నగరి: ఆమే ఒక సైన్యం

YSRCP Candidate RK Roja Great Success In Nagari Constituency - Sakshi

ఒంటిచేత్తో విజయకేతనం ఎగరేసిన రోజా

నా నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా: ఎమ్మెల్యే ఆర్‌కే రోజా

ప్రజాస్వామ్యంలో మరోసారి ఓటరు తన సత్తా చాటాడు. మంచితనానికి నిలువెత్తు రూపం. నిత్యం అందుబాటులో ఉంటూ అన్నింటా తానై అండగా నిలిచి అందరి తరఫున పోరాడే ఆమెకు ఓటరు జైకొట్టాడు. లీడర్‌ అంటే ఏ కష్టమొచ్చినా.. ఏ ఆపద వచ్చినా ఎదురీది తనవారిని నడిపించాలి. ఆర్‌కే రోజా అందుకు నిలువెత్తు రూపం. అధికారంలో లేకపోయినా ఆర్తించిన వారికి చేయూతనిచ్చింది. అందరి ప్రతినిధిగా తాను ఉండాలని, అన్ని వేళలా తాను అండగా ఉంటానని, ప్రజా శ్రేయస్సే తన లక్ష్యమని, సార్వత్రిక ఎన్నికల్లో తానే ఒక సైన్యంలా గెలుపు కోసం పట్టుబట్టింది..అందుకే ప్రజలు ఆమెకు రెండోసారి పట్టం కట్టారు.

సాక్షి, నగరి: నలభై రోజులపాటు నియోజకవర్గ ప్రజల ఉత్కంఠకు తెరపడింది. 2681 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే ఆర్కేరోజా సమీప ప్రత్యర్ధి గాలి భానుప్రకాష్‌పై విజయాన్ని సాధించారు. రెక్కల కష్టం తో ఆమె చేసిన పోరాటం విజయలక్ష్మిని వరింపచేసింది. రెండవదఫా నియోజకవర్గ ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. 194748 ఓట్లకు గాను 167915 ఓట్లు పోలైతే ఇందులో 79499 ఓట్లు ఆర్కేరోజాకు వస్తే సమీప ప్రత్యర్ధి గాలి భానుప్రకాష్‌కు 76818 ఓట్లు వచ్చాయి. 2681 ఓట్లతో ఎమ్మెల్యే ఆర్కేరోజా విజయదుంధుబి మోగించింది.

నగరిలో ఓట్ల ఎన్నికలో టెన్షన్‌..
నగరి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు పార్టీ శ్రేణులకు టెన్షన్‌ తెప్పించింది. 7వ రౌండ్‌లో 3,413 ఓట్ల మెజారిటీతో ఉన్న ఆర్‌కే రోజా నగరి మున్సిపాలిటీ రౌండ్లయిన 8, 9, 10 ముగిసే సరిగి 421 ఓట్ల మెజారిటీకి రావడం పార్టీ శ్రేణులకు టెన్షన్‌ తెప్పించింది. నగరి రూరల్, నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన రౌండ్లు 11 నుంచి 17 రౌండ్లలో వరుసగా మెజారిటీ రావడంతో 2681 ఓట్లతో రెండోసారి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా గెలుపొందింది.

రెక్కలకష్టం ఫలితాన్నిచ్చింది..ఎండ, వానలు లెక్కచేయక ప్రతి ప్రాంతంలోనూ ప్రజలను కలిసి పార్టీ అధికారంలోకి వస్తే చేకూరే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కష్టం వర్ణనాతీతం. ఆమె కష్టానికి ప్రజలు ఓట్ల రూపంతో తమ ప్రతిఫలాన్ని ఇచ్చారు.

నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లకు రోజా చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆర్‌ఓ ప్లాంట్లు, ఫ్యాన్లు, విద్యాసామగ్రి ఇతరత్రా ఎన్నో సౌకర్యాలు కల్పించి అందరి మన్ననలు పొందారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్తూ ప్రజల గొంతుకయ్యారు. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలని అనునిత్యం ఆర్‌కే రోజా చెప్పేమాట. ఆ దిశగా కలను సాకారం చేసుకునే రోజు దగ్గర్లోనే ఉంది. 

రుణం తీర్చుకుంటా..
పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర, ఆయన రూపొందించిన నవరత్నాల పథకాలను ప్రజలు ఆహ్వానించారని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. పసుపు కుంకుమ అంటూ మహిళలను మభ్యపెట్టాలని చంద్రబాబు ప్రయత్నించినా మహిళలు వాటిని తిప్పికొట్టారన్నారు.

ఎవరు అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందో జనం నిర్ణయించుకున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలు వర్ణనాతీతమన్నారు. వారికి నేను రుణపడి ఉంటా అన్నారు. నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. 

సంబరం..అంబరం
ఆర్‌కే రోజా గెలుపు ఖాయం కావడంతో చిత్తూరులో కేక్‌ కట్‌ చేసి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సంబరాలు చేసుకున్నారు. రెండోదఫా నియోజకవర్గ ప్రజలు అందించిన విజయం మరువలేనిదన్నారు. రాష్ట్రంలోను వైఎస్సార్‌సీపీ విజయదుంధుబి మోగించిందన్నారు. కేక్‌ను కట్‌ చేసి తన భర్త ఆర్‌కే సెల్వమణికి, నాయకులకు తినిపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top