‘నిండు మనసుతో ఆశీర్వదించండి’

YS JaganMohan Reddy Speech at Chagalamarri in Kurnool - Sakshi

సాక్షి, చాగలమర్రి : అభివృద్ధి అంటే నాలుగడుగులు ముందుకు వేయడం. కానీ నేటి ప్రభుత్వం మూడడుగులు వెనక్కువేస్తోందని వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. కడప జిల్లా ముగించుకుని కర్నూలులోకి ప్రజాసంకల్పయాత్ర చేరుకుందని ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చెప్పారు. స్వచ్చభారత్‌ అమలు అవుతోందటారు కానీ రోడ్డంతా దుమ్ముదుమ్ముగానే ఉంటోందని అన్నారు. నేటితో 100 కి.మీపైగా పాదయాత్ర పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని మనందరం కలిసి ముందుకు నడుపుదామని పిలుపునిచ్చారు.

‘అభివృద్ది అంటే ఇవాళ్టి కంటే రేపు ఇంకా బాగుండటం. చంద్రబాబు పాలన, టీడీపీ పాలనను చూసిన తర్వాత నేను అడుగుతున్నా.. ఈ నాలుగేళ్ల పాలనను నాన్నాగారి పాలనను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. రాష్ట్రం ముందుకు పోయిందో లేక వెనక్కు పోయిందో తెలుస్తుంది. ఎవర్ని అడిగినా నష్టపోయాం అనే మాట వినిపిస్తోంది. రైతన్నలను తీసుకుంటే వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ కాలేదు. అప్పులు కట్టొద్దని చెప్పి ఇప్పుడే ప్లేటు ఫిరాయించారు చంద్రబాబు. రైతులను పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయేలా చేశారు. నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా.. ఆయన చేసిన రుణ మాఫీ వడ్డీలకైనా సరిపోయిందా?. 

రూ. 5 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి తీసుకొస్తా అన్నారు చంద్రబాబు. తెచ్చారా?. మరి ఏమైంది అది. పత్తి, వేరుశెనగ, మినుము, కంది, పసుపు తదిత పంటలకు తగిన రేటుందా? అని అడుగుతున్నా. రైతులకు పంట చేతికి వచ్చినప్పుడు పూర్తిగా రేటు లేకుండా పోతుంది. హెరిటేజ్‌ రంగ ప్రవేశం చేసిన తర్వాత, దళారీలు రంగంలోకి దిగి రైతుల నుంచి తక్కువ రేటుకు పంటలను కొంటారు. ఆ తర్వాత రేట్లు ఆకాశానికి వెళ్తాయి. నాలుగేళ్ల నుంచి ఇదే తంతు. కేసీ కెనాల్‌, తెలుగు గంగల మీద ఆధార పడిన రైతులు అందరూ వైఎస్‌ పాలనను గుర్తు తెచ్చుకోవాలి. 

రెండు పంటలు మీరు పండించుకున్నారా? లేదా? అని అడుగుతున్నా. ఇవాళ ఒక్క పంటకైనా నీరందిందా? అని అడుగుతున్నా. రాజోలిబండ ప్రాజెక్టు మీద మీరు ఆధార పడలేదా. ఇవాళ ఆ ప్రాజ్టెకు అతీగతి లేదు. గుండ్రేవుల ప్రాజెక్టు ఏమైందని ప్రశ్నిస్తున్నా?. నాన్న బతికివుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేది. రైతున్న ముఖంపై చిరునవ్వు ఉండేది. శ్రీశైలంలో నీళ్లు ఉన్నా మనకు మాత్రం నీళ్లు రావు. చేనేతల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాలు మాఫీ చేస్తా అన్నారు. ఒక్క రూపాయైనా అయిందా? అని అడుగుతున్నా. అక్కచెల్లెలమ్మల ఉసురు తగులుతుందన్న ధ్యాసే లేదు సీఎంకి. జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు. 2 వేల రూపాయలు ఇస్తా అన్నారు కదా. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రూ. 90 వేలు బాకీ పడ్డారు. ఇప్పటికీ ఒక్క రూపాయైనా ఇవ్వలేదు. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తున్నారు. 

వైఎస్‌ హయాంలో రేషన్‌ షాపుల్లో చక్కెర, చింతపండు, పామాయిల్‌, కిరోసిన్‌, కందిపప్పు తదితరాలు దొరికేవి. ఇవాళ అదే రేషన్‌ షాపుల్లో బియ్యం డబ్బా కూడా దొరకడం లేదు. రాష్ట్రంలో అన్ని రకాలుగా మోసాలు కనిపిస్తున్నాయి. ఈ పరిపాలనను తట్టుకోలేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అందుకే ప్రతి ప్రాంతానికి పాదయాత్ర ద్వారా చేరువవుతున్నాను. ప్రతి ఒక్కరికీ దీమా ఇస్తాను. ఒక సంవత్సరంలో మన ప్రభుత్వం వస్తుంది. పాదయాత్రలో అందరూ సలహాలు, సూచనలు ఇవ్వండి. ఆలోచనలు ఇవ్వండి. నవరత్నాల గురించి మీకు తెలుసు. వాటిలో మార్పులు, చేర్పులు చేస్తాం. సలహాలు ఇవ్వండి.

పాదయాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం పార్టీ మేనిఫెస్టో. మూడు పేజిల్లో పార్టీ మేనిఫెస్టో తయారు చేస్తాం. తెలుగుదేశం మేనిఫెస్టో ఇంటర్నెట్‌లో ఎక్కడా కనిపించదు. ఎందుకంటే అది చదివితే ప్రజలు కొడతారని భయం వాళ్లకు. మనం పెట్టే మేనిఫెస్టో మోసం చేయడానికి కాదు. ప్రతి అంశం మీ ఆనందం కోసం పెడతాం. మీరు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొస్తాం. మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనవి కూడా చేసి చూపిస్తాం. 2024 కల్లా ప్రతి అంశం పూర్తి చేసి మళ్లీ ఆశీర్వదించండి అని మీ దగ్గరకి వస్తాం. రాజకీయాల్లో విశ్వసనీయత కొరవడింది. రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తేవాలి. 

రేపు ఎన్నికలప్పుడు ఇదే బాబు ప్రతి ఇంటికి కేజి బంగారం ఇస్తానంటాడు. మారుతీ కారు కొనిస్తానంటాడు. మోసం చేసేద్దాం పనై పోతుందిలే అనే నైజం ఆయనిది. ఒక నాయకుడిని చూసి సగర్వంగా కాలర్‌ ఎగరేసుకునే నమ్మకం రావాలి ప్రజలకు. అంతేగానీ ఇతరుల ముందు తలవొంపులు తెచ్చేవాడు నాయకుడు కాడు. మన అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి అనే పదానికి అర్థం తెస్తాం. ప్రతి ఇంట్లో అది కనిపించేలా చేస్తాం.

 

నవరత్నాల్లోని పిల్లల చదువుల అంశం.. 
పేద పిల్లవాడు చదవాలంటే పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి గుండె మీద చేయివేసుకుని ఆలోచించండి. ఇంజనీరింగ్‌ ఫీజులు చూస్తే లక్షలు దాటుతున్నాయి. ప్రభుత్వం కేవలం రూ. 35 వేలు ఇస్తుంది. మిగిలిన డబ్బులు తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెస్తారు. ఈ పరిస్థితి మార్చడం కోసం మనం అధికారంలోకి వస్తే.. మొదటి పని వైఎస్‌ యుగాన్ని తేవడం. పేదవాడు చదువుల కోసం ఇబ్బందులు పడకుండా చేస్తాం. ఇంజనీరింగ్‌, డాక్టర్‌, కలెక్టర్‌లాంటి చదువులు మీ పిల్లలతో నేను చదివిస్తానని హామీ ఇస్తున్నాను.

కాలేజీల్లో పిల్లలు చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండటానికి ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాం. చదువులు పూర్తయ్యాక నాన్న్గా గారి ఫొటోతో పాటు నాఫోటో కూడా మీ ఇంట్లో పెట్టుకునేలా చేస్తా. చిన్న పిల్లలను తల్లులు బడులకు పంపించండి. గవర్నమెంట్‌, ప్రైవేటు ఏ స్కూలైనా సరే ఇద్దరు పిల్లలకు సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాం. అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. ఇదొక్కటే కాదు. చాలా మంది పేదవాళ్లు రాష్ట్రంలో ఉన్నారు. వీళ్లందరూ పనులకు పోతే కానీ కడుపునిండని పరిస్థితి. అందుకే పెన్షన్‌ రూ. 2 వేలు చేయబోతున్నాం. 

బడుగులు, దళితులు, బీసీలు, మైనారిటీలకు పెన్షన్‌ వయసును 45 ఏళ్లకు తగ్గిస్తాం. రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా బ్రతకడానికి అవస్థ పడకూడదు. పిల్లల చదువులు సాగుతాయి. బ్రతకడానికి ఇబ్బంది లేదు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. నేను మీకు హామీ ఇస్తున్నా. మీ గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ తెరుస్తాం. మీ గ్రామానికి చెందిన పది మందికి గవర్నమెంట్‌ ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలో ఏది కావాలన్నా 72 గంటల్లో అందేలా చేస్తాం. ఏ కమిటీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వద్దకు పనుల కోసం వెళ్లాల్సిన పని లేకుండా చేస్తాం. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలు అందిస్తాననని మాటిస్తున్నా.’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top