కాపురాలు బాగుండాలని..

YSR Kapu nestham Starts on 24th June YSR Kadapa - Sakshi

ఈనెల 24న ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ప్రారంభం

కాపు వర్గాల్లోని నిరు పేద మహిళలకు చేయూత

ఏడాదికి రూ.15 వేలు అందజేత 

ఐదేళ్లలో రూ.75 వేలు లబ్ధి

ముఖ్యమంత్రివైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాపు వర్గంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగకు చెందిన నిరుపేద మహిళలకు ఒక ఆత్మీయుడిలా అండగా నిలవనున్నారు. వారికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి మరో అడుగు ముందుకు వేశారు. ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు అందజేయనున్నారు. ఈనెల 24న పథకాన్ని ప్రారంభించనున్నారు

కడప రూరల్‌: కాపు వర్గంలోని (కాపు, బలిజ, ఒంటరి, తెలగ) పేద మహిళలకు వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకరికి నెలకు ఆదాయం రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఆదాయం ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్‌ పొందుతున్న వారు, ఆదాయపు పన్ను చెల్లించే వారు తదితరులు అనర్హులు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం గ్రామ, వార్డు వలంటరీల ద్వారా వివరాలు సేకరించింది. అందుకు సంబంధించిన జాబితాను ఆయా సచివాలయాల్లో పొందుపరిచారు. అర్హులు, అనర్హుల జాబితాపై అభ్యంతరాలను కోరారు. అనంతరం అన్ని దరఖాస్తుల పరిశీలన తరువాత 7320 మందిని అర్హులుగా గుర్తించారు.

అర్హుల వివరాలు ఇలా..
అట్లూరు మండలంలో ఆరుగురు, బీ కోడూరులో 20 మంది, బ్రహ్మంగారి మఠంలో 26, బద్వేల్‌లో 40, బద్వేల్‌ మున్సిపాలిటీలో 351, చింతకొమ్మదిన్నెలో 112, చక్రాయపేటలో 179, చాపాడులో 49, చెన్నూరులో 156, చిన్ననమండెంలో 110, చిట్వేల్‌లో 165, దువ్వూరులో 177, గాలివీడులో 94, గోపవరంలో 80, జమ్మలమడుగులో 68, జమ్మలమడుగు మున్సిపాలిటీలో 68, కడప అర్బన్‌లో 399, కలసపాడులో 193, కమలాపురంలో 115, ఖాజీపేటలో 34, కోడూరులో 504, కొండాపురంలో 34, లక్కిరెడ్డిపల్లెలో 131, లింగాలలో 37, ముద్దనూరులో 266, ఓబులవారిపల్లెలో 303, పెద్దముడియంలో 22,పెండ్లిమర్రిలో 53, పోరుమామిళ్లలో 343, ప్రొద్దుటూరులో 70, ప్రొద్దుటూరు అర్బన్‌లో 80, పులివెందుల మున్సిపాలిటీలో 76, పులివెందులలో 03, పుల్లంపేటలో 210, రాజంపేటలో 253, రాజంపేట మున్సిపాలిటీలో 140, రాజుపాళెంలో 25, రామాపురంలో 111, రాయచోటి మున్సిపాలిటీలో 170, రాయచోటిలో 76, మైదుకూరు మున్సిపాలిటీలో 456, కాశినాయనలో 33, సంబేపల్లెలో 15, సిద్దవటంలో 118, సింహాద్రిపురంలో 16, టీ సుండుపల్లెలో 267, తొండూరులో 25, వల్లూరులో 22, వీరబల్లిలో 63, వీరపునాయునిపల్లెలో 11, వేంపల్లెలో 105, వేములలో 19, ఒంటిమిట్టలో 156, ఎర్రగుంట్లలో 82, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 22 మంది మొత్తం 7,320 మంది లబ్ధిదారులు ఉన్నారు.

రైల్వేకోడూరులో అత్యధికం
జిల్లాలో 50 మండలాలు ఉన్నాయి. ఈ పథకానికి సంబంధించి రైల్వే కోడూరు 504 మంది లబ్ధిదారులతో మొదటి స్ధానంలో ఉంది. ఆరుగురితో అట్లూరు, ముగ్గురు లబ్ధిదారులతో పులివెందుల మండలాలు చివరిస్థానాల్లో నిలిచాయి. అలాగే 500 మంది లోపు లబ్ధిదారుల జాబితాలో మైదుకూరు మున్సిపాలిటి, బద్వేల్‌ మున్సిపాలిటీ, ఓబులవారిపల్లె, కడప తదితర ప్రాంతాలు ఉన్నాయి. కాగా వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద ‘అమ్మ ఒడి’తరహాలోనే అర్హులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ మొత్తం ఒకరికి రూ.15 వేల చొప్పున ఖాతాల్లో పడనుంది. ఇలా ఐదేళ్ల పాటు మొత్తం రూ.75 వేలు లబ్ధి చేకూరనుంది.

పేద మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా
కాపు వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ప్రభుత్వం ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థికంగా ఈ పథకం ఎంతో భరోసా ఇస్తుంది. ఈనెల 24న ప్రారంభం అవుతుంది. అర్హులైన ప్రతి మహిళకు రూ 15 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ కానుంది.– జే కరుణాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్,జిల్లా బీసీ కార్పొరేషన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top