BREAKING NEWS
  • హైదరాబాద్‌: మిషన్‌ భగీరథపై సీఎం కేసీఆర్‌ సమీక్ష, త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
  • పీఎంఎల్‌ఏ కేసు: వేర్పాటువాద నేత షబీర్‌ షాపై చార్జిషీటును ఢిల్లీ కోర్టుకు సమర్పించిన ఈడీ

నంద్యాలలో ఓటర్లను బాబు బెదిరిస్తున్నారు

నంద్యాలలో ఓటర్లను బాబు బెదిరిస్తున్నారు

- అక్రమాలకు పాల్పడుతున్నారు 

టీడీపీ గుర్తింపును రద్దు చేయండి 

చంద్రబాబు ప్రకటనను తీవ్రంగా పరిగణించాలి

అధికార పార్టీ చీఫ్‌పై చర్యలు తీసుకోవాలి

కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదు

నంద్యాల ఉపఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం

 ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి.. కేంద్ర బలగాలను వినియోగించాలి

 

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ఎన్నిక జరిగే నంద్యాలలో ఓటర్లను బెదిరిస్తున్నారని, టీడీపీకి ఓటెయ్యని పక్షంలో ప్రభుత్వ ప్రయోజనాలను వదులుకోవాలని భయపెడుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఎ.కె.జోతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ విప్‌ వైవీ సుబ్బారెడ్డి ఈమేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఆయనతో పాటు పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, బుట్టా రేణుక, వి.వరప్రసాదరావు, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌ రెడ్డి ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ గుర్తింపును రద్దు చేయడంతోపాటు, అధికార పార్టీ నేతపై చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత వివరాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఈసీకి ఇచ్చిన వినతిపత్రంలోని సారాంశం.. ఇలా..

 

‘ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  జూన్‌ 22న నంద్యాలలో పార్టీ యంత్రాంగాన్ని, నంద్యాల ఓటర్లను ఉద్దేశించి ఒక ప్రకటన చేశారు. ప్రజలు తమ పార్టీకి ఓటు వేయనిపక్షంలో వారు ప్రభుత్వం వేసిన రోడ్లను వినియోగించొద్దని, తాను ఇస్తున్న పెన్షన్లు, ఇతర ప్రయోజనాలను వదులుకోవాలన్నారు. అంతేకాకుండా ఒక్కో ఓటుకు రూ. 5 వేలైనా చెల్లించే స్థోమత తనకు ఉందన్నారు. తమకు ఓట్లు వేయనిపక్షంలో ప్రజల అవసరాలను కూడా పట్టించుకోకుండా ఉండేందుకు వెనకాడనని చెప్పారు. ప్రభుత్వం పనులు చేస్తున్నందున ప్రజల నుంచి ఓట్లను డిమాండ్‌ చేయాలని తమ నాయకులకు చెప్పారు. తమకు ఓటు వేయని గ్రామాలకు పనులేవీ జరగవనే ప్రచారం చేయాలని బహిరంగంగా పార్టీ శ్రేణులకు చెప్పడం ద్వారా ఓటర్లను బెదిరిస్తున్నారు. త్వరలో జరగబోయే నంద్యాల ఉప ఎన్నికల దృష్ట్యా చంద్రబాబు చేసిన సంబంధిత వ్యాఖ్యలతో కూడిన సీడీ, పత్రికల క్లిప్పింగులు మీకు ఈ విజ్ఞాపన పత్రంతో పాటు అందజేస్తున్నా.

 

చట్టాలను ఉల్లంఘిస్తున్నారు...

ఓటరు ఓటును స్వేచ్ఛాయుతంగా వేసుకునే వీలుండటం ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణం. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ రాజ్యాంగం, ఎన్నికల చట్టాలను ఉల్లంఘిసూ అనైతిక కార్యకలాపాలకు ఒడిగడుతోంది. గతంలో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సూచనలకు అనుగుణంగా టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. స్టీఫెన్‌సన్‌ అనే మరో ఎమ్మెల్యేకు రూ. 50 లక్షలు ఇస్తుండగా పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో కేసు కూడా నమోదైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీ రాజ్యాంగవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ చట్టాన్ని కాలరాస్తోంది. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు తమ పార్టీలో చేర్చుకున్నారు. ఆ ఎమ్మెల్యేల్లో నలుగురుకి మంత్రిపదవులు ఇచ్చారు. ఈ చర్య రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు స్ఫూర్తికి విరుద్ధం. 

 

చంద్రబాబుది అవినీతి చర్య..

నంద్యాలలో చంద్రబాబు చేసిన ప్రకటన ఆయన సీఎంగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లయింది. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 123 ప్రకారం అది అవినీతి చర్యే. ఓటర్లను భయపెట్టడం, ప్రలోభపెట్టడం, అవినీతిని ప్రోత్సహించడం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. చంద్రబాబు ప్రకటనను తీవ్రంగా పరిగణించాలి. అధికారంలో ఉన్న పార్టీలు రాజ్యాంగానికి ధర్మకర్తగా నిలవాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ చట్టాలను ఉల్లంఘించినప్పుడు, ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కినప్పుడు ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. అలాగే పార్టీ చీఫ్‌ను చట్టప్రకారం శిక్షించాలి. ఈ కారణాలవల్ల టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని విన్నవిస్తున్నాం. అలాగే రాజ్యాం గాన్ని ఉల్లంఘిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రపతికి సిఫారసు చేయాలని విన్నవిస్తున్నాం. అలాగే నంద్యాల ఉప ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరపాలి. అవసరమైతే కేంద్ర పోలీసు బలగాలను, కేంద్ర మానవ వనరులను వినియోగించాలి’ అని వినతిపత్రంలో కోరారు.
Back to Top