అధికారులను పని చేయనిస్తున్నారా?

అధికారులను పని చేయనిస్తున్నారా? - Sakshi


చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల

రాష్ట్రంలో పనిచేయలేక పోతున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరి వల్ల రాష్ట్రంలో అధికారులు గాని, ఐఏఎస్, ఐపీఎస్‌లు గాని పని చేసే పరిస్థితుల్లో లేరని, అసలు టీడీపీ పాలనలో అధికారులకు అధికారాలు న్నాయా? అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు అసలు పనిచేయడం లేదని చంద్రబాబు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. టీడీపీ ప్రభుత్వంలో అధికారులకు అసలు అధికారాలున్నాయా? వారిని పనిచేయనిచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగేతరమైన జన్మభూమి కమిటీలతో చంద్రబాబు నాయుడు ఇప్పటికీ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.ఆ కమిటీల ఆధ్వర్యంలోనే పనులు చేయాలని లేకపోతే వద్దని చంద్రబాబు ఇదివరకు జరిగిన కలెక్టర్ల సమావేశాల్లో ఆదేశాలు జారీ చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నాయకులు ఏం చేసినా చూసీచూడనట్టు ఉండండని కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు ఆదేశాలివ్వడం దారుణమని ధ్వజమెత్తారు.  ఐఏఎస్‌ , ఐపీఎస్, గ్రూప్‌ 1 అధికారులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా ఉంటే తప్ప మర్యాద ఉండదంటూ బాబు మౌఖికంగా ఆదేశాలిచ్చి పరిపాలనను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. అధికారుల సంతకాలు లేకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి సీఎం పేషీలో ఎంత దుర్మార్గంగా జీవోలు రూపొందిస్తున్నారో,  ఎన్ని కుంభకోణాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ వెల్లడించిన సంగతిని కొరుముట్ల గుర్తు చేశారు. ఐవైఆర్‌ చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధం కావాలని అని టీడీపీకి ఆయన సవాలు విసిరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top