మీ సూచన.. నా ఆచరణ

YS Jagan Question And Answers to Media Point Chittoor - Sakshi

చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని తనపల్లె క్రాస్‌ వద్ద ఉన్న పీఎల్‌ఆర్‌ గార్డెన్స్‌లో బుధవారం విపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తటస్తులతో సమావేశమయ్యారు. వారు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానమిచ్చారు. సూచనలు స్వీకరించారు.

ఇప్పుడు నవరత్నాలను దొంగిలిస్తున్నారు
సీఎం చంద్రబాబు మామ అధికారాన్ని దొంగిలించారు. ఇపుడు నవరత్నాలను దొంగలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు. అరాచకం రాజ్యమేలుతోంది. కులాలు, వర్గాలు, మతాల వారీగా ప్రజలను చూస్తున్నారు. పరిశ్రమల మంత్రిగా అమరనాథరెడ్డి వచ్చిన తర్వాత .. పల్ప్‌ యూనిట్ల వద్ద డబ్బు తీసుకొని గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు. రైతులకు పర్మిట్ల ఇచ్చే విషయంలోనూ లంచాలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు వెంటనే పర్మిట్లు ఇస్తున్నారు. మీ పాలనలో మహిళలు ధైర్యంగా తిరగాల. లా అండ్‌ ఆర్డర్‌ కచ్చితంగా ఉండాల.     – చలపతి, ఐరాల
వైఎస్‌ జగన్‌ : ఇవన్నీ మేం గమనిస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చాక అంతా మంచి చేస్తాం.

తెలుగు.. నీతోనే వెలుగు
తెలుగుదేశం, తెలుగు ఆత్మగౌరం అని పేర్లు పెట్టుకున్నవారు తెలుగుకు ఏమీ చెయ్యడంలేదు. పదేళ్ల క్రితం తెలుగుభాషకు ప్రాచీన హోదా దక్కింది. నాయకులు, పాలకులు తెలుగును పరిరక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. మన భాషకు ప్రాచీన హోదా దక్కడంతో ఏడాదికి కేంద్ర రూ.20 కోట్లు మంజూరు చేస్తోంది. ఆ డబ్బు కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయే తప్ప, తెలుగును ఎలా పరిరక్షించాలనే దానిపై శ్రద్ధ చూపడంలేదు. దీనిపై మీరేమైనా చర్యలు తీసుకుంటారా? – శ్రీదేవి, తెలుగు భాషా సంస్థ అధ్యక్షురాలు
వైఎస్‌ జగన్‌: దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన పూర్వికులు. ఆ భాషను పరిరక్షించుకోవడం తెలుగోడిగా మనందరి బాధ్యత. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కొత్త చట్టాలు తీసుకొస్తా. తెలంగాణ రాష్ట్రంతో మాట్లాడి తెలుగు భాష పరిరక్షణ కోసం నడుంబిగిస్తాను.

బడి.. కావాలని నూతన ఒరవడి
ఉన్నత విద్య అభ్యశించాలంటే పేదలకు భారంగా మారుతోంది. ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఆలస్యమవుతోంది. విద్యార్థులపై కళాశాల యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది.  నూతనంగా లా పూర్తిచేసిన న్యాయవాదులకు సరైన కేసులు రావడంలేదు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని అందించడం ద్వారా వారు కొంత వరకు కోలుకునే అవకాశం ఉంటుంది.– విజయ్‌కుమార్, న్యాయవాది
వైఎస్‌ జగన్ః ప్రతి పిల్లవాడిని పూర్తిగా చదివించే బాధ్యత వైఎస్సార్‌సీపీ తీసుకుంటుంది. పిల్లల చదువులు మధ్యలో ఆగకూడదనే ఉద్దేశంతో నవరత్నాల పథకంలో అమ్మ ఒడిని తీసుకురావడం జరిగింది. నూతన న్యాయవాదికి స్టైఫండ్‌ కింద నెలకు రూ.5వేలు అందిస్తాను.

ఆస్పత్రుల్లో దోపిడీ
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో రోగులను దోచుకుంటున్నారు. ఆపరేషన్‌కు ఒక ధర, పరీక్షలకు ఒక ధర అంటూ వసూలు చేస్తున్నారు. పిల్లల చదువుల్లోనూ కార్పొరేషన్‌ పాఠశాలలు ఇదేవిధంగా రకరకాల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎల్‌కేజీకే వేల రూపాయలు గుంజుకుంటున్నాయి. ఈ దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలి.      – భాస్కర్‌
వైఎస్‌ జగన్ః పాఠశాల, కళాశాలల్లో ఫీజులు పెద్ద స్థాయిలో ఉన్నాయి. వైద్యులు కూడా అధికంగా పేదల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ అంశాలపైన గతంలో కూడా నేను మాట్లాడాను. అధికారంలోకి రాగానే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఫీజులను అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇస్తున్నా. ఆస్పత్రుల్లో రూ.వెయ్యికి మించి ఖర్చుయితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చూస్తాను.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top