ప్రేమ కురిసింది

YS Jagan Praja Sankalpa Yatra in Visakhapatnam - Sakshi

తీక్షణమైన ఎండలోనూ పాదయాత్రికుడికి బ్రహ్మరథం

అడుగడుగునా సమస్యలు చెప్పుకున్న జనం

మీ వెంటే మేమంటూ కదం తొక్కిన వైనం

కోటవురట్ల, ఎస్‌.రాయవరం మండలాల పరిధిలోని

పల్లెల మీదుగాసాగిన ఆరోరోజు సంకల్పయాత్ర

సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు సెలయేటి గలగలలు..మరోవైపు చట్టూ దట్టమైన కొండల మధ్య వంపుసొంపులు తిరిగే రహదారులు. ఎటు చూసినా చూడచక్కని పచ్చని తివాచీ పరుచుకున్నట్టుండే పల్లె వాతావరణం. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 242వ రోజు ప్రజాసంకల్పపాదయాత్ర మంగళవారం పూర్తిగా కొండకోనల మధ్యలో సాగింది. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల, ఎస్‌.రాయవరం మండలాల పరిధిలోని గ్రామాల మీదుగా సాగిన పాదయాత్రకు ప్రజల నుంచి అడుగడుగునా అనూçహ్యస్పందన లభించింది. దారి పొడవునా వేలాది మంది రోడ్ల కిరువైపులా బారులు తీరి జననేతకు ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలను చెప్పుకుని గోడు వెళ్లబోసుకున్నారు. అడుగు పెట్టిన ప్రతిచోట ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఆరో రోజు పాదయాత్ర కైలాసపట్నం నుంచి ప్రారంభమైంది. చౌడవాడ క్రాస్, గొట్టివాడ, పందూరు క్రాస్, రామచంద్రపురం క్రాస్, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ,దార్లపూడి జంక్షన్‌ మీదుగా దార్లపూడి వరకు సాగింది. దారిపొడవునా జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడిచిన ఐదురోజుల్లో ఏ ఒక్కరోజు సూరీడు కన్పించలేదు. ఒక పూట మబ్బులు..మరొక పూట వర్షం అన్నట్టుగా సాగింది. అలాంటిది ఆరోరోజు మంగళవారం పాదయాత్ర సాగినంత సేపు తీక్షణమైన ఎండ కాసింది. మండు టెండను సైతం లెక్కచేయకుండా సుమారు కిలో మీటరు మేర వేలాది మంది ప్రజలు జననేత వెంట అడుగులో అడుగులేస్తూ కదంతొక్కారు.

పోలవరం ఎడమ కాలువ పనుల పరిశీలన
మార్గమధ్యంలో వైఎస్‌ జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరం ఎడుమ కాలువ పనులు నత్తడనక సాగుతున్న తీరును పరిశీలించారు. అక్కడే పోలవరం ఎడమ కాలువలో భూములు కోల్పోయిన 35 కుటుంబాల రెల్లి సామాజిక వర్గాలకు చెందిన నిర్వాసితులు జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను  పోలవరం కాలువ పేరు చెప్పి ఖాళీ చేయించేశారని..కానీ పైసా కూడా పరిహారం ఇవ్వలేదంటూ జగన్‌ వద్ద మొరపెట్టుకున్నారు. ఇక నష్టాలబాట పట్టిన ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ మీదుగా వెళ్తూ కార్మికులు..ఉద్యోగుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా ఫుల్‌టైం పనిచేయించుకుంటూ అరకొర వేతనాలు ఇస్తున్నారని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్‌ ఉపాధ్యాయులు జగన్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు.

మేమంతా మీ వెంటే : కాపు సంఘీయులు
కైలాసపట్నం వద్ద కాపు సామాజిక వర్గీయులంతా జగన్‌ను కలిసి తామంతా మీ వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌ మావాడే అయినప్పటికీ ఆయన వెంట వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అధికారంలోకి వస్తే ఐదేళ్లలో కాపులకు రూ.10వేల కోట్లు ఇస్తామన్న మీపైనే మాకు విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు.

జగన్‌కు బక్రీద్‌ శుభాకాంక్షలు
పార్టీ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బర్కత్‌ అలీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు కైలాసపట్నం వద్ద జగన్‌ను కలిసి బక్రీద్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఉదయం 8.45 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం 4.45 గంటలకు ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి వద్ద ముగిసింది. సంకల్పయాత్రలో పాదయాత్ర ప్రొగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, పార్టీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, సమన్వయకర్తలు గొల్ల బాబూరావు, వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.సిహెచ్‌. మోహనరావు, విజయనగరం రాజకీయ వ్యవహరాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్‌ రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.రామచంద్రరాజు, ఏటికొప్పాక సుగర్‌ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.రామభద్రరాజు, దౌలూరు దొరబాబు, మాజీ జడ్పీ చైర్మన్‌ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,  బొడ్డేడ ప్రసాద్, సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర యూత్‌ విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, ఎం.జోబ్‌దాస్‌ చిన్ని, తాండవ సుగర్స్‌ సీడీఎస్‌ మాజీ చైర్మన్‌ గూటూరు శ్రీను, తాడి విజయ భాస్కరరెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్‌ నాయకుడు ఫరూఖీ, సిటీ మైనారిటీ సెల్‌ ప్రతినిధి షేక్‌ బాబ్జీ , తిప్పల వంశీరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఈగలపాటి యువశ్రీ, సిటీ ఇంచార్జ్‌ కె.శాంతి కుమారి, కమరున్నీషా బేగం, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష, రూరల్‌ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి వర్మ, జిల్లా నాయకులు దత్తుడుబాబు, నూతులపాటి సోనీవుడ్, డాక్టర్‌ సౌమ్య, నారాయణమూర్తిబాబు, పెద సీతబాబు, డి.వి.బి.రాజగోపాలరాజు, తేటకాయల నారాయణ, గుడాల అప్పారావు, దగ్గుపల్లి సాయిబాబా, నీటిపల్లి లక్ష్మి, దేవవరాల నాగభూషణం,  జడ్పీటీసీ సభ్యులు వంతర వెంకటలక్ష్మి, కంకిపాటి పద్మకుమారి, చోడిపల్లి శ్రీను, ఎస్‌.ఎ.ఎన్‌.మధువర్మ, గాడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబును కోర్టుకు ఈడ్చాలి..
‘డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని నమ్మబలికితే చంద్రబాబుకు ఓట్లేశాం. కానీ గద్దెనెక్కిన తర్వాత మాఫీ అటకెక్కించేసి పసుపుకుంకుమ కింద పదివేలు ఇస్తామన్నారు. ఆ పదివేలు కూడా మాకివ్వలేదు. పైగా మా సంఘాలకు ఎస్‌.రాయవరంలో ఎస్‌బీఐలో రూ.12 లక్షల అప్పుంది. మాఫీ హామీ వల్ల వాయిదాలు చెల్లించలేక పోయాం. వడ్డీలు కట్టే స్తోమత లేని పరిస్థితి. దీంతో బ్యాంకు అధికారులు ఇప్పుడు కోర్టు నోటీసులు ఇస్తున్నారు. మేమెందుకు కోర్టుకెళ్లాలి. మాకు హామీ ఇచ్చి వంచించిన చంద్రబాబును కోర్టుకు ఈడ్చాలి’ అంటూ కైలాసపట్నం వద్ద ఎస్‌.రాయవరం మండలం వెంకటాపురానికి చెందిన శ్రీదుర్గా, శ్రీ చైతన్య, వెంకటేశ్వర1,2 డ్వాక్రా సంఘాల సభ్యులు జననేత వైఎస్‌ జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top