విజయవాడలో ఉద్రిక్తత

YSRCP Leaders Protest For AP Special Status in viajayawada - Sakshi - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో చలో అసెంబ్లీకి తరలివస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి నేతలను పోలీసులు ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. నందిగామ, జగ్గయ్యపేట, నూజివీడు, గుడివాడల్లో పలువురు వామపక్ష నేతలను అరెస్టు చేశారు. కేవలం ధర్నా చౌక్ వద్ద నిరసనకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు అంటున్నారు. అసెంబ్లీ వైపు వెళ్ళే మార్గాల్లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. పలువురు వైఎస్ఆర్సీపీ, వామపక్ష నేతలను గృహ నిర్బంధం విధించారు. చలో అసెంబ్లీ కోసం బయటకు వస్తే అరెస్టు చేస్తామని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలో సెక్షన్ 30 అమలులో ఉందన్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు నిరసనలను అడ్డుకోవడం అప్రజాస్వామిక మంటూ ఆగ్రహం వ్యక్తం​ చేశారు. కాగా, విజయవాడ నగరంలోని అలంకార్ సెంటర్‌లో ఆందోళన నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ, ప్రజాసంఘాల నేతలను పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను అరెస్టు చేశారు. పోలీసు వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లోకి ఎక్కించడం ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై వివిధ రూపాల్లో నిరసన వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదాపై కలిగే ప్రయోజనాల గురించి నాటిక రూపంలో ప్రదర్శించారు.

వైఎస్‌ఆర్సీపీ నేతలకు గాయాలు
ధర్నాచౌక్‌ వద్ద వైఎస్‌ఆర్సీపీ నేతలు పార్థసారధి, ఉదయభాను, జోగి రమేష్‌, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులతో పాటు సీపీఎం, సీపీఐ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేపట్టారు. ధర్నా చేస్తున్ననేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వాహనం నుంచి వైఎస్‌ఆర్సీపీ నేతలు పార్థసారథి, ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్‌ లు కిందపడటంతో గాయాలయ్యాయి. అయినా పట్టించుకోని పోలీసులు నేతలను మాచవరం పీఎస్‌కు తరలించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top