సంక్షేమ బాట

ys jagan praja sankalpa yatra in west godavari district - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఆయన చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శుక్రవారం ఉత్సాహంగా సాగింది. గ్రామాల్లో  ప్రజలు జననేత కోసం గంటల తరబడి నిరీక్షించారు. ఆయనను చూడాలని,  మాట్లాడాలని, కరచాలనం చేయాలని ఉవ్విళ్లూరారు. జననేత కూడా చెరగని చిరునవ్వుతో తన వద్దకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి కష్టాలు విన్నారు. నేనున్నానని భరోసా ఇచ్చారు. 

యాత్ర సాగిందిలా.. 
ప్రజాసంకల్ప పాదయాత్ర  శనివారం ఉదయం 8.35 గంటలకు పాలకొల్లు నియోజకవర్గం ఉల్లంపర్రులో మొదలైంది. జిన్నూరు, మట్టిపర్రు క్రాస్‌ రోడ్డు, బొల్లేటిగుంట, వేడంగి, కవిటం లాకులు, కవిటం మీదుగా జగన్నాథపురం వరకూ సాగింది. పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ప్రజలు జననేత వెంట అడుగులు వేశారు.   పోడూరు మండలం జిన్నూరులో డీటీడీసీ బాబు ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు.

 అనంతరం అక్కడ లేసు కార్మికులతో ముచ్చటించారు. వారి బాధలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఆచం ట నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్‌కు ఆ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు.  గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. ఆయనకు హారతులు పట్టారు. విజయీభవ అంటూ దీవించారు.  

అడుగడుగునా.. ఆవేదన 
పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు జననేత వైఎస్‌ జగన్‌కు సమస్యలు విన్నవించారు. జన సంక్షేమం పట్టని సర్కారు తీరుపై  ఆవేదన, ఆక్రోశం వెళ్లగక్కారు. 104 వాహనంలో మందులు లేక ప్రజలు, జీతాలు రాక తాము ఇబ్బందులు పడుతున్నామని 104 వాహన సిబ్బంది కాటం వెంకట సత్యనారాయణ, వల్లూరు శ్రీనివాస్‌ కవిటంలో వైఎస్‌ జగన్‌ను కలిసి వివరించారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 104 వాహనాలు ప్రవేశపెట్టారని, అప్పట్లో వాహనాల్లో మందులు ఉండేవని, తమకూ జీతాలు సక్రమంగా వచ్చేవని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు దళారీ వ్యవస్థ వల్ల కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  వేడంగికి చెందిన కొందరు  తాము ఉన్నత చదువులు చదివినా రైసు మిల్లులో రోజువారీ కూలీలుగా మారాల్సి వచ్చిందని జననేతకు వివరించారు.  ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనలో పనిచేస్తున్న తమను పర్మినెంట్‌ చేయాలని ఆచంటకు చెందిన బొరుసు రాంబాబు వినతిపత్రం ఇచ్చారు. సెకండ్‌ ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయాలని మేడపాడు, యలమంచిలి, దొడ్డిపట్ల ఏఎన్‌ఎంలు జగన్‌కు విన్నవించారు.

అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దళితవాడల్లో సక్రమంగా ఖర్చుచేసేలా చర్యలు చేపట్టాలని పీవీరావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యప్రసాద్, దళిత నాయకులు ఉల్లంపర్రు వద్ద జగన్‌కు విన్నవించారు. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్‌ హెల్త్‌ అసిస్టెంట్లుగా 17 ఏళ్ల నుంచి తాము వెట్టిచాకిరీ చేస్తున్నా.. రెగ్యులర్‌ చేయడం లేదని, వైద్య,ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్‌ సిబ్బంది జననేతకు  వివరించారు. సమస్యలతో వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజలు ఎంత దుఃఖంలో ఉన్నారో ఈ వినతులు చూస్తే అర్థమవుతోంది. 

పాదయాత్రలో నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పాలకొల్లు కన్వీనర్‌ గుణ్ణం నాగబాబు, ఆచంట కన్వీనర్‌ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తాడేపల్లిగూడెం కన్వీనర్‌ కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కవురు శ్రీనివాస్, పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, గాదిరాజు సుబ్బరాజు, రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు,  గూడూరి ఉమాబాల, మంతెన యోగీంద్ర బాబు, చెల్లెం ఆనందప్రకాష్, కమ్మ శివరామకృష్ణ, బూరుగుపల్లి సుబ్బారావు పాల్గొన్నారు.

నల్లరిబ్బన్‌ ధరించి.. 
రాష్ట్ర ప్రజలు కష్టాలు పడుతున్నా.. పట్టని టీడీపీ సర్కారు నవనిర్మాణ దీక్షల పేరుతో ఏటా వేడుక చేయడాన్ని నిరసిస్తూ.. శనివారం వైఎస్సార్‌ సీపీ నయవంచన దినంగా పాటించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతికి నల్లరిబ్బన్‌ ధరించి ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, శ్రేణులు కూడా ఉదయం నుంచి రాత్రి వరకూ చేతికి నల్లరిబ్బన్లు కట్టుకుని, నల్ల దుస్తులు ధరించి సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ చేస్తున్న మోసపూరిత, ఆత్మహత్యాసదృశ్యమైన నవనిర్మాణ దీక్షలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top