంలకు సంబంధించి కంట్రోల్‌ యూనిట్లను తెరచి అభ్యర్థుల భవిష్యత్తును తేల్చారు. ఎచ్చెర్లలోని శ్రీశివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో అత్యంత భద్రత ఏర్పాట్ల మధ్య కౌంటింగ్‌ ప్రారంభించారు. దాదాపు 20 వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. తన తండ్రి వైఎస్‌ఆర్‌ మాదిరిగానే సుదీర్ఘ పాదయాత్రతో జిల్లాలో గత ఏడాది నవంబరు నెలలో అడుగుపెట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతమైనప్పుడే 2019 ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందనే సంకేతాలు వెలువడ్డాయి. వైఎస్సార్‌ సంక్షేమ పథకాల స్ఫూర్తితో జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో పాటు బీసీ డిక్లరేషన్, సామాజిక వర్గాలవారీగా కార్పొరేషన్ల ఏర్పాటు హామీలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. వాటికి తోడు ప్రజలు ‘మార్పు’ను బలంగా కోరుకోవడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా గెలుపు బాటపట్టడానికి మార్గం సుగమమైంది.

పలాస: ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తరఫున ప్రముఖ వైద్యుడు, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన డాక్టరు సీదిరి అప్పలరాజు పోటీ చేశారు. టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గౌతు శివాజీ ఈసారి పోటీ నుంచి తప్పుకొని తన వారసురాలైన శిరీషను బరిలో నిలిపారు. అయితే ఆయన అనుచరుల అవినీతి, స్వలాభాపేక్షతో పాటు అల్లుడు యార్లగడ్డ వెంకన్న చౌదరి దూకుడు ధోరణితో పలాస ప్రజలు విసిగిపోయారు. ఈ ప్రభావంతో టీడీపీకి వ్యతిరేక పవనాలు బలంగా వీచాయి. మత్స్యకారులు కూడా తమ సామాజికవర్గానికి గుర్తింపు ఇచ్చిన వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారు. దీంతో పలాసలో సీదిరి విజయం సునాయాసమైంది. 20 రౌండ్లుగా జరిగిన కౌంటింగ్‌లో ఆయన ప్రతి రౌండులోనూ శిరీషపై ఆధిపత్యం కనబర్చారు. మొత్తంమీద 16,033 ఓట్ల భారీ ఆధిక్యంతో గౌతు కోటలో పాగా వేశారు.

శ్రీకాకుళం: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఘనవిజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ తరఫున బరిలోకి దిగిన ఆయనకు పోటీగా టీడీపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో పాటు జనసేన అభ్యర్థిగా కోరాడ సర్వేశ్వరరావు, కాంగ్రెస్‌ తరఫున చౌదరి సతీష్, బీజేపీ అభ్యర్థిగా చల్లా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. గత ఎన్నికలలో లక్ష్మీదేవిని గెలిపించినా ఐదేళ్లలో అభివృద్ధి ఛాయలు ఏమీ కనిపించకపోవడం, టీడీపీ నాయకులు అవినీతి వ్యవహారాలు పెచ్చుమీరడం తదితర కారణాలతో శ్రీకాకుళం ప్రజలు మరోసారి ధర్మాన నాయకత్వం వైపు మొగ్గుచూపించారు. నియోజకవర్గం అభివృద్ధి ధర్మానకే సాధ్యమనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీంతో ఆయన 4,496 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి గుండ లక్ష్మీదేవిపై విజయం సాధించారు.

ఎచ్చెర్ల: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకటరావును వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గొర్లె కిరణ్‌కుమార్‌ కంగుతినిపించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి అభిమానాన్ని సంపాదించుకోవడం ఆయనకు గెలుపు బాట వేసింది. కళా స్థానికేతరుడు కావడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, స్థానిక సమస్యలను గాలికొదిలేయడం, టీడీపీ నాయకుల అవినీతి పెచ్చుమీరడం వంటి కారణాలతో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు బలంగా వీచాయి. దీంతో కళాపై 18,456 ఓట్ల ఆధిక్యం కిరణ్‌కు లభించింది.

రాజాం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంబాల జోగులును ఢీకొట్టేందుకు మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ను కాంగ్రెస్‌ నుంచి తీసుకొచ్చి మరీ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయించినా చంద్రబాబు ఎత్తుగడ ఫలించలేదు. కోండ్రుపై 17,440 ఓట్ల మెజార్టీతో జోగులు విజయం సాధించారు.

పాతపట్నం: గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలిచిన కలమట వెంకటరమణ తర్వాత చంద్రబాబు ప్రలోభాలతో టీడీపీలోకి ఫిరాయించిన విషయాన్ని ఈ నియోజకవర్గం ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈసారి ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయనకు తగిన బుద్ధి చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి పట్టంకట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు పోలింగ్‌ సరళిని బట్టి చెప్పవచ్చు. మరోవైపు వంశధార నిర్వాసితులకు పరిహారం పంపిణీలో వెల్లువెత్తిన అవినీతి వ్యవహారాలు కూడా టీడీపీ వ్యతిరేక ఓటింగ్‌కు కారణమయ్యాయి. చివరి వరకూ ఎంతో ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో కలమటను రెడ్డి శాంతి 15,551 ఓట్ల మెజార్టీ సాధించి మట్టి కరిపించారు.

నరసన్నపేట: వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌కు, టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇసుక అక్రమ రవాణా, కాంట్రాక్టు పనుల్లో అవినీతి, ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేయడం వంటి కారణాలతో బగ్గుకు ఈసారి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీనికితోడు ప్రజలు మరోసారి మార్పును కోరుకోవడంతో సౌమ్యుడైన కృష్ణదాస్‌ విజయానికి మార్గం సుగమైంది. బగ్గుపై 19,129 ఓట్ల మెజార్టీ సాధించారు.

పాలకొండ: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 17,156 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. నిత్యం ప్రజలతో మమేకం కావడం, గిరిజనుల సమస్యలపై పోరాటం చేయడం ఆమె గెలుపునకు బాటలు వేశాయి.

ఆమదాలవలస: మాజీ మంత్రి తమ్మినేని సీతారాం భారీ మెజార్టీతో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను మట్టికరిపించారు. ఇసుక మాఫియాకు అండదండలు అందించడంతో పాటు అధికారులపై విరుచుకుపడటం వంటి దూకుడు వైఖరితో కూన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. మరోవైపు సొంత పార్టీలో గ్రూపులను ప్రోత్సహించడంతో నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలు ఈసారి తమ్మినేని నాయకత్వానికే మొగ్గు చూపించారు. కూనపై 13,856 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

టీడీపీ ఖాతాలో రెండు స్థానాలు...
టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ∙పేరాడ తిలక్‌పై 8,505 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ చేతిలో 8,488 ఓట్ల తేడాతో ఓడిపోయారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top