వైఎస్‌ జగన్‌తోనే బీసీల అభ్యున్నతి

YSRCP Meeting in West Godavari - Sakshi

జీవన ప్రమాణాల మెరుగునకు ప్రణాళిక

ఎన్‌టీఆర్, వైఎస్‌ఆర్‌లా జగన్‌తో స్వర్ణయుగం

టీడీపీ తీరుపై మండిపడిన బీసీ సామాజిక వర్గాల నేతలు

ఏలూరులో బీసీ అధ్యయన కమిటీ సమావేశానికి విశేష స్పందన

అండగా నిలుస్తామని జంగా కృష్ణమూర్తి, ఆళ్లనాని హామీ

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: ఏళ్ల తరబడి రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తూ.. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజికవర్గాలు అణచివేతకు, నిరాదరణకు గురవుతూ అభివృద్ధికి నోచుకోవటంలేదని.. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావాల్సిన సమయం ఆసన్నమైందని.. బీసీలంతా సమష్టిగా ముందుకు సాగుతూ తమ రాజ్యాంగ పరమైన హక్కుల సాధనకు కలిసి రావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆళ్ల నాని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు, రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఏ విధమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయాలనే అంశంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించిన బీసీ అధ్యయన కమిటీ సమావేశం ఏలూరులోని చింతలపూడి రోడ్డు సుఖీభవ ఫంక్షన్‌ హాలులో బుధవారం నిర్వహించారు.

ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఈ సమావేశానికి బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు అధ్యక్షత వహించారు. తొలుత మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎమ్మెల్సీ ఆళ్లనాని, జంగా కృష్ణమూర్తి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ అధ్యయన కమిటీ సమావేశానికి బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల నాయకులు భారీ సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను, బాధలను కమిటీకి వివరించారు. వినతులు అందించారు. బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి, రాజ్యాంగ హక్కుల సాధనకు ఏమి చేయాలి అనే అంశాలపై సుదీర్ఘంగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.

అత్యధికంగా 54 శాతం జనాభా కలిగిన బీసీ వర్గాలు నేటికీ నిర్లక్ష్యానికి గురుతున్నాయని, టీడీపీ ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్‌టీఆర్‌తో కొంతమేర బీసీలకు న్యాయం జరిగిందని, ఆయన మరణానంతరం బీసీలను పట్టించుకున్న నాథుడే లేడన్నారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను ఆదుకునేందుకు, న్యాయం చేసేందుకు, అన్ని రంగాల్లోనూ బీసీలకు పెద్దపీట వేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీసీ వర్గాల బాధలు, కష్టాలు తెలుసుకోవటం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీసీల సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు.

ఎమ్మెల్సీ ఆళ్లనాని మాట్లాడుతూ చిత్తశుద్ధి, నిజాయితీతో వైఎస్‌ జగన్‌ బీసీల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు అనేక పథకాలు అమలు చేస్తూ వారి అభ్యున్నతికి చర్యలు చేపడతారని తెలిపారు. చంద్రబాబు హయాంలో బీసీలు దారుణంగా వంచించబడ్డారని, వారికి అండగా వైఎస్సార్‌ సీపీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీసీ సెల్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ కర్నాటి ప్రభాకర్, కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య, దేవళ్ల రేవతి, సుగుమంచిపల్లె రంగన్న, దొండమల్ల పుల్లయ్య, పక్కి దివాకర్, డాక్టర్‌ వడ్డే సోమశేఖర్, అంగిరేకుల ఆదిశేషు ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరి, నూజివీడు సమన్వయకర్త మేకా ప్రతాప్‌ అప్పారావు, చింతలపూడి సమన్వయకర్త ఉన్నమట్ల ఎలీజా, పోలవరం సమన్వయకర్త తెల్లం బాలరాజు, ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, కైకలూరు సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్‌ఆర్‌), ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు నెరుసుచిరంజీవి, బీసీ సెల్‌ నగర అధ్యక్షులు కిలాడి దుర్గారావు, పార్టీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడిదేశి శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు మంచెం మైబాబు, రాష్ట్ర కార్యదర్శి రావూరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top