మాట.. సంక్షేమ బాట

YS Jaganmohan Reddy Launch YSR Vahana Mitra in West Godavari - Sakshi

మాటిచ్చిన చోటే చరిత్రకు శ్రీకారం

‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ను ప్రారంభించిన సీఎం జగన్‌

జిల్లాలో 13,074 మంది ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10 వేలు

ప్రారంభించిన నిమిషాల్లోనే వారి ఖాతాల్లోకి నగదు

ఐదేళ్లలో రూ.50 వేలు వేస్తామన్న ముఖ్యమంత్రి  

ఆటోడ్రైవర్లలో వెల్లివిరిసిన ఆనందం

‘ఇదే ఏలూరులో 2018, మే 14న నా పాదయాత్రలో ఒక మాట ఇచ్చా. ఆ మాటకు కట్టుబడి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరికీ ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున మీ బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తాం.’  – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, ఏలూరు: నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అనే మాటకు కట్టుబడి, చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకానికి శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కింది. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ.10 వేలు అందించే ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందించారు. జిల్లాలో 13,074 మందికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బటన్‌ నొక్కిన కొద్ది నిమిషాల్లోనే ఆటోడ్రైవర్ల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ముఖ్యమంత్రి సభా ప్రాంగణం నుంచి వెళ్లకుండానే ఆటోడ్రైవర్ల ఫోన్లలో డబ్బులు వారి ఖాతాల్లో జమ అయినట్లు మెస్సెజ్‌లు రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. మాటకు కట్టుబడే ఇటువంటి సీఎంను మేం ఇంతవరకూ చూడలేదంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకంతో తమకు చేయూతనిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఆటోడ్రైవర్లు పుష్పగుచ్ఛాలు, గజమాలతో ఘనంగా సత్కరిం చారు. అనంతరం ఆటోడ్రైవర్లు ముఖ్యమంత్రికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. నా పాదయాత్రలో ఒక మాట ఇచ్చా. ఆ మాటకు కట్టుబడి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరికీ ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఏటా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తాం. ఇంకా ఎవరైనా  మిగిలిపోయి ఉంటే  వారికి అక్టోబర్‌ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులకు నవంబర్‌లో డబ్బులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆటోడ్రైవర్ల నుంచి హర్షం వ్యక్తం అయ్యింది. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా, ఇచ్చిన హామీలు నాలుగు నెలల్లోనే నెరవేర్చే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.

50 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన ఏలూరు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయడం జిల్లా వాసులకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రవాణా శాఖ అంటే టాక్సులు వసూలు చేయడం, ఆటోలు, కార్లు ఇతర వాహనాల నుంచి జరిమానాలు వసూలు చేసే విభాగంగానే పేరు ఉండేదని, ఇప్పుడు ఆ విభాగం సేవ కూడా చేస్తుందని ముఖ్యమంత్రి నిరూపించడం ఆనందంగా ఉందన్నారు. తొలుత జిల్లా కేంద్రం ఏలూరులోని కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. వైద్య కళాశాల భవనాల నిర్మాణ శిలాఫలకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రి ట్రామాకేర్‌ సెంటర్‌లో పనిచేస్తున్న సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను సావదానంగా విన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. మున్సిపల్‌ కార్మికులతో సమానంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలకు వేతనాలు పెంచుతానని సీఎం హామీ ఇచ్చారు. ట్రామాకేర్‌ సిబ్బందికి ప్రతి నెలా వేతనాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటానని, ట్రామాకేర్‌ సిబ్బంది క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈనెల 10 నుంచి ప్రారంభం అవుతున్న కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీశ్రీనివాస్‌(నాని), పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాష్ట్ర మంత్రులు పేర్ని వెంట్రామయ్య(నాని), తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, కనుమూరు రాఘరామకష్ణంరాజు, మార్గాని భరత్,  ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్య చౌదరి, వీఆర్‌ ఎలీజా, పుప్పాల వాసుబాబు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, తలారి వెంకట్రావు, గ్రంధి శ్రీనివాస్, జి.శ్రీనివాసనాయుడు, ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, మేకా ప్రతాప్‌అప్పారావు, మాజీ మంత్రులు మరడాని రంగరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ నాయకులు కవురు శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, పీవీఎల్‌ నరసింహరాజు, కొయ్యే మోషేన్‌రాజు, వంక రవీంద్ర, టీవీ రామారావు, కొఠారు రామచంద్రరావు, మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ, జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, ట్రాన్స్‌ఫోర్ట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. 

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం
ఏలూరు సెంట్రల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మొదటిసారి ఏలూరు నగరానికి  చేరుకున్నారు. మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ఆయనను కలసి ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఏలూరుకు రావాల్సి ఉండగా ఐదు నిమిషాల ముందుగానే చేరుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీ శ్రీనివాస్‌ (నాని), పిల్లి సుభాష్‌ చంద్రబోస్, రాష్ట్ర మంత్రులు పేర్ని వెంట్రామయ్య(నాని), తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, కనుమూరి రఘరామకృష్ణంరాజు, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, అధికారులు స్వాగతం పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top