జనం...జనం...

YSRCP Leaders Slams Chandrababu Naidu In Praja Sankalpa Yatra  - Sakshi

విజయనగరం, ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్ర ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం ద్వారా తమ పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కరించేందుకు వీలుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రజల మద్దతుతో దిగ్విజయంగా కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సాలూరులో సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. సభా ప్రాంగణంలో ఎటు చూసినా జనం లెక్కకు మించి హాజరయ్యారు.  జనంతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు జగన్‌ సభకు హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ నాయకులు ఆశించిన దాని కంటే వారి అంచనాలకు అందనంత స్థాయిలో ప్రజలు హాజరై తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు. రానున్న ఎన్నికల్లో విజయం తథ్యమన్న రీతిలో జగన్‌ ప్రసంగానికి ప్రజలు జేజేలు పలికారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం, అరాచకాలపై జగన్‌ మాట్లాడిన సమయంలో జనం ప్రతి మాటకు స్పందిస్తూ తమ మద్దతు పలికారు. ఈ సభలో జిల్లా నాయకులు అధికార పార్టీ విధానాలపై విరుచుకుపడ్డారు. జిల్లా నేతల ప్రసంగాలు వారి మాటల్లోనే....

వైఎస్‌ హయాంలో స్కీంలు – బాబు హయాంలో స్కాములు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు (స్కీములు) అమలై లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారు. ప్రస్తుతం చంద్రబాబు హయాంలో అంతే సంఖ్యలో స్కాములు జరుగుతున్నాయి. ఇసుకలో స్కాం, నీరు–చెట్టులో స్కాం, ఉద్యోగాల్లో స్కాం, అమరావతి భూ సేకరణలో స్కాం, ఇలా అన్ని పథకాలు, రంగాల్లో స్కాములు నడిపిస్తున్నది సీఎం చంద్రబాబు నాయుడు. జ్వరాలతో అల్లాడుతున్న గిరిజన విద్యార్థులకు నేలపై కూర్చొండబెట్టి సెల్‌ఫోన్లు ఛార్జింగ్‌ పెట్టినట్టు సెలైన్‌ బాటిళ్లు ఎక్కించడం ముఖ్యమంత్రి సీనియారిటీని ఆదర్శంగా తీసుకున్నట్టుందిక్కడి వైద్యుల తీరు. విలువలు, విశ్వసనీయత ఉన్నది వైఎస్‌ కుటుంబ సభ్యులదే! జగన్‌ పాలన మనకు అవసరం.–పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే, కురుపాం

ప్రజలను వంచించేందుకే చంద్రబాబు హామీలు
చంద్రబాబు గత  ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కేవలం ప్రజలను మోసం చేయడానికేనన్న విషయం ప్రజలు గుర్తించారు. కాలినడకన దుమ్ము, ధూళి, ఎండ, వాన లెక్క చేయకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలనూ కలియతిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే! ప్రత్యేక హోదా కోసం ఎంపీల చేత రాజీనామా చేయించి ప్రధాని మోదీని సైతం ఎదిరించిన నాయకుడు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి. ఆంధ్రులు సాధించాల్సిన ప్రత్యేక హోదా ను ఆడ్డుకున్నది చంద్రబాబు నాయుడే! జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికే ప్రత్యేక హోదా వచ్చేది. మన బతుకులు బాగుపడేవి. మనం జగనన్నను నమ్ముకుంటే మనకు సంక్షేమంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకునేందుకు అందరం కంకణం కట్టుకుందాం.
–శతృచర్ల పరీక్షిత్‌ రాజు, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు

లంచాలు ఇస్తే కానీ...
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో లంచం ఇస్తే కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనులూ జరుగడం లేదు. పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ కార్యక్రమంలోనూ అవినీతి, అక్రమాలే రాజ్యమేలుతున్నాయి. సాలూరుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. రాష్ట్ర  ముఖ్యమంత్రి జిల్లాలో పలుమార్లు పర్యటించి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదు. జన్మభూమి కమిటీలతో పెన్షన్లు, రేషన్‌ కార్డులు పేదలకు కాకుండా ధనికులకు ఇస్తున్నారు.  జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజల కోసం చేస్తున్న పాదయాత్ర అనన్య సామాన్యం. ఆయనను ముఖ్యమంత్రి చేయడం మనందరి బాధ్యత. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ విజయదుంధుభి మోగించాలి.–పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు

సీఎంను చేసి అభిమానాన్ని నిరూపిద్దాం...
వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నా... ఆ కుటుంబమన్నా.. రాష్ట్ర ప్రజలకు ఎంతో అభిమానం. మరెంతో ప్రాణం. అటువంటి అభిమానాన్ని ఆయనను సీఎంగా చేసి నిరూపించుకుందాం. అందరం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఇది సుసాధ్యం. అందరి నోటా వస్తున్న మాటను నిజం చేసుకుందాం. మన సంక్షేమ రాజ్యాన్ని మనమే స్థాపించుకుందాం.
–మాధవి, వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంటునియోజకవర్గ సమన్వయకర్త

క్రైస్తవ మైనార్టీలను ఆదుకోవాలి...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే క్రైస్తవ మైనారిటీలను ఆదుకోవాలని కోరాం. క్రైస్తవ మైనార్టీలకు శ్మశాన వాటికల కోసం ఐదెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని విన్నవించాం. చర్చిలకు తాగునీటి సదుపాయం కోసం బోర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి బడ్జెట్‌ సమావేశంలో క్రైస్తవ మైనార్టీలకు కొంత నిధిని కేటాయించాలని కోరాం.
–పాస్టర్‌ బెహరా ఉదయచంద్ర, క్రిస్టియన్‌ మైనార్టీ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top