కాపీల రాయుడు.. చంద్రబాబు నాయుడు

YSRCP Leaders Slams Chandrababu Naidu in Tirupati - Sakshi

తిరుపతి సెంట్రల్‌ :కాపీల రాయుడు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు.బుధవారం రేణిగుంట మండలం కొత్తపాళెం వద్ద జరిగిన సమరశంఖారావం సభలో పలువురు నేతలు  మాట్లాడారు. మోసపూరిత వాగ్ధానాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత ఒక్క హామీని కూడా నెరవేరలేదని విమర్శించారు. ఐదేళ్లపాలన పూర్తి కావస్తుండడంతో జగనన్న పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శలు గుప్పించారు.

తాయిలాలకు ఓట్లు రాలవు
చంద్రబాబు ఇచ్చే తాయిళాలకు ఓట్లు రాలవు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారు.  డ్వాక్రా మహిళలకు పొస్ట్‌ డేటెడ్‌ చెక్కులిస్తున్నారు. సెల్‌ ఫోన్లు అంటారు. పది వేలంటారు. ఏవేవో చెబుతున్నారు. చంద్రబాబు ఎన్ని పథకాలు పెట్టినా ప్రజలు నమ్మరు. వైఎస్‌ జగన్‌కు అనుభవం తక్కువ అన్నట్టు గతంలో చంద్రబాబు మాట్లాడేవారు. ఇప్పుడు జగన్‌ పథకాలన్నింటినీ చంద్రబాబు కాపీ కొడుతున్నాడు. ప్రత్యేక హోదా కావాలని జగన్‌ అడిగితే.. చంద్రబాబు అప్పుడు ప్యాకేజీ కావాలన్నారు. చివరికొచ్చేసరికి ప్రత్యేక హోదా అని రాగం అందుకున్నారు. జగన్‌ నల్ల చొక్కా వేసుకుంటే.. ఆఖరుకు చంద్రబాబు దాన్ని కూడా కాపి కొట్టారు. నల్ల చొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. కాపీలు కొట్టేవారిని కాపీల రాయుడంటారు. వైఎస్సార్‌సీపీ బూత్‌ లెవల్‌లో మీటింగులు పెట్టడం మన వాళ్లందరికీ బూస్ట్‌లాంటిది. మరే ఇతర పార్టీల్లో ఇలాంటి మీటింగులు పెట్టలేదు. –ఆర్‌కే రోజా, ఎమ్మెల్యే, నగరి

ఓటర్ల జాబితాపై కన్నేసి పెట్టాలి
ఓటర్ల జాబితాపై పార్డీ కేడర్‌ కన్నేసి పెట్టాలి. చంద్రబాబు మన ఓట్లను తొలగిస్తారు. దొంగోట్లను చేర్పిస్తున్నారు. శ్రీకాళహస్తిలోనే పది వేల దొంగోట్లను టీడీపీ నాయకులు చేర్పించినట్టు తెలిసింది. ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఇలాంటివేవో చేస్తూనే ఉంటారు. భయపడాల్సిన పనిలేదు. మీ ప్రాంతాల్లో కొత్తగా ఓటర్లను చేర్పించి ఉంటే వెళ్లి పరిశీలించండి. మనవాళ్ల ఓట్లను తొలగించి ఉంటే వెంటనే నమోదు చేయించండి. ప్రజల డబ్బులు దోచేసి, వాటినే మళ్లీ తిరిగి ఎన్నికల్లో ఓట్ల కోసం ఖర్చుపెడుతారు. దొంగెత్తులు వేస్తారు. వాళ్లు ఇచ్చేది రెండు నెలలే అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. మనం అ«ధికారంలోకి వస్తే అన్ని సంక్షేమ పథకాలూ పేదలకు అందుతాయని జగనన్న మాటగా భరోసా ఇవ్వండి.   –బియ్యపు మధుసూధన రెడ్డి, సమన్వయకర్త, శ్రీకాళహస్తి

డ్రామాలు చేస్తున్నారు
నాలుగు సంవత్సరాల 10 నెలల కాలం పూర్తి కావస్తోంది. ఎన్నికలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలంతా డ్రామాలు ఆడుతున్నారు. వీళ్ల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. జగనన్న 3,600 కిలోమీటర్లు నడిచి, ప్రజల దగ్గరుకు వెళ్లారు. వారి కష్టాలను గుర్తించారు. అట్టడుగు వర్గాల కష్టాలను తీర్చేలా నవరత్న పథకాలను ప్రకటించారు. ఎన్నికలు వస్తుండడంతో చంద్రబాబు ఆ పథకాలను కాపీకొడుతున్నారు. ఇంత కాలం చంద్రబాబుకు పేదలు కనపడలేదు.–వెంకటే గౌడ్, పలమనేరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top