సాగు భారం.. యువత దూరం

YSR Kadapa, Youth Keep A Distance For Farming - Sakshi

ఏటా నష్టాలే మిగుల్చుతున్న వ్యవసాయం

అన్నింటా దళారులు.. వ్యాపారులకే లాభం

సాగుకు దూరమవుతున్న రైతు కుటుంబాలు

ప్రత్యామ్నాయం చూసుకుంటున్న యువత  

కడప అగ్రికల్చర్‌: రైతులు అప్పుల్లో పుట్టి..అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నారనే నానుడి ప్రస్తుత వ్యవసాయ దుస్థితికి అద్దం పడుతోంది. లక్షల రూపాయలు అప్పుచేసి పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు అరకొర దిగుబడులతో వెక్కిరిస్తుంటే గిట్టుబాటు కాని ధరలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సిడీ విత్తనాలు కూడా అమాంతం ధరలు పెంచి ట్రేడర్స్‌కు, గ్రోయర్స్‌కు మేలు చేస్తోంది. వెరసి రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కాని కారణంగా రైతులు క్రమంగా కూలీలుగా మారుతున్నారు.

ఆ కుటుంబాల్లోని యువత ప్రత్యామ్నాయ పనులపై మొగ్గు చూపుతున్నారు. ఏ పంట సాగుచేసినా ధరలు ఉండడం లేదు. అరకొర ధరలు ఉంటే వాటిని సరైన ధరకు అమ్ముకోలేని దీనస్థితిలో ఉన్నారు. ఒకవైపు, దళారులు, మరో వైపు వ్యాపారులు తక్కువ ధరకు రైతు దగ్గర కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముకుంటూ రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయం చేసే వారుండరనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

1.20 లక్షల మంది యువత వ్యవసాయం పట్ల విముఖత
జిల్లాలో 51 మండలాలను తీసుకుంటే 13,05,864.2 ఎకరాల సాగు భూమి ఉండగా, ఇందులో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేసే భూమి 10,50,345 ఎకరాలు ఉంటోంది. ఈ సాగు భూమిని నమ్ముకుని పంటలు పండించే రైతులు 4,89,754 మంది ఉన్నారు. అయితే మూడు సంవత్సరాలుగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు వ్యవసాయ దిగుబడులను మరింతగా దిగజార్చాయి. వివిధ కారణాలతో చదువులు మాని దాదాపు 1.20 లక్షల మంది దాకా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కుటుంబాల్లోని యువత వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా గమనిస్తున్నారు.

తల్లిదండ్రులు పంటల సాగుకు చేసిన అప్పులు, దిగుబడులు చేతికొచ్చిన తరువాత ధరలు, పంట అమ్మగా వచ్చిన డబ్బుల మొత్తం, పెట్టుబడుల కోసం చేసిన అప్పు తీర్చగా మిగులు లేకపోవడం తదితర వివరాలు తెలుసుకుని ఎందుకొచ్చిన శ్రమరా...నాయనా అని నిట్టూరుస్తున్నారు. కూలి పని చేసే వారికైనా సాయంత్రానికి కూలీ డబ్బులు అందుతాయన్న నమ్మకం ఉంటుంది. కానీ రైతుకు ఆ మాత్రం నమ్మకం కూడా లేకుండా పోతోంది. అలాగే సకాలంలో అందని పంట పెట్టుబడి రుణాలు, పంట నష్టపోయిన సందర్భంలో పంట పెట్టుబడి రాయితీ, పంటల బీమాను ప్రభుత్వం సక్రమంగా అందించక పోవడం.

కష్టం రైతుది లాభం దళారీ, వ్యాపారులదని యువత తెలుసుకుని వ్యవసాయంపై విరక్తి పెంచుకుంటున్నారు. పొలాల్లో రేయింబవళ్లు పనిచేస్తే వచ్చే ఆదాయం కంటే పట్టణాలకు వెళ్లి ఏదో ఒక పని చేసినా రోజుకు కనీసం రూ.400 నుంచి రూ.500లకు ఆదాయం సంపాదించ వచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది పొలాలను విక్రయించి పట్టణాల్లో చేరి ఏదో ఒకపని చేసుకుంటున్నారు. చాలామంది ఇప్పటికే ఆ దిశగా ముందుకు కదిలారు. మరికొంతమంది అందుకు సిద్ధపడుతున్నారు.

సేద్యం లాభసాటిగా లేదు..
వ్యవసాయదారుడి కంటే దినసరి కూలీ ఎంతో మేలు. ఉపాధి కూలీ కూడా బాగున్నాడు. మేం మాత్రం నిలువునా మునుగుతున్నాం. పంట పండినా, ఎండినా ముందుగా నష్టపోయేది రైతే. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏ మాత్రం ఆదుకోవడం లేదు. సేద్యం లాభసాటిగా లేకపోవడంతో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుని ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్నాను. ఇప్పుడు చాలా వరకు హాయిగా ఉంది.
–చెండ్రాయుడు, యువరైతు, టక్కోలు,సిద్ధవటం మండలం

కష్టానికి తగ్గ ఫలితమెక్కడ?
పొద్దస్తమానం పొలం వద్దకు పోయి పనిచేసినా ఫలితం లేకుండా పోయింది. పెట్టుబడులు పెరిగిపోయాయి. ఏ పంట దిగుబడులు వచ్చినా నమ్మకమైన ధరకు అమ్ముకోలేక పోతున్నాం. ఒక నిత్యావసర వస్తువు తయారు చేసే కంపెనీవాడు ధర నిర్ణయించి అమ్ముతాడు. మేం మాత్రం వ్యాపారి, దళారీ చెప్పిన ధరకు విక్రయించుకోవాల్సి వస్తోంది. మరి రైతు ఎలా బాగుపడతాడు. కష్టానికి తగ్గ ఫలితం లేదు.    
–శ్రీనివాసులరెడ్డి, యువరైతు,వి.కొత్తపల్లె, వేముల మండలం

వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు..
ఏటా పంటలు సాగు చేస్తున్నా అరకొర దిగుబడులు వస్తున్నాయి. పంట సాగు సమయంలో ఉన్న ధరలు పంట పండిన తరువాత ఉండడం లేదు. పెట్టుబడుల కోసం లక్షల రూపాయలు తీసుకొచ్చి పెడితే పంట అమ్మితే అందులో సగం కూడా రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు పతనమై వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. దినసరి కూలీకి వచ్చే కూలీ కూడా వ్యవసాయదారునికి రాలేదు. అందుకే చిరువ్యాపారాలు చేసుకోవాల్సి వస్తోంది.   
–శివకుమార్,యువరైతు, బుగ్గలేటిపల్లె, సీకే దిన్నె మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top