నాడు మహానేత..నేడు జననేత

YS Jagan Visit Cheemulapalli In Visakhapatnam - Sakshi

పులకించిన సానికాలువ వాసులు

జననేతతో నాటి జ్ఞాపకాలను

పంచుకున్న గ్రామస్తులు

రాజన్న బిడ్డకు ఆప్యాయంగా

పండ్లు తినిపించిన వైనం

సాక్షి, విశాఖపట్నం : మహానేత సతీసమేతంగా ఆ పల్లెకు వచ్చారు. పల్లెప్రజలతో కలిసి వారు భోజనం చేయడమే కాదు...ఆ చెట్ల నీడలోనే బస చేసి వారితో మూడు గంటల పాటు గడిపారు. నేడు మళ్లీ ఆయన తనయుడు రాకతో ఆ పల్లె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ ప్రాంతమంతా జనజాతరను తలపించింది. జననేత రాకతో పరవశించిపోయింది.నాడు తొమ్మిదేళ్ల చంద్రబాబు ప్రజాకంటక పాలనను అంతమొందించడమే లక్ష్యంతో 2003లో చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు అచ్యుతాపురం మండలం చీములాపల్లి పంచాయతీ సానికాలువ జంక్షన్‌ వద్ద బస చేశారు. భార్య విజయమ్మ, కుమార్తె షర్మిల తనయులతో కలిసి పల్లె వాసులతో మమేకమయ్యారు. వారితో కలిసి కుటుంబ సమేతంగా మధ్యాహ్న భోజనం చేశారు. 12 గంటలకు వచ్చిన ఆయన 3 గంటల వరకు ఆ జీడిమామిడి చెట్ల నీడలోనే బస చేశారు.

సరిగ్గా 15 ఏళ్ల తర్వాత నేడు ఆ మహానేత తనయుడు రాజన్న ముద్దుబిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సుదీర్ఘ పాదయాత్ర చేసుకుంటూ ఆ గ్రామం మీదుగా వెళ్తున్నారని తెలుసుకుని ఆ పల్లె వాసులు ఉప్పొంగిపోయారు. సానిపల్లి జంక్షన్‌ వద్ద రాజన్న బస చేసిన ప్రాంతానికి జననేతను తీసుకెళ్లి నాటి జ్ఞాపకాలను ఆయనతో పంచుకున్నారు. నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలిసి భోజనం చేసిన ఆవసోమవరం మాజీ సర్పంచ్‌ కోలాఅప్పలరాజు, నాగమణి దంపతులు నాడు వైఎస్‌తో గడిపిన మధుర జ్ఞాపకాలను జననేతకు గుర్తు చేశారు. ఇక్కడ భోజనం చేసి బస చేసిన అనంతరం వైఎస్‌ మునగపాక వెళ్లి విజయమ్మతో కలిసి బెల్లం గానుక తిప్పారని వివరించారు. ఈ సందర్భంగా బెల్లంరైతులు బెల్లం దిమ్మలను బహుమతిగా కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ఆనాడు మహానేత అక్కడ గడిపిన క్షణాలను జననేత కూడా అడిగి తెలుసుకున్నారు. నాడు వైఎస్‌తో పాటు అక్కడకు వచ్చిన ప్రస్తుత పార్టీ కో ఆర్డినేటర్‌ కన్నబాబురాజు కూడా నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు..మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాడు మహానేత, నేడు జగన్‌ రాకకు గుర్తుగా ఆ ప్రాంతంలో స్థానికులు మొక్క నాటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top