ఆ స్వరం.. హోదాగ్ని రగిలించిన భాస్వరం

YS Jaganmohan Reddy Fight For AP Special Status For Five Years - Sakshi

ఐదేళ్లుగా ప్రతిపక్ష నేత అలుపెరగని పోరు

గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు

రాష్ట్రవ్యాప్తంగా యువభేరి సదస్సులు, బహిరంగ సభలు

యువతలో ఉత్తేజం... ప్రజల్లో చైతన్యం

ఏకంగా కేంద్ర ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం

హోదా కోసం వైఎస్సాఆర్‌సీపీ ఎంపీలతో రాజీనామా

ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచినా పోరుబాటే

ఆకాంక్షను సజీవంగా ఉంచింది వైఎస్‌ జగన్‌ ఒక్కరే

అదరకుండ... బెదరకుండ... దారుణ నిర్బంధానికి ఎదురొడ్డి...రీతి లేని సర్కారును నిలదీస్తూ... ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకగా...హోదానే హద్దంటూ ఎలుగెత్తి నినదిస్తూ... దీక్షబూని సాగుతూ...సింహంలా గర్జిస్తూ...పౌరుషాగ్ని రగిలిస్తూ... నిశ్చయంగా, నిర్భయంగాజనాకాంక్షను చాటారు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి...ఈ అలుపెరగని పోరులో ఎన్నో ఆటంకాలు....అంతకుమించి తెరవెనుక కుయుక్తులు...వీటిని తట్టుకుంటూనే ఉద్యమ వేడి రగిలించారు...ఆ క్రమం ఎలా సాగిందంటే....!
     
సాక్షి, అమరావతి: ఉక్కుపాదం మోపితే మొక్కవోని దీక్షతో బదులిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేస్తే.. ఇది మాకు జీవన్మరణం అంటూ గళమెత్తుతూ ప్రత్యేక హోదా కోసం ఐదేళ్లు పట్టువదలకుండా సమరం సాగించారు.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని ప్రత్యేక హోదా మాత్రమేనని ఆయన మొదటినుంచి నమ్మారు. పోరాటాల ద్వారానే దానిని సాధించగలమని విశ్వసించారు. ఈ దిశగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యువభేరి సదస్సలు నిర్వహించి హోదా ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అణచిచేయాలని చంద్రబాబు సర్కారు అడుగడుగునా ప్రయత్నించినా తదేక దీక్షతో ముందుకెళ్లారు. బీజేపీతో జతకట్టిన చంద్రబాబు తన కేసుల కోసం హోదాను తాకట్టు పెట్టడాన్ని వైఎస్సార్‌సీపీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. హోదా కంటే ప్యాకేజీనే ముద్దంటూ ముఖ్యమంత్రి తలూపినా, జగన్‌ మాత్రం జనాన్ని ఏకం చేసి ఉద్యమ వేడిని రగిలించారు. చిట్టచివరగా ఎంపీల రాజీనామాస్త్రాలు, ఏపీ భవన్‌లో దీక్షలు, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం యావత్‌ దేశ రాజకీయాలను మలుపు తిప్పాయి. హోదా ఊపిరిగా ఆంధ్ర ప్రజలు రణనినాదానికి సిద్ధమయ్యేలా చేయడం చంద్రబాబు వెన్నులోనూ చలి పుట్టించింది. హోదా సమర హోరు సజీవంగా నిలబెట్టిన జగన్‌ ఐదేళ్ల పోరాట చరిత్ర ఏ ఊరెళ్లినా ప్రజలు గుర్తుచేస్తున్నారు.

విభజన నాటి నుంచే...
రాష్ట్ర విభజన తర్వాత నుంచే జగన్‌ హోదా కోసం ఢిల్లీపై ఒత్తిడి తేవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన 9 నెలల్లోపే అంటే 2015 మార్చి 30న తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 2017 మే 10న మరోసారి హోదా కోసం మరోసారి విన్నవించారు. 2015 జూన్‌ 11న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయినా, 2016 ఏప్రిల్‌ 26న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వద్దకు వెళ్లినా జగన్‌ స్వరంలో హోదా నినాదమే మార్మోగింది. రాష్ట్రంలో టీడీపీని గుప్పిట పెట్టుకున్న ఎన్డీఏ సర్కారు... హోదాపై కదలకపోవడాన్ని కూడా వైసీపీ నిలదీసింది. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వద్దకు మూడుసార్లు (జూన్‌ 9, 2015, ఫిబ్రవరి 23, 2016, ఆగస్టు 8, 2016) వెళ్లింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని జగన్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

కదిలించిన ఆందోళనలు...
హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుక్షణం పోరాడుతూనే ఉంది. ధర్నాలు, ఆందోళనలతో దద్దరిల్లేలా చేసింది. హోదా ప్రయోజనాలేంటో ఇంటింటికీ చెప్పగలిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన ఆరు నెలల్లోపే... అంటే 2014 డిసెంబర్‌ 5న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు తొలిసారిగా ఆ పార్టీ పిలుపునిచ్చింది. విశాఖలో జరిగిన ధర్నాలో వైఎస్‌ జగన్‌ స్వయంగా పాల్గొన్నారు. 2015 జూన్‌ 3న మంగళగిరిలో రెండు రోజుల సమర దీక్ష చేపట్టారు. బాబు పాలనపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. అదే ఏడాది ఆగస్టులో ఢిల్లీలో తొలిసారిగా జగన్‌ ఒక రోజు ధర్నా చేపట్టారు. ఆగస్టు 29న ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌ పిలుపుకు అనూహ్య స్పందన లభించింది. ప్రధాని మోదీ ఏపీకి వస్తున్న వేళ రాష్ట్ర ఆకాంక్షను గ్రహిస్తారని... విపక్ష నేత ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 2015 అక్టోబర్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కానీ, ఏడో రోజున రాష్ట్ర ప్రభుత్వం జగన్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించి దీక్షను భగ్నం చేసింది. అనంతరం జగన్‌ పిలుపుతో అక్టోబర్‌ 17 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు రిలే దీక్షలు చేశాయి. మలిదశ పోరులో భాగంగా 2016, మే 10న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు దిగారు. కాకినాడలో జరిగిన నిరసనలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ స్వయంగా పాల్గొన్నారు. అదే ఏడాది ఆగస్టు 2న, సెప్టెంబర్‌ 10న రాష్ట్ర బంద్‌ నిర్వహించారు. 

హోదా కోసం పదవుల త్యాగం
పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలు పార్లమెంటులో జరిగిన చర్చల్లో హోదా ఆకాంక్షను గట్టిగా వెలిబుచ్చారు. 2014 జూన్‌ 12న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చల్లో హోదా ఇవ్వాల్సిందేనన్నారు. 2015 ఫిబ్రవరి 16న బడ్జెట్‌పై జరిగిన చర్చల్లోనూ ఎంపీలు చురుగ్గా పాల్గొన్నారు. 2016 జూలై 23న ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రతిపాదించారు. 2017 మార్చిలో మరోసారి ప్రైవేటు బిల్లు పెట్టారు. 2017 మార్చి 28న ఎన్‌ఐటీపై, 30న ఆర్థిక బిల్లుపై, ఏప్రిల్‌ 6న జీఎస్టీపై జరిగిన చర్చల్లో హోదాను డిమాండ్‌ చేశారు. జూలైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే అంశం లేవనెత్తారు. ఆఖరుకు హోదా ఇవ్వని కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు, కేంద్రాన్ని కదిలించేందుకు తమ పదవులకే రాజీనామా చేశారు. ఏపీ భవన్‌ సాక్షిగా ఆమరణ దీక్ష చేశారు. 

జాతీయ స్థాయిలో చలనం
అటు ఎన్నికల్లో బీజేపీతో, ఇటు ప్రభుత్వంలో ఎన్డీఏతో అంటకాగిన చంద్రబాబు నాలుగున్నరేళ్లు స్వప్రయోజనాలే చూసుకున్నారు. రాష్ట్రానికి హోదా తెచ్చేందుకు ఏనాడూ కృషి చేయలేదు. ఈ నేపథ్యంలో జగన్‌ 2018 మార్చి ఒకటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు. కలెక్టరేట్ల ముట్టడితో హడలెత్తించారు. ఆయన పిలుపుతో మార్చి 5న ఢిల్లీలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. జగన్‌ సూచనల మేరకు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో మార్చి 15న అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధనకు సహకరించాలని అన్ని పార్టీల నేతలకు జగన్‌ లేఖలు రాశారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు హోదా పోరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేశారు. కానీ సభ సజావుగా లేదన్న సాకుతో స్పీకర్‌ అవిశ్వాస నోటీసులను అనుమతించలేదు. ఈ తంతు ఏప్రిల్‌ 6 వరకు కొనసాగింది. ప్రతి రోజూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, సభలో గందరగోళాన్ని సాకుగా చూపుతూ స్పీకర్‌ వాయిదా వేయడం షరామామూలుగా మారింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మొత్తం 13 సార్లు అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించారు. చివరికి చర్చ జరగకుండానే సభ నిరవధికంగా వాయిదా పడడంతో ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారు. 

విమానాశ్రయంలోనే అరెస్ట్‌
హోదా పోరులో దూసుకెళ్తున్న జగన్‌కు అడ్డుకట్ట వేసేందుకు సీఎం చంద్రబాబు అనుక్షణం ప్రయత్నించారు. ఆఖరుకు వైఎస్‌ జగన్‌ ప్రధాన ప్రతిపక్ష నేతన్న విషయాన్ని కూడా విస్మరించి పోలీసులను ఉసిగొలిపారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా విశాఖలో 2017 జనవరి 26, 27 తేదీల్లో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకు హాజరవడానికి వెళ్తున్న జగన్‌ను అప్రజాస్వామికంగా విశాఖపట్నం విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా రన్‌వేపై జగన్‌ బైఠాయించారు. అదే ఏడాది నవంబర్‌లో వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా.. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులను, శ్రేణులను అరెస్టు చేసింది.

యువతను పరుగులు పెట్టించి..
‘హోదా ఎందుకు దండుగ... ప్యాకేజీ ఉండగ’ అధికార తెలుగుదేశం పార్టీ నాలుగున్నరేళ్లు ఇదే ప్రచారం చేసింది. హోదా ప్రయోజనాలపై యువతను పక్కదారి పట్టించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే... ముఖ్యమంత్రి మాయోపాయం నుంచి యువతను ఉద్యమబాట పట్టించిన చరిత్ర వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిదే. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే రాయితీలను చూసి పరిశ్రమలు వాటంతటవే తరలివస్తాయని జగన్‌ యువతకు తెలిసేలా  వివరించారు. ముఖ్య పట్టణాలన్నిటిలోనూ యువభేరి సదస్సులు నిర్వహించారు. దీంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. యువభేరి సదస్సులకు విద్యార్థులను పంపితే అరెస్టులు చేయిస్తామని తల్లిదండ్రులను బెదిరించారు. పీడీ యాక్టులు పెడతామన్నారు. అయినా వెరవక యువత భారీ స్థాయిలో యువభేరి సదస్సులకు పోటెత్తింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top