సమష్టి కృషితోనే విజయం సాధ్యం

YS Jagan Praja Sankalpa Yatra Success In Vizianagaram - Sakshi

ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి

వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

హామీలను విస్మరించిన చంద్రబాబు : భూమన  

విజయనగరం, గరుగుబిల్లి(పార్వతీపురం): సమష్టి కృషితోనే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని దీన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు కదలాలని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. పార్వతీపురం పట్టణంలోని విశ్వవిజ్ఞాన విద్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సన్నాహక సభను ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బొత్స మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఎవరికి టిక్కెటు ఇచ్చినా కలిసికట్టుగా పని చేసి విజయం అందుకోవాలన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ గుర్తుతో గెలిచి టీడీపీలోకి రాజులు వెళ్లినా ప్రజలు జగనన్న వెంటే ఉన్నారన్న సత్యం ఇటీవల ప్రజాసంకల్ప యాత్ర సభ ద్వారా వెలుగు చూసిందని గుర్తు చేశారు. ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 28న సీతానగరం మండలం బగ్గందొరవలసలో ప్రవేశించడం ద్వారా పార్వతీపురం నియోజకవర్గం చేరుతుందన్నారు. తరువాత ఈ నెల 30న పార్వతీపురంలో బహిరంగ సభ ఉంటుందన్నారు. తరువాత 31న కురుపాం నియోజకవర్గంలోకి వెళ్తుందన్నారు. నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పని చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

హామీలను విస్మరించిన చంద్రబాబు : భూమన
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ తదితర హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ప్రజాసంకల్ప యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతుందన్నారు. 

జగనన్నకు జనహారతి పట్టాలి..: శత్రుచర్ల
ఏడాదిగా ఇల్లు, కుటుంబ సభ్యులను వీడి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు, రాజన్న రాజ్యం తెచ్చేందుకు ఎంతో శ్రమిస్తున్న జగన్‌కు జనం హారతి పట్టాలని పార్టీ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు కోరారు. క్రమశిక్షణతో మెలిగి ప్రజాసంకల్ప యాత్రను విజయవంతం చేయాలన్నారు. పార్వతీపురం శాసనసభ స్థానాన్ని రానున్న ఎన్నికల్లో గెలిచి జగనన్నకు బహుమానంగా ఇవ్వాలన్నారు.

నిలువునా మోసం
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల వారికి మోసం చేశారని పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు విమర్శించారు. ఇంటికో ఉద్యోగమంటూ ఉన్న ఉద్యోగాలను ఊడదీశారని దుయ్యబట్టారు. ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగార యాజమాన్యం రైతులకు రూ.11.34కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ సీనియర్‌ నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న జగన్‌ పాదయాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గర్భాపు ఉదయభాను కోరారు. యాత్ర ద్వారా పార్టీ సత్తాను చాటుదామని బీసీ సెల్‌ అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావు అన్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్నను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని సీనియర్‌ నాయకుడు కాపారపు శివున్నాయుడు అన్నారు.

తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడాలని పార్టీ జిల్లా కార్యదర్శి మువ్వల సత్యంనాయు డు పిలుపునిచ్చా రు. రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ విజయాలనికి ఇప్పటి నుంచే ఐక్యంగా పని చేయాలని అరకు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వెంపల గుర్రురాజు కోరారు.  పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలు, ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్, సీనియర్‌ నాయకులు యందవ నిర్మలాకుమారి, బొనెల సరిత, మాజీ చైర్మన్‌ మజ్జి నాగమణి, జిల్లా కార్యదర్శి అల్లం వెంకటరమణ, పార్వతీపురం, బలిజిపేట, సీతానగరం మండల కన్వీ నర్లు బోను రామినాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, బలగ శ్రీరాములనాయుడు, బీసీ సెల్‌ కార్యదర్శి కె.గౌరీశంకరరావు, పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల బూత్‌ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

బీజేపీని వీడి వైఎస్సార్‌ సీపీలోకి...
గరుగుబిల్లి(పార్వతీపురం): పార్వతీపురం పట్టణానికి చెందిన కోరాడ సత్యనారాయణ బీజేపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం చేరారు. పట్టణంలో ఆదివారం జరిగిన ప్రజాసంకల్పయాత్ర సన్నాహక సభలో ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా బొత్స ఆహ్వానించారు. బీజేపీ విధానాలు నచ్చకే ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్టు సత్యనారాయణ ప్రకటించారు. అలాగే పట్టణ మూడో వార్డు కౌన్సిలర్‌ వలిరెడ్డి రమణ, యూత్‌ నాయకులు వలిరెడ్డి జగదీష్‌ కూడా పార్టీలో చేరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top