అన్నా మా ఓటు మీకే.. మీరు సీఎం కావాలి

ఆత్మకూరు: కోవెలకుంట్లకు చెందిన వ్యవసాయ కూలీలు మంగళి లక్ష్మమ్మ, సుబ్బమ్మ, నాగమ్మ, రాములు, లక్ష్మి దేవి, సౌదరదిన్నెకు చెందిన మరియమ్మ, నాగజ్యోతి, లక్ష్మి, శంకరమ్మ తదితరలు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ‘మీకు కూలి ఎంత వస్తుందమ్మా’ అని ఆప్యాయంగా అడిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే రూ.200 ఇస్తారని వారు తెలిపారు. మంగళి ల క్ష్మమ్మ మాట్లాడుతూ ‘మీరే గెలవాలన్నా.. మీరు గెలిస్తే మాలాంటి పేదలు బాగుపడతారు. ఈసారి మీకే ఓటు వేస్తాం’ అని చెప్పింది. వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘45 ఏళ్లకే పింఛన్లు ఇస్తాం.. మీ పిల్లలను బాగా చదివించండమ్మా’ అని తెలిపారు. జయంతి అనే మహిళ మాట్లాడుతూ ‘మా పిల్లలు కోవెలకుంట్ల సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌లో చదువుతున్నారు.. స్కాలర్‌షిప్‌లు రావడం లేదన్నా’ అని వాపోయింది. ‘ఈ ప్రభుత్వం ఇలా ఉందమ్మా.. మన ప్రభుత్వం వస్తే ఇద్దరి పిల్లలకు రూ.15వేలు చొప్పున ఇస్తాం, బాగా చదివించండి’ అని వైఎస్‌జగన్‌ సూచించారు. ‘మీరే సీఎం కావాలి’ అని మహిళలు పెద్ద ఎత్తున గట్టిగా కోరారు. ‘మన ప్రభుత్వం రావాలని దేవున్ని ప్రార్థించండి’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top