విజయమ్మ అండగా ఉంటామన్నారు


* ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడి

వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలితో ఉద్యోగ సంఘాల నేతల భేటీ



సాక్షి, హైదరాబాద్:  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలంటూ తాము చేసిన విజ్ఞప్తికి వైఎస్సార్‌సీసీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సానుకూలంగా స్పందించారని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు.



ఈ సమావేశంలో పార్టీ నేతలు మైసూరారెడ్డి, శోభానాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. విభజనకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతు కోరుతూ అన్ని పార్టీలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నామని, అందులో భాగంగా విజయమ్మతో సమావేశమయ్యామని చెప్పారు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని తాము తొలి నుంచీ డిమాండ్ చేస్తున్నామని ఆమె చెప్పారని వెల్లడించారు.



కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని, నష్టపోతున్న ప్రాంతానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఈనెల 19 నుంచి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు విజయమ్మ చెప్పారన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆమె డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన ఉద్యమానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. విజయమ్మ ఆమరణ దీక్షకు ఉద్యోగుల మద్దతు ఉంటుందన్నారు.



దీక్షకు ఉద్యోగ సంఘాల మద్దతు: ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈనెల 19 నుంచి చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయని పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఏపీఎన్జీవోల ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాలకు పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణకు బీజం వేసింది వైఎస్ రాజశేఖరరెడ్డే అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని విలేకరులు ప్రస్తావించగా.. వైఎస్ మీద బురదచల్లేందుకే ఇలా చేస్తోందన్నారు. అప్పట్లో కాంగ్రెస్ తెలంగాణ ఫోరం నేత చిన్నారెడ్డి అధ్వర్యంలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చారని గుర్తు చేశారు.



‘‘వైఎస్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు.. ‘తెలంగాణ ప్రాంతానికి మరో సైమన్ వచ్చారు. సైమన్ గో బ్యాక్ అంటూ నల్లజెండాలు ప్రదర్శించాలి’ అంటూ అప్పట్లో కాంగ్రెస్ తెలంగాణ ఫోరం నేత చిన్నారెడ్డి ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు వైఎస్సే తెలంగాణకు బీజం వేశారని బురదజల్లుతున్నారు’’ అని మండిపడ్డారు. సమస్యను రాజేసింది కాంగ్రెస్ పార్టీ అని, దానికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీపైనే ఉందని శోభానాగిరెడ్డి అన్నారు. ఎవరినీ రెచ్చగొట్టడానికి విజయమ్మ దీక్ష చేయడం లేదని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నారని స్పష్టంచేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top