చార్‌ధామ్ బాధిత కుటుంబాలకు విజయమ్మ పరామర్శ

YS Vijamma Talked with Victims Families


ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లి వరదల్లో జాడ తెలియకుండాపోయిన వారి కుటుంబాలను శనివారం ఉదయం వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పరామర్శించి మనోధైర్యం చెప్పారు. స్థానిక బావాజీపేట రెండోలైన్ నుంచి 14 మంది చార్‌ధామ్ యాత్రకు వెళ్లారు. వారిలో నలుగురు ప్రస్తుతం ఢిల్లీ చేరుకోగా, మరో మహిళ ఢిల్లీ నుంచి నగరానికి బయలుదేరారు. మిగిలిన తొమ్మిది మంది ఆచూకి తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎనికేపాడులో ఏర్పాటుచేసిన పార్టీ ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన విజయమ్మ తొలుత బాధితుల ఇళ్లకు వెళ్లి అరగంటకు పైగా గడిపారు. బాధితుల కుటుంబసభ్యులతో ముఖాముఖీ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, తమ పార్టీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

 

 తమ తల్లిదండ్రులు ఆవుల రంగారెడ్డి, వెంకటలక్ష్మిల ఆచూకి తెలియడం లేదంటూ జయ అనే యువతి విజయమ్మ దృష్టికి తీసుకురాగా, చివరసారిగా వారితో ఎప్పుడు మాట్లాడారు? ఆ తర్వాత  వారి సమాచారం ఎవరు ఇస్తున్నారంటూ అంటు విజయమ్మ ఆరా తీశారు. 14వ తేదీ తర్వాత వారి సమాచారం లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే తమపై చికాకు పడుతున్నారని, వివరాలు తెలిస్తే తెలియచేస్తామని, పదేపదే ఫోన్ చేయవద్దని ఆగ్రహిస్తున్నారని జయ తెలిపారు. తమ తల్లిదండ్రుల వివరాలను తెలియచేయాలని ఆమె కోరారు. అక్కడే ఉన్న అనూష అనే మరో యువతి.. తమ త ల్లిదండ్రులు సంధ్యాలక్షి, చెన్నకేశవులు, తమ మామయ్య,అత్తయ్యలు మంగతాయారు, సతీష్‌కుమార్‌లు చార్‌ధామ్ యాత్రకు వెళ్లారని వారి సమాచారం కూడా తెలియడం లేదని వాపోయింది.

 


వెంటనే విజయమ్మ స్పందిస్తూ ఇప్పటి వరకు మీ వద్దకు ఎవరైనా వచ్చారా? మీ వాళ్ల గురించి ఏమైనా ప్రశ్నించారా? అంటూ విజయమ్మ అడిగారు. దీనిపై అనూష, ఆమె బంధువు పద్మారాణిలు స్పందిస్తూ ఇప్పటి వరకు ఎవ్వరూ రాలేదని, వైఎస్సార్ సీపీ నాయకుడు గౌతంరెడ్డి వచ్చి వివరాలు అడిగారని, తరువాత ఇప్పుడు మీరే వచ్చారని చెప్పారు. హెల్ప్‌లైన్ నంబరు నుంచి తమకు సమాచారం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆచూకీలేని వారి వివరాలు సేకరించేందుకు వైఎస్సార్ సీపీ తరఫున ప్రయత్నిస్తామని, ధైర్యం కోల్పోవద్దని బాధిత కుటుంబాలకు వైఎస్ విజయమ్మ వారికి ధైర్యం చెప్పారు. చార్‌ధామ్ బాధితుల్ని ఆదుకోవాలంటూ ఇప్పటికే  ప్రభుత్వానికి లేఖ రాశానని ఆమె తెలిపారు.

 

 బాధితుల బాధలు వర్ణానాతీతం: విజయమ్మ

 అనంతరం విలేకరులతో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ బాధితులు, వారి కుటుంబసభ్యుల బాధలు వర్ణనాతీతమని అన్నారు. బాధితుల విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సరిగా స్పందించడం లేదని విమర్శించారు. ఈ విషయంలో ఇప్పటికే తాము ప్రభుత్వానికి లేఖ రాశారని, బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పూర్తి అండగా వుంటుందని, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.



తరలి వచ్చిన మహిళలు

బావాజీపేటకు విజయమ్మ వస్తోందని తెలియగానే మహిళలు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. బాధితుల ఇళ్లకు మిగిలిన నేతల కంటే విజయమ్మే ముందుగా వచ్చి పరామర్శించడంతో మహిళలు సంతృప్తి చెందుతున్నారు. మహిళ కాబట్టే ఆమె బాధితుల కష్టాలను త్వరగా అర్థం చేసుకున్నారంటూ వారు చర్చించుకున్నారు. విజయమ్మతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం కన్వీనర్ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.గౌతంరెడ్డి, మాజీ మేయర్, పార్టీ నగర అధికార ప్రతినిధి తాడిశకుంతల, సేవాదళ్ కన్వీనర్ కమ్మిల రత్మకుమార్, డివిజన్ కన్వీనర్లు వీరంకి నాగు, రుహుల్లా తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top