సీమను మరోసారి మోసం చేస్తున్నారు

సీమను మరోసారి మోసం చేస్తున్నారు - Sakshi


టీడీపీ ప్రభుత్వంపై మైసూరా ధ్వజం

 


 హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు పేరు చెప్పి రాయలసీమ వాసులను మరోసారి మోసం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వానికి నిజంగా రాయలసీమ పట్ల చిత్తశుద్ధి, ఆ ప్రాంతానికి మేలు చేయాలన్న ఆలోచన ఉంటే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ఉద్దేశించిన జీవో నంబర్ 1 లో ‘రాయలసీమకు నీళ్లివ్వడానికి...’ అని ఎందుకు పేర్కొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఇది రాయలసీమ ప్రజలను నిలువునా వంచించడడమేనన్నారు. అసలు దీనిపై మీడియా పెద్దలు కూడా టీడీపీ నేతలను ఎందుకు ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలుగుగంగ పేరుతో రాయలసీమ వాసులను మోసం చేశారని, ఇప్పుడు పట్టిసీమ పేరుతో మరోసారి అలా జరక్కుండా ఉండాలని తాము కోరుతున్నామన్నారు. తెలుగుగంగకు అంకురార్పణ చేసినప్పుడు.. అన్ని పార్టీల వారూ కలిసే రాయలసీమలో ఉద్యమం ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.



మిగుల జలాలపై కమిటీ వేసిందెవరు?



కృష్ణా నదిలో మిగులు జలాలెన్ని ఉన్నాయో తేల్చడానికి 1985లో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రాజారావు నేతృత్వంలో కమిటీని నియమించింది టీడీపీ ప్రభుత్వమేనని (అప్పటి ప్రభుత్వ కార్యదర్శి కె.వి.నటరాజన్) మైసూరా తెలిపారు. కమిటీ అప్పట్లో 200 టీఎంసీల మిగులు జలాలున్నట్లుగా నివేదిక ఇస్తే.. ఆ నివేదికను శాసనసభలో కూడా టీడీపీ ప్రభుత్వమే ఉంచిందని చెప్పారు. పట్టిసీమ వ్యవహారంలో తమ అథినేత జగన్ పొరుగు రాష్ట్రాలను రెచ్చగొట్టేలా, వారి వాదనలకు ఊతం ఇచ్చేలా మాట్లాడుతున్నారనడాన్ని మైసూరా తీవ్రంగా ఖండించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top