అభిమాన వెల్లువ

Ys Jagan Praja Sankalpa Yatra in Srikakulam District - Sakshi

జిల్లాలో తొలి బహిరంగ సభకు         పోటెత్తిన జనం

పాదయాత్రలోనూ... అడుగడుగునా అదే జోరు

ఆద్యంతం ఆకట్టుకున్న జగన్‌ ప్రసంగం

జనసందోహంతో మురిసిన పాలకొండ

స్థానిక సమస్యలపై గళమెత్తిన ప్రతిపక్ష నేత

పాలకొండ పులకించింది. వీధులన్నీ జనసంద్రమయ్యాయి. రాష్ట్ర ప్రతిపక్ష నేత.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర బుధవారం పాలకొండ పట్టణంలో సాగింది. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభ జరిగింది. దీంతో ఈ ప్రాంతమంతా జనంతో ఉప్పొంగింది. వేలాది మంది తరలివచ్చి ‘కొండ’ంత బలాన్ని ఇచ్చారు. పదునైన మాటలు, అర్థవంతమైన విమర్శలు, నిక్కచ్చిగా నిజాలతో సాగిన జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగానికి జనం మద్దతు పలికారు. అశేష జనవాహినితో పాదయాత్ర చేసి అదే ఊపులో సభ నిర్వహించిన జగన్‌ అధికార పక్షాన్ని ఘాటైన విమర్శలతో దునుమాడారు. గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సర్కారు చేతకాని తనాన్ని జనాలకు వివరించారు. వైఎస్‌ హయాంలో జరిగిన పనులను ఉటంకిస్తూ ఇప్పటి ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. పనులు చేయడం చేతగాక తనపై విమర్శలు చేస్తున్న వారిని ప్రజాక్షేత్రంలోనే కడిగిపడేశారు. నవరత్నాల విశిష్టతను వివరిస్తూ పేదలకు ఎలా సేవలు చేస్తామో వివరించారు.

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: పాలకొండ జనప్రభంజనంతో పులకించిపోయింది. ఎక్కడ చూసినా జనంతో పట్టణం నిండిపోయింది. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి «రాకతో బుధవారం పాలకొండలో సరికొత్త కళ సంతరించుకుంది. ఆదివాసీలు, గిరిజన ప్రాంత ప్రజలు, మహిళలు, వృద్ధులు, యువకులంతా పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పట్టణమంతా జనసంద్రంగా మారిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుత నిరంకుశ పాలనలో అవస్థలు పడుతున్న ప్రజానీకానికి తానున్నానంటూ భరోసా ఇచ్చేందుకు దృఢ సంకల్పంతో సాగుతున్న ప్రజాసంకల్ప యాత్ర బుధవారం సాయంత్రానికి పాలకొండ చేరుకుంది. 308వ రోజు బుధవారం ఉదయం పాలకొండ మండలం అట్టలి క్రాస్‌ నుంచి బయలుదేరిన పాదయాత్ర తుమరాడ, తంపటాపల్లి క్రాస్, ఎల్‌ఎల్‌పురం క్రాస్‌ మీదుగా పాలకొండ పట్టణానికి చేరుకున్నారు. కోటదుర్గమ్మ ఆశీస్సులతో వేలాది మంది ప్రజల మద్దతుతో జగన్‌ మరింత ఉత్సాహంగా అడుగులు వేశారు.

అన్ని దారులూ...పాలకొండవైపే...
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో తొలి బహిరంగ సభను పాలకొండ పట్టణంలో బుధవారం సాయంత్రం నిర్వహించగా.. వేలాది మంది జనం పోటెత్తారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డు ఆవరణలో నిర్వహించిన బహిరంగసభకు నాలుగు వైపుల నుంచి జనం తరలివచ్చారు. సీతంపేట, శ్రీకాకుళం, రాజాం, వీరఘట్టం ప్రధాన మార్గాల నుంచి వాహనాలలో జనాలు స్వచ్ఛందంగా తరలిరావడంతో అందరి అడుగులూ పాలకొండ వైపే కదిలాయి. ప్రధాన రోడ్డు ఇరువైపులా ఫ్లెక్సీలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్త గొట్టేటి మాధవిలు ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అడుగులో అడుగు వేస్తూ...
పాదయాత్రలో భాగంగా పల్లెజనం జగన్‌కు నీరాజనం పలికారు. తన అడుగులతో భవిష్యత్‌కు మార్గం చూపుతున్న వైఎస్‌ జగన్‌కు మద్దతుగా వేలాది మంది ఆయన అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు. పాలకొండ మండలం అట్టలి (రాత్రి బస కేంద్రం) నుంచి ఉదయం పాదయాత్రగా బయలుదేరిన జగన్‌కు మహిళలు ఘన స్వాగతం పలికారు. ముందుగా అట్టలి క్రాస్‌ వద్ద వేదపండితులు, విశ్వబ్రాహ్మణులు జగన్‌కు ఆశీర్వదించారు. సీతంపేట ఏజెన్సీకి చెందిన ఆదివాసీలు థింసా తదితర సంప్రదాయ నృత్యాలతో  స్వాగతం పలికారు. గిరిజన పంటలైన పైనాపిల్, సీతాఫలాలను చూపిస్తూ... డప్పుల వాయిద్యాలతో సంబరాలు చేసుకున్నారు. మహిళలు గ్రామ గ్రామాన జగన్‌కు కుంకుమ బొట్టు పెట్టి, హారతులిచ్చి ఆశీర్వదించారు. ఈ క్రమంలో తుమరాడ వద్ద వందలాది మంది మహిళలు ‘వెన్నెలో వెన్నెల.. జగనన్న వచ్చాడోయ్‌ వెన్నెల... సీఎం కావాలమ్మా వెన్నెలా..’ అంటూ పాటలు పాడారు. దీనిపై జగన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ యాత్రలో పలువురు తమ సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. 108, 104 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ బాధితులు జగన్‌ను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. శెట్టి బలిజ సామాజిక కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రకటన చేసినందుకు జగన్‌కు ఆ సామాజిక నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తుమరాడ సమీపంలో కుమ్మరి కార్మికులను జగన్‌ ప్రత్యేకంగా కలుసుకుని వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం కుమ్మరి చక్రాన్ని తిప్పి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం సాగిన యాత్రలో హైదరాబాద్‌లో గతంలో భవనం కూలిన ఘటనలో 12 మంది వరకు మృత్యువాత పడిన సంఘటనను టీకే రాజపురానికి చెందిన సీతమ్మ అనే మహిళ జగన్‌ వద్ద ప్రస్తావించారు. అలాగే పాలకొండకు చెందిన మహిళా సంఘ నేత శోభారాణి జగన్‌ను కలిసి మహిళా సంఘాలకు ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక అవస్థలకు గురిచేస్తోందని, ఇచ్చింది గోరంత..చెప్పుకుంటుంది కొండంత...అన్న చందంగా ఆర్భాటాలు చేస్తోందని ఆమె వివరించారు. అలాగే సీతంపేటకు చెందిన వలసకూలీలు పెద్ద సంఖ్యలో వచ్చి జగన్‌ను కలిశారు. స్థానికంగా ఉద్యోగావకాశాలు లేకపోవడంతోనే వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందని వారంతా వాపోయారు. 

జగన్‌ ప్రసంగానికి జన హర్షం..
పాలకొండ బహిరంగ సభలో జగన్‌ ప్రసంగం స్థానికులను అద్భుతంగా ఆకట్టుకుంది. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌ ప్రస్తావించడంతో జనాలు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు పాలన తీరు, పాలకొండ నియోజకవర్గంలో ఏళ్లనాటి నుంచి పెండింగ్‌ సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో జనం చప్పట్లతో సంఘీభావం తెలిపారు. నోటి కొచ్చిన మాటలు, హామీలను ఇచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మవద్దంటూ జగన్‌ పిలుపునివ్వడంతో ప్రధానంగా యువకులు స్పందించి జైజగన్‌ అంటూ నినాదాలు చేశారు. వీరఘట్టం మండలం తెట్టంగి గ్రామాన్ని సీఎం చంద్రబాబు ఆదర్శ గ్రామంగా ప్రకటించి వదిలిశారని గుర్తుచేశారు. పాలకొండను మేజర్‌పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మార్చేసి, కనీసం మంచినీటిని సక్రమంగా అందివ్వడం లేదని, అలాగే ఇష్టానుసారంగా ఇంటి పన్నులు పెంచేసి పట్టణవాసులకు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు.

పాలకొండ ఏరియా ఆస్పత్రిలో లంచాలు ఇవ్వనిదే వైద్యం చేయడం లేదని విమర్శించారు. సీతంపేట గిరిజనోత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా జీసీసీని నిర్వీర్యం చేశారన్నారు. ఇక్కడ పిక్కతీసిన చింతపండును ఈ ప్రభుత్వం  55 రూపాయలకు కొనుగోలు చేస్తే, బాబు గారి హెరిటేజ్‌ కంపెనీల్లో మాత్రం కిలో రూ.390 అమ్ముతున్నారని జగన్‌ ఎండగట్టారు.  గత నాలుగున్నరేళ్లుగా ఏ ప్రాజెక్టునూ పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో మూడు నెలల్లో ఎన్నికలు రానుండడంతో మళ్లీ తోటపల్లి, జంపరకోట ప్రాజెక్టులను తెరపైకి తెచ్చి నిధుల మంజూరు చేయకుండా, నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top