చినుకు పలకరించె.. జనం పులకరించె..

YS Jagan Praja Sankalpa Yatra In Visakhapatnam - Sakshi

ఆత్మ బంధువుపై     ఆత్మీయ వర్షం

జిల్లాలో ప్రతి చోటా ప్రజాసంకల్ప యాత్రకు వరుణుడి స్వాగతం

చినుకు పూల వానలోనూ ప్రభం‘జనం’

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కరువు నేలగా మారిన రాష్ట్రంలో జలసిరులు కురిపించిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో వరుణుడికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది.చంద్రబాబునాయుడు పాలనంటే కరువు మేఘాలే దర్శనమిచ్చేవి.మహానేత పగ్గాలు చేపట్టాక.. రాష్ట్రం సుభిక్షంగా మారింది.అపర భగీరథుడిలా జలయజ్ఞంతో అన్నదాతల మోముల్లో చిరునవ్వులు పూయించిన ఆ మహానేతంటే వరుణ దేవుడికి ఎంతిష్టమో..ఆయన వారసత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న జననేతతోనూ వానదేవుడు జోడీ కడుతున్నాడు.అందుకే...ప్రజాసంకల్పయాత్రలో భాగంగా.. అడుగు పెట్టిన ప్రతి నియోజకవర్గంలోనూ జనవర్షం సాక్షిగా అడుగులు వేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి చినుకు పూల జల్లులు స్వాగతం పలుకుతున్నాయి.అన్నంటే విశ్వాసం.. అన్నంటే భరోసా అంటూ జేజేలు పలుకుతున్న జన నీరాజనానికి ముగ్ధుడైన వాన దేవుడి అభిమానం హరివిల్లై.. ఆనందం చిరుజల్లై.. జననేత అడుగులో అడుగేస్తూ.. జ్ఞాపకాల తోటలో వాన పూలు కురిపిస్తున్నాడు.

ఆగస్టు 14వ తేదీన విశాఖ జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత.. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేరుకుంటున్న ప్రతి నియోజకవర్గంలోనూ వర్షం కురుస్తుండటంతో.. జనం ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం మబ్బుల గొడుగేసి.. చినుకుల అక్షతలు జల్లుతూ.. నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు రోజులపాటు జోరు వానలోనూ జనప్రవాహం సాగింది. నర్సీపట్నంలో జరిగిన బహిరంగ సభలో వర్షం కురిసింది. అయినా.. జనం చెదరకుండా జననేత ప్రసంగం కోసం ఎదురు చూశారు. ఆ తర్వాత.. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్లలోనూ అభిమాన నేతకు.. ఆత్మీయ వర్షం స్వాగతం పలికింది. యలమంచిలి నియోజకవర్గంలోనూ జగన్‌కు జన కెరటంతోపాటు జోరువాన కూడా తోడుగా నడిచింది.

యలమంచిలిలో బహిరంగ సభ నిర్వహిస్తుండగా కుండపోత వర్షం కురవడంతో 6 నిమిషాల్లో ప్రసంగం ముగించినా... జగనన్న మాట్లాడాలంటూ వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండా ప్రజలు జేజేలు పలకడంతో వరుణుడు కూడా ఉబ్బితబ్బిబ్బ య్యాడు. అనకాపల్లి నియోజకవర్గంలోనూ వర్షపు జల్లులు స్వాగతం పలికాయి. చినుకు పడినా చెదరని చిరునవ్వుతో పలకరించిన జననేత ఆత్మీయతకు జనం ఫిదా అయిపోయారు. అటు చోడవరం నియోజకవర్గంలోని వెంకన్నపాలెంలో చినుకు పూలు స్వాగతం పలికాయి. మాడుగుల నియోజకవర్గంలోని చీకటితోటలో చినుకు జల్లులు పలకరించాయి. పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం మండలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం బస చేసిన ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఇలా.. ఓవైపు అభిమాన వర్షం.. మరోవైపు వరుణుడి చినుకుల హర్షంతో ప్రజాసంకల్ప యాత్ర ప్రభంజనంలా సాగుతోంది...

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top