భరోసా ఇస్తూ.... ముందుకు సాగుతూ!

YS Jagan Public Meeting In Rajam Today Srikakulam - Sakshi

అడుగడుగునా సమస్యలు విన్న జగన్‌

విజయవంతంగా 310వ రోజు ప్రజాసంకల్ప యాత్ర

నేడు రాజాంలో బహిరంగ సభ  

సాక్షి ప్రతినిధి,శ్రీకాకుళం: టీడీపీ ప్రభుత్వ హయాంలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు తానున్నానంటూ భరోసా ఇస్తూ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు కదిలారు. ప్రజాసంకల్ప యాత్ర 310వ రోజు ఆదివారం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో వేలాది మంది జనం నడుమ పాదయాత్రను సాగించారు. రేగిడి ఆమదాలవలస మండలంలో ఉదయం 8.30 గంటలకు ఉంగరాడమెట్ట నుంచి పాదయాత్రను ప్రారంభించి కుమ్మర అగ్రహారం, లింగాలవలస క్రాస్, రెడ్డిపేట క్రాస్‌ మీదుగా తోకలవలస క్రాస్, చిన్న శిర్లాం, లచ్చన్నవలస క్రాస్, బూరాడ వరకు 8.2 కిలోమీటర్లు సాగింది. మహిళలు, రైతులతో పాటు అధిక సంఖ్యలో యువకులు ఈ యాత్రలో పాల్గొనడం ప్రధాన ఆకర్షణగా కనిపిం చింది.  ఆదివారం పలు ప్రాంతాల నుంచి సీతంపేట, మడ్డువలస, సంగాం తదితర ప్రాంతాలకు పిక్నిక్‌ సందడి కోసం బయలుదేరిన వారంతా జగన్‌ను చూసి కేరింతలు కొట్టారు. కుమ్మరి అగ్రహారం రోడ్డులో ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులు వాటిని ఆపించి మరీ జగన్‌ను చూసేందుకు ఉత్సాహం చూపించారు. దారిపొడవునా ‘సీఎం జగన్‌.. సీఎం జగన్‌’ అంటూ యువకులు నినాదా లు చేసారు. ఇంటి పైకప్పులు, చెట్లు, బస్సులు ఎక్కిన జనంను చూసి జగన్‌ అభివాదం చేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఓపిగ్గా సమస్యలను వింటూ...
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వేలాది మంది జనం జగన్‌ను కలిసి తమ వినతులను తెలియజేశారు. ఆదివారం ఉదయం రాజాం నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో స్థానిక సమస్యలను ప్రస్తావించడంతో జగన్‌ కూడా స్పందించి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఎచ్చెర్ల మండలానికి చెందిన మత్స్యకారులు పాకిస్తాన్‌ భద్రతా సిబ్బంది చేతుల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఆ బాధిత కుటుంబాలు జగన్‌ను కలుసుకుని తమ గోడును వినిపించారు. సంతకవిటి మండలంలో నాగావళి నదిపై బలసలరేవు వంతెన నిర్మాణానికై స్థానికులంతా ఉద్యమిస్తున్నా, రెండేళ్లుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆ గ్రామస్తులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇండీ ట్రేడ్‌ బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. రాజాంకు చెందిన న్యాయవాదులు కలిసి, తమకు హెల్త్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. గిరిజన ఐక్యవేదిక నాయకులు కలిసి, గిరిజన మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం తరఫున పలువురు ఉపాధ్యాయులు జగన్‌ను కలిసి, తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా మెగా డీఎస్సీ ని నిర్వహించాలని కోరారు.

అలాగే పలువురు ఉ ద్యోగులు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయించాలని కోరారు. దీనిపై ఇప్పటికే జగన్‌ ప్రకటన చేయడంపై వారంతా హర్షం ప్రకటించారు. కిడ్నీ బాధితులు కూడా జగన్‌ను కలిసి తమలాంటి బాధితులకు ఉచిత వైద్యం అందించేలా చేయాలని కోరా రు. అనంతరం కుమ్మరి అగ్రహారం వద్ద ఇటుకల తయారీ కార్మికులతో జగన్‌ కాసేపు ముచ్చటించారు. ఇక్కడే ఇటుకల అచ్చులను స్వయంగా జగన్‌ వేయడంతో కార్మికుల కుటుంబాలంతా ఆ నందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇటుక తయారీదారుల సంఘం ప్రతినిధులు కలిసి, ఇతర జిల్లాల నుంచి వస్తున్న వలస కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని కోరారు. తర్వాత రెడ్డిపేట వద్ద పలువురు మహిళలు జగన్‌కు ఎలాంటి ఇబ్బంది రాకూడదంటూ గుమ్మడికాయతో దిష్టి తీయించారు. అలాగే మార్గమధ్యంలో రేషన్‌ డీలర్ల సంఘం ప్రతినిధులు జగన్‌ను కలిసి, తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అలాగే రజకుల సంఘం ప్రతినిధులు కూడా జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి ఆదరణ–2 పేరుతో మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్‌కు వివరించారు.

పాదయాత్రలో ప్రముఖులు
310వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయికి చెందిన పలువురు ముఖ్య నేతలు ఆదివారం జగన్‌తో కలిసి అడుగులు వేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి, రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, పీఏసీ సభ్యుడు పాలవలస రాజశేఖరం, రాష్ట్ర పార్టీ ప్ర«ధాన కార్యదర్శి రెడ్డి శాంతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గ నేత నంబూరు శంకరరావు, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్,  విజయనగరం రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్‌ మజ్జి శ్రీనివాస్, విజయనగరం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పాలవలస విక్రాంత్, సంయుక్త కార్యదర్శి మామిడి శ్రీకాంత్, జిల్లా పార్టీ నేతలు చల్లా రవికుమార్, హనుమంతు కిరణ్‌ కుమార్, ఎన్ని ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు రాజాంలో బహిరంగ సభ
రాజాం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంక     ల్పయాత్ర రెండు రోజులుగా రాజాం నియోజకవర్గంలో జరుగుతోంది. సోమవారం రేగిడి మండలం బూరాడ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రజాసంకల్పయాత్ర రాజాం మీదుగా కొనసాగనుంది. రాజాం అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద ఈ మేరకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని సమస్యలను ప్రజాసంకల్పయాత్రలో తెలుసుకున్న జగన్‌ బహిరంగ సభలో మాట్లాడనున్నారు.  మరో వైపు జగన్‌మోహన్‌రెడ్డి రాజాం రానున్న నేపథ్యంలో అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటుచేశారు. అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద స్వాగత ద్వారం పలువురిని ఆకట్టుకుంటోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top