మానని గాయం

YS Jagan Praja Sankalpa Yatra Postponed To Two Weeks - Sakshi

గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం

కత్తితో పొడిచిన దుండగుడు

కండరాలకు కుట్లు వేసి, చికిత్స అందిస్తున్న వైద్యులు

రెండు వారాలు విశ్రాంతి అవసరమన్న నిపుణులు

నేడు ప్రారంభం కావాల్సిన పాదయాత్ర వాయిదా

సాక్షిప్రతినిధి, విజయనగరం: జనమే ఆయన కుటుంబం... నిరంతరం వారికోసమే తన తాపత్రయం... అదే లక్ష్యంతో వేలాదికిలోమీటర్ల కాలినడకన ప్రయాణం. వారి సంక్షేమం కోసం ప్రణాళికల రూపకల్పనకే ఈ సాహసం. ఆయన వస్తుంటే అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఇవన్నీ భరించలేక ప్రత్యర్థుల కుట్రలు ఊపిరి పోసుకున్నాయి. పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేకపోయాయి. ఒక్కసారిగా హత్యాయత్నానికి ఉసిగొల్పాయి. గత నెల 25న విశాఖలోని ఎయిర్‌పోర్టు వేదికగా చేసుకుని కత్తితో దాడిజరిగింది. అదృష్టవశాత్తూ మెడకు తగలాల్సిన ఆ పోటు ఎడమభుజానికి తగలడంతో లోతైన గాయమైంది. ఇప్పుడు ఆ గాయం వల్ల తాత్కాలికంగా తప్పనిసరి పరిస్థితుల్లోడాక్టర్ల సూచన మేరకు మరికొన్నాళ్లు ప్రజాసంకల్ప పాదయాత్ర వాయిదా పడింది.

అనుకోని ఉపద్రవం: విజయనగరం జిల్లాలో సెప్టెంబర్‌ 24న ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర 32 రోజుల పాటు జైత్రయాత్రలా సాగింది. శృంగవరపుకోట నియోజకవర్గంలో మొదలై విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి మీదుగా సాలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టింది. ఒకటి రెండు రోజుల్లో పార్వతీపురం నియోజకవర్గానికి చేరుకుని, కురుపాం మీదుగా శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాల్సి ఉంది. ఇదంతా సజావుగా జరిగి ఉంటే మరో రెం డు మూడు రోజుల్లో జిల్లాలో పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయ్యేది. కానీ మధ్యలో రాహువులా వచ్చిన శ్రీనివాసరావు అనే దుర్మార్గుడు జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పదునైన కత్తితో మెడపైన కోసి చంపేయాలని ప్రయత్నించాడు.

జగన్‌ మంచితనమో, నాయకుల అదృష్టమో, రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యమోగానీ త్రుటిలో ప్రాణాపాయం నుంచి జగన్‌ తప్పించుకోగలిగారు. అయినా ఆయన కుడిభుజంలోకి కత్తి తోతుగా దిగింది. దానిని కూడా లెక్క చేయకుండా నవ్వుతూనే జగన్‌ హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడి ఆస్పత్రిలో గాయానికి చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కొద్ది రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈ నెల 3 నుంచి పాతయాత్రకు వెళ్లిపోతానని జగన్‌ చెప్పడంతో పా ర్టీ శ్రేణులంతా సన్నద్ధమవుతున్న తరుణంలో వైద్యులు పరీక్షలు జరిపి అప్పుడే బయటకు కదలడం మంచిది కాదని, గాయం మానేంతవరకూ విశ్రాంతి అవసరమని చెప్పారు. ఫలితంగా మరలా పాదయాత్ర వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు జగన్‌ ఆరోగ్యం కుదుటపడి ఆయన త్వరగా కోలుకుని తమ మధ్యకు రావాలని జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు యాగాలు, పూజలు చేస్తున్నారు. అన్న రాకకోసం జిల్లా అంతటా ప్రజానీకం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

పార్టీ శ్రేణులకు త్వరలో చెబుతాం: ఈ నెల 3 నుంచి జిల్లాలో ప్రారంభం కావాల్సిన ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర వాయిదా పడినట్లు పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్టులో గత నెల 25న జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో గాయపడిన జగన్‌మోహన్‌రెడ్డి మరికొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు పాదయాత్రను వాయిదా వేశారని ఆయన వెల్లడించారు. తిరిగి పాదయాత్ర ఎప్పుడు ప్రారంభమయ్యేదీ పార్టీ శ్రేణులకు, ప్రజలకు త్వరలోనే తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top