ఆగ్రహజ్వాల

YSRCP Leaders Activists Protest Against Attack On YS Jagan - Sakshi

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై  హత్యాయత్నంతో కలవరం

నివ్వెరపోయిన పార్టీ శ్రేణులు, విపక్షాలు

ఎక్కడికక్కడ అట్టుడికిన ఆందోళనలు అధికార పార్టీ కుట్రేనంటూ నిరసనలు

ఎదురుదాడికి దిగుతున్న సర్కారు తీరుపై ఆగ్రహావేశం

సంఘటనను ఖండించిన నాయకులు

జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దిగ్భ్రమ చెందారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందన్న సమాచారంతో నివ్వెరపోయా రు. కేంద్రబలగాల భద్రత పటిష్టంగా ఉన్న విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరగడంతో పార్టీ శ్రేణులతో పాటు ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం మధ్యాహ్నం జరిగిన హత్యాయత్న సంఘటన సంచలనమైంది. జిల్లావ్యాప్తంగా జగన్‌ కోలువాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ప్రజాసంకల్పయాత్రలో పెల్లుబుకుతున్న జనాదరణ చూసి ఓర్వలేని శక్తులు కుట్ర పన్నాయంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. విపక్ష నాయకుడికి భద్రత కల్పించకుండా నిందారోపణలు చేస్తున్న అధికార పార్టీ నేతల తీరును ఎండగట్టారు. జగన్‌పై హత్యాయత్నం వెనుక కుట్రను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు తమ ప్రియతమ నాయకుడ్ని చూసేందుకు     హైదరాబాద్‌కు బయలుదేరివెళ్లారు.

సాక్షి, చిత్తూరు, తిరుపతి: ఏపీ ప్రతిపక్ష నేత..వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గురువారం విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడితో జిల్లా ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. అలుపెరగని పాదయాత్ర చేస్తున్న నేతపై హత్యాయత్నం జరిగిందని తెలియగానే  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీ నేతలు ఆందోళన చెందారు. దాడిని తీవ్రంగా ఖండించారు.  టీడీపీ పెద్దలే ఈ కుట్రకు తెగబడ్డారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రతిపక్ష నేత భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు జరిగాయి.  పుంగనూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవినాతును గుంటలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. పుంగనూరులో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరులో పార్లమెంట్‌జిల్లా అధ్యక్షులు జంగాలపల్లె శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వాన పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిని దిగ్బంధించారు.

గంగాధరనెల్లూరు నియోజక వర్గ పరిధిలో ఎమ్మెల్యే నారాయణస్వామి ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బంగారుపాళెంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయితిప్పారెడ్డి  రోడ్డుపై బైఠాయించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తంబళ్లపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి రాస్తారోకోకు సారథ్యం వహించారు. దాడి ఘటనతో మనస్తాపం చెందిన    ఇద్దరు నాయకులు పీలేరులో పె ట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డారు. స్థానికులు అడ్డుకోవటంతో ప్రమాదం తప్పింది. తిరుపతిలో యువనాయకుడు భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నేతలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. కుప్పంలో నియోజక వర్గ సమన్వయకర్త చంద్రమౌళి శాంతి ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. పలమనేరులో నియోజక వర్గ సమన్వయకర్త వెంకటేగౌడ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సత్యవేడు నియోజవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో కేవీబీపురంలో బైఠాయించారు.

నగరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కేజే కుమార్, పుత్తూరులో బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలుమలై ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి రహదారులను దిగ్బంధించారు. శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణులు, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు వడ్లతంగాల బాలాజీరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య పాల్గొన్నారు. అదే విధంగా చిత్తూరులో పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి, బీజేపీ నాయకులు ధర్నా చేశారు. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల విద్యార్థి విభాగం అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి యూనివర్సిటీ వద్ద సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసన తెలియజేశారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు, నాయకులు, రైతులు ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  దాడిని బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, జనసేన, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖం డించారు. హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలంటూ పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top