మీరే మా నమ్మకం

Ys Jagan praja sankalpa yatra special - Sakshi - Sakshi - Sakshi

జన నేతకు వినతుల వెల్లువ ... తమ సమస్యలను పరిష్కరించే నేత వచ్చాడంటూ ఆదరణ

అభిమాన సంద్రం నడుమ సాగుతున్న వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర

ప్రజా సంకల్పం పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమస్య చెప్పుకుంటే పరిష్కారమవుతుందన్న నమ్మకం వల్లే  ప్రజా సంకల్పం పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. జగన్‌ను కలసి తమ బాధలు చెప్పుకుంటే అవి తీరుతాయన్న భరోసాతో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందడం లేదని.. అనారోగ్యంతో ఉన్న తమకు ఆరోగ్య శ్రీ వర్తించలేదని.. పిల్లల భవిష్యత్‌ అంధకారమయం అవుతోందని.. ఉద్యోగం నుంచి తొలగించారని.. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని.. ఇలా ఒకరిద్దరు కాదు.. అన్ని వర్గాల వారూ పాదయాత్రలో జగన్‌ను కలిసి కష్టాలు చెప్పుకుంటున్నారు. పక్షం రోజుల్లోనే వందలాది వినతులు వచ్చాయంటే అది జగన్‌పై ఉన్న నమ్మకమేనని, ఆయన ఇస్తున్న భరోసాయే కారణమని స్పష్టమవుతోంది.

జగన్‌ పాదయాత్ర ఇపుడు రాష్ట్రంలోని అన్ని వర్గాల వారినీ ఆకర్షిస్తోంది. ఊరూరా చర్చనీయాంశంగా మారింది. పాదయాత్ర అంచనాలకు మించి జనాదరణ చూరగొంది. గ్రామ గ్రామాన అవ్వలు, తాతలు, అక్కా చెల్లెళ్లు, విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు.. ఇలా వారు వీరు అని కాకుండా అన్ని వర్గాల వారు గంటల తరబడి వేచి చూసి.. జగన్‌ను కలుస్తున్నారు. ప్రతిపక్ష నేత చేయి పట్టుకుని నడవాలని, అడుగులో అడుగేయాలని వేలాది మంది పరితపిస్తున్నారు. ఏడాది తర్వాత జరిగే ఎన్నికల్లో జగన్‌ అధికారంలోకి వస్తాడని, తమ కష్టాలన్నీ తీరుస్తాడని అన్ని వర్గాల వారు నమ్మడమే ఈ జనాదరణకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అడుగడుగునా వినతుల వెల్లువ
ప్రజా సంకల్ప పాదయాత్ర ఎక్కడ సాగుతుంటే అక్కడికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి జగన్‌ను కలుసుకుంటున్నారు. సమస్యలు చెప్పుకుంటూ వినతిపత్రాలు ఇస్తున్నారు. దానర్థం వారి బాధలు వినడానికి ఒక మనిషి ఉన్నాడని నమ్మడమే. ఆ మనిషి రేపు అధికారంలోకి వచ్చినపుడు తమ సమస్యలు పరిష్కరిస్తాడని విశ్వసించడమే. మరో వైపు నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతకూ ఇది ఓ నిదర్శనం. ‘‘నాయకుడంటే ఎలా ఉండాలి? ఇచ్చిన మాట పట్ల ఎంత నిబద్ధతతో ఉండాలి? మాట ఇచ్చి తప్పితే మోసం చేసినట్లే అవుతుంది. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి ఆ తర్వాత వాటిని అటకెక్కిస్తే జనం ఊరుకోవాలా? అలాంటి నాయకులను కాలర్‌ పట్టుకుని నిలదీసే రోజు రావాలి. మోసం చేసిన నాయకులను గద్దె దించాలి. ప్రజలు నమ్ముతున్నారు కదా అని నోటికొచ్చిన వాగ్దానం చేసేస్తే కుదరదు’’ అని జగన్‌ మాట్లాడుతున్న అనేక అంశాలు జనంలో నానుతున్నాయి.

నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం హామీలన్నిటినీ అటకెక్కించడాన్ని, అన్ని సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తుండడాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తూ సాగుతున్న జగన్‌ ప్రసంగాలు బాగా ఆకట్టుకుంటున్నాయని బహిరంగ సభలలో జనం స్పందిస్తున్న తీరు స్పష్టం చేస్తోంది. ‘‘రాజకీయ నాయకునికి ప్రజల సమస్యల పట్ల స్పందించే గుణం ఉండాలి. మానవతా దృక్పథంతో అలోచించగలగాలి. అసలు రాజకీయవేత్త కావడమనేదే దేవుడిచ్చిన వరం. ప్రజలకు సేవ చేసి చరిత్ర సృష్టిŠంచడం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో సజీవంగా ఉండగలగడమే. ప్రజల సమస్యలను నువ్వు ఎంత బాగా వింటున్నావు. ఎంత బాగా పరిష్కరిస్తున్నావు అనేదే ప్రధానం’’ అని చెబుతూ మమేకమవుతుండడం కూడా ప్రజాసంకల్ప పాదయాత్రకు ఆదరణ పెరగడానికి కారణమని పలువురు అధికారులు చెబుతున్నారు. 

ప్రతీ అంశంలో ఎంతో స్పష్టత  
‘నాలుగేళ్ల చంద్రబాబు పాలన, హామీలు, సంక్షేమ పథకాలు, ఫిరాయింపు రాజకీయాలు, విలువలు, విశ్వసనీయత, ప్రత్యేక హోదా ఆవశ్యకత మొదలు.. పాదయాత్ర సాగుతున్న ప్రాంతంలో స్థానిక సమస్యల వరకు ఏ అంశమైనా ఎంతో స్పష్టతతో, నిర్దిష్టమైన గణాంకాలతో సహా జగన్‌ వివరిస్తున్న తీరు మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. అసెంబ్లీ సమావేశాలను ఎందుకు బహిష్కరించారో జగన్‌ స్పష్టంగా వివరిస్తున్నారు. రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులను ఎగదోస్తూ నీతిబాహ్యమైన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు తీరును ప్రపంచానికి తెలియజేయడం కోసం, చర్చనీయాంశంగా మార్చడం కోసమే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామని జగన్‌ చెప్పడం సబబే అని అత్యధికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశం ఇప్పటి వరకు సజీవంగా ఉన్నదంటే వైఎస్సార్‌సీపీ పోరాటమే కారణం. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలోనూ జగన్‌ సఫలమయ్యారు’ అని కర్నూలు జిల్లా బేతంచెర్ల సభలో పలువురు చర్చించుకున్నారు.

సమస్యలు వింటూ.. సాంత్వన పలుకుతూ..
ఇడుపులపాయలో నవంబర్‌ 6న అశేష జనవాహిని మధ్య ప్రారంభమైన పాదయాత్రకు కొద్ది సేపటికే వరుణుడి ఆశీర్వాదం లభించిందా.. అన్నట్లు వర్షం కురిసింది. వర్షాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగిన జగన్‌ పాదయాత్రలో ఒక్కొక్క అడుగూ వేసే కొద్దీ దారిపొడవునా వెల్లువలా సామాన్య ప్రజానీకం ఎదురొస్తున్నారు. అభిమానంతో స్వాగతం పలకడంతో పాటుగా తమ సమస్యలను ఆయన దృష్టికి తెస్తున్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష నేతకు వారు నివేదిస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలందరూ మెచ్చే పాలనను అందించాలనే కసి తనలో ఉందని జగన్‌ ప్రారంభం నాడే ప్రకటించడం ప్రజల మనసులకు బాగా హత్తుకుంది. ఆనాటి నుంచీ ప్రభుత్వోద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, నాలుగేళ్లుగా నిర్వీర్యం అవుతున్న ప్రభుత్వ పథకాల్లో పని చేస్తున్న ఉద్యోగులు జగన్‌ వద్దకు వచ్చి తమ సమస్యలను వివరిస్తున్నారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని ప్రతిపక్ష నేత ప్రకటించినందువల్ల ఆ వర్గం ఉద్యోగులంతా జగన్‌ను కలిసి తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ కింద ఏ ఆపరేషనైనా ఉచితంగా చేయిస్తామని జగన్‌ హామీ ఇవ్వడం పట్ల జనం నుంచి భారీ స్పందన వ్యక్తమైంది.

అందరినీ దగ్గరకు తీసుకుంటూ..
రుణమాఫీ జరగక తాము పడుతున్న ఇబ్బందులను రైతులు, డ్వాక్రా మహిళలు జగన్‌కు వివరిస్తున్నారు. చౌక దుకాణాల్లో రేషన్‌ సరుకులు తీసుకోవడానికి, వృద్ధాప్య పింఛన్‌ పొందడానికి వేలిముద్రలు కావాలని టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఆంక్షలతో నష్ట పోతున్నామని వృద్ధులు జగన్‌ దృష్టికి తెస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఆంక్షలను తొలగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. లెక్కలేనంత మంది పాదయాత్రలో జగన్‌ను కలుసుకుని తమ సమస్యల గురించి వివరిస్తున్నారు.. జగన్‌ ఎంతో ఓపికతో ప్రతి ఒక్కరినీ దగ్గరకు తీసుకుని ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల గురించి తెలుసుకుంటూ తమ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని దూరం చేస్తానని హామీ ఇస్తున్నారు. బహిరంగ సభలకు కూడా జనం పోటెత్తుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా గెలుపొంది ఆ తరువాత అధికార పార్టీ  ప్రలోభాల వలలో పడి ఫిరాయించిన నియోజకవర్గాల్లో అయితే స్థానికులనే ఆశ్చర్యపరిచేంతగా సభలకు జనం హాజరై జగన్‌ పట్ల తమఅభిమానాన్ని చాటుకున్నారు. 

ఏడు నియోజకవర్గాలలో పూర్తి..  
ఈనెల 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ప్రజాసంకల్ప పాదయాత్రను 3000 కిలోమీటర్ల మేర.. ఇచ్ఛాపురం వరకూ కొనసాగిస్తానని జగన్‌ ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటివరకు 212.2 కిలోమీటర్ల మేర నడకలో జగన్‌ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల శాసనసభా నియోజకవర్గంతో పాటు కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు (వైఎస్సార్‌  జిల్లా), ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్‌లలో పర్యటన పూర్తి చేశారు. బుధవారం సాయంత్రానికి రెండు నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసి ఎనిమిదవ నియోజకవర్గం పత్తికొండలో ప్రవేశించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top