‘ప్రత్యేక’ గర్జన

YSRCP Leaders Rally In Kurnool - Sakshi

కర్నూలు(కొండారెడ్డిఫోర్టు)/కల్లూరు(రూరల్‌) : ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్రబంద్‌ కర్నూలు నగరంలో సక్సెస్‌ అయింది. తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాన్ని అణచేందుకు యత్నించినా పార్టీ కార్యకర్తలు   ప్రత్యేక గళం వినిపించారు. వీరికి ప్రజలు స్వచ్ఛందంగా   మద్దతు ప్రకటించారు.
 
ఉదయం 4.30 గంటల నుంచే ఆందోళన.. 
బంద్‌లో భాగంగా ఉదయం 4.30గంటల నుంచే వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్‌ నేతృత్వంలో  తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, రెహమాన్‌ తదితరుల ఆధ్వర్యంలోని బృందం ఆర్టీసీ డిపోలు, బస్టాండ్‌ ఎదుట ఆందోళనకు దిగింది. ఒక్క బస్సును కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఎక్కడివక్కడే బస్సులు నిలిచిపోయాయి. అనంతరం బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లే గేటు ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బైఠాయించారు. తరువాత ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వీరికి కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య సంఘీభావం ప్రకటించారు.

ఇంతలోనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రశాంతంగా ధర్నా చేస్తున్న బీవై రామయ్య, హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి, కరుణాకరరెడ్డితో సహా దాదాపు 130 మందిని  అరెస్టు చేశారు.  వారిని  విడుదల చేయాలని   తాలూకా, టు టౌన్, త్రీటౌన్, నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్ల ఎదుట పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ధర్నాలకు దిగడంతో పోలీసులు వారిని సొంత పూచికత్తుపై విడుదల చేశారు. కాగా, ఉదయం పది గంటల సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ మద్దయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తుండగా ఆయనతోపాటు లాయర్‌ రాజేష్, మరో ఇద్దరిని అరెస్టు చేసి మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
   
భారీ బైక్‌ ర్యాలీ 
రాష్ట్ర బంద్‌కు సహకరించాలని వ్యాపారులను కోరుతూ రాజావిష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో  వైఎస్‌ఆర్‌సీపీ యువత ఉదయం 9.30 గంటలకు భారీ బైక్‌ ర్యాలీ  నిర్వహించింది. దాదాపు 500 మందితో వైఎస్‌ఆర్‌ విగ్రహం నుంచి ప్రారంభమైన బైక్‌ ర్యాలీ రాజ్‌విహార్‌ మీదుగా యూకాన్‌ప్లాజా, కోట్ల సర్కిల్, కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. అయితే, బైక్‌ ర్యాలీ కలెక్టరేట్, సీక్యాంపు వైపు  వెళ్లకుండా పోలీసులు రాజ్‌విహార్‌వద్ద అడ్డుకున్నారు.

స్వచ్ఛందంగా మద్దతు 
ప్రత్యేక హోదా కోసం  వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన బంద్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్య నాయకులంతా అరెస్టు అయి బంద్‌ చేయించకపోయినా వ్యాపార, వాణిజ్య సమూదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ముఖ్యం గా పాతబస్టాండ్, వన్‌ టౌన్, మండి బజార్, షరఫ్‌ బజార్, కింగ్‌మార్కెట్, కోట్ల సర్కిల్, ఎస్వీ కాంప్లెక్స్, బస్టాండ్‌ ఏరియాల్లో అన్ని రకాల వ్యాపార సమూదాయాలు మధ్యాహ్నం వరకు తెరచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆటోలు, ఇతర వాహనాలు 25 శాతం తిరిగేలా ఆందోళనకారులు అనుమతి ఇవ్వడంతో ప్రజలకు ఇబ్బంది కలగలేదు. కొన్ని, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు మూతపడడంతో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిపోయారు.  

సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు – హఫీజ్‌ఖాన్‌ 
రాష్ట్రబంద్‌కు సహకరించిన ప్రజలు, వ్యాపారులు,  అధికారులు, సిబ్బంది,  ప్రజా సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్‌ తెలిపారు.   సీఎం చంద్రబాబునాయుడు హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.  అరెస్టులు చేస్తే భయపడమని ..వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక హోదా  తెచ్చే వరకు పోరాటాలు చేస్తామని చెప్పారు.  అన్ని విధాల ఏపీని మోసం చేసిన బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో   గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు రెహమాన్, నాగరాజుయాదవ్, సాంబశివారెడ్డి, డీకే రాజశేఖర్, ధనుంజయాచారి, పొలూరు భాస్కరరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, సఫియాఖాతూన్, హనుమంతరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, సంజు(రాజు), మాలిక్, ఫైజాన్, జిలానీ, రహంతుల్లా, ప్రభుదాస్, కృష్ణకాంత్‌ రెడ్డి,మల్లి, భాస్కర రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, దేవకుమార్, మాధవస్వామి, అక్బర్, భాస్కర్, హరికృష్ణారెడ్డి, జాన్, రవి, పవన్, శేఖర్, మహేష్‌బాబు, జమిల్, భగత్, కిశోర్, కటారి సురేష్, రాజశేఖర్‌ యాదవ్, పెద్దపాడు సర్పంచ్‌ శ్రీధర్‌రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, విజయలక్ష్మీ, సలోమి, చెన్నమ్మ, సుచరిత తదితరులు పాల్గొన్నారు.  

ఎమ్మెల్యే గౌరు దంపతుల హౌస్‌ అరెస్టు 

కల్లూరు:   వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డిని పోలీసులు  వారి స్వగృహం వద్దే అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం వందలాది మంది నాయకులు, కార్యకర్తలు గౌరు దంపతుల ఇంటి వద్దకు చేరుకున్నారు.   ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా ర్యాలీగా నంద్యాల చెక్‌పోస్టుకు వెళ్తున్న సందర్భంలో పోలీసులు గౌరుదంపతులను హౌస్‌ అరెస్టు చేశారు. పోలీసుల చర్యకు నిరసనగా అక్కడికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో  దీక్షకు కూర్చున్నారు. ప్రభుత్వ మొండి వైఖరిని ఖండిస్తూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినదించారు. టీడీపీ, బీజేపీ ప్రత్యేక హోదాపై ఆడుతున్న నాటకాన్ని  ప్రజలకు వివరించారు.

ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు కూడా గౌరు దంపతులు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తోట వెంకటకృష్ణారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పర్ల శ్రీధర్‌ రెడ్డి, లీగల్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్‌ కర్నాటి పుల్లారెడ్డి, మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్, ఎస్సీ సెల్‌ సభ్యులు అల్లిపీర, దొడ్డిపాడు మహబూబ్‌బాషా, అర్బన్‌ ఇన్‌చార్జ్‌ బెల్లం మహేశ్వరరెడ్డి, వార్డుల ఇన్‌చార్జ్‌లు  సురేంద్రరెడ్డి, శ్రీనివాసరావు, జగదీశ్వరరెడ్డి, మంచాల సుధాకరరెడ్డి, ఆంజనేయులు, నాగరాజు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top