పవన్‌.. టీడీపీ తొత్తులా వ్యవహరించకు..

YSRCP Spokesperson Konda Rajiv Gandhi Criticizes Pawan Kalyan - Sakshi

బాబు డైరెక్షన్‌లో ఉన్న నీకు సీఎంను విమర్శించే అర్హత లేదు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ

సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సొంత అజెండాను గాలికొదిలేసి టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ మండిపడ్డారు. శుక్రవారం మద్దిలపాలెంలోని ఆ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజీవ్‌ మాట్లాడారు. గాజువాకలో పవన్‌ను నమ్మి 58 వేల మంది ఓట్లు వేస్తే .. ఓటమి తర్వాత వారిని పట్టించుకోకుండా ఇసుక కోసం బీచ్‌లో మార్చ్‌ చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్‌ చేపట్టబోయేది లాంగ్‌మార్చ్‌ కాదని..చంద్రబాబు డైరెక్షన్‌లో రాంగ్‌మార్చ్‌ అని విమర్శించారు.

బాబుకు దత్తపుత్రుడిలా..
చంద్రబాబుకు లోకేష్‌ సొంత కుమారుడైతే..పవన్‌ కల్యాణ్‌ దత్తత పుత్రుడని ఎద్దేవా చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో 45 నిమిషాల పాటు చర్చలు జరిపితే చంద్రబాబుకు కడుపు మండినట్టుగా ఉందని, అందుకే ఆయన దత్తతపుత్రుడైన పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దించి విమర్శలు చేయిస్తున్నాడన్నారు.   పవన్‌ నిర్మాణ కార్మికుల మీద కపటప్రేమ మాని జనసేన నిర్మాణం మీద దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. వర్థంతికి జయంతికి తేడా తెలియని లోకేష్,  ఇంటర్వ్యూకు అపాయింటెమెంట్‌కు తేడా తెలియని పవన్‌కు చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్‌ ఇదేనా అని ఎద్దేవా చేశారు.  రాజకీయ పరిజ్ఞానం నేర్చుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు పవన్‌కల్యాణ్‌ , ఆయన డైరెక్టర్‌ చంద్రబాబుకు లేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top