జగన్‌కు జన ఆశీర్వాదం

YS Jagan Praja Sankalpa Yatra in Ponduru Srikakulam - Sakshi

జన సంద్రమైన పొందూరు

నేడు సాయంత్రం చిలకపాలెంలో బహిరంగ సభ  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అడుగడుగునా జన నీరాజనం.. పూలతో స్వాగతాలు.. డప్పు వాయిద్యాలతో కోలాహలం.. తప్పెట గుళ్లతో సంబరా లు.. ఇలా ఎక్కడ చూసినా రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. ఆ నిండైన జనం మధ్య ఉదయించిన సూర్యుడిలా వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తూ ముందుకుసాగారు. తండోపతండాలుగా తరలివచ్చిన జనమంతా ‘సంకల్ప సిద్ధిరస్తు..’ అంటూ జగన్‌ను దీవించారు. బుధవారం 313వ రోజున ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం దవళపేట వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా, ఆనందపు రం, వాండ్రంగి మీదుగా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరులో అడుగుపెట్టారు. ఇక్కడ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. పొందూరు చరిత్రలో లేనివిధంగా వేలాది మంది జనం తరలివచ్చి, ఆయనను కలిసి తమ వినతులను అందజేశారు. అలాగే మహిళలు, కళాశాల విద్యార్ధులు జగనన్నతో సెల్ఫీలు దిగారు. ఈ యాత్రలో భాగంగా పలు వర్గాల బాధితులు జగన్‌ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. రాపాక కూడలి నుంచి ఎరుకులపేట క్రాస్, క్రిష్ణాపురం, రెడ్డిపేట వరకు పాదయాత్ర సాగింది. రెడ్డిపేట వద్ద జగన్‌ రాత్రి బస చేశారు.

జనసంద్రంగా పొందూరు..
జగన్‌ అడుగుతో ప్రముఖ ఖాదీ పట్టణమైన పొందూరు జనసంద్రమైంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఆమదాలవలస నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సమీప గ్రామాలన్నీ కదిలివచ్చి పొందూరును జనంతో ముంచెత్తాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు పొందూరు పట్టణ సరిహద్దులో జగనన్నకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడే హిందూ, ముస్లిం, క్రైస్తవ మతపెద్దలతో సర్వమత ప్రార్థనలు చేయించి, పూర్ణకుంభ స్వా గతం పలికారు. అనంతరం భారీ జన సందోహం నడుమ పాదయాత్రను పొందూరు పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ స్థానిక మహిళలను, వృద్ధులను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దారిపొడవునా తీన్‌మార్, తప్పెడు గుళ్లు తదితర వాయిద్యాలతో సంబరాలు అంబరాన్ని తాకినట్లుగా నాయకులు ఏర్పాట్లు చేశారు.

వినతులను ఓపిగ్గా వింటూ..
పాదయాత్రలో భాగంగా బాధితులు ఇచ్చే వినతులన్నింటినీ జగన్‌ ఎంతో ఓపిగ్గా వింటూ పరిష్కారాల మార్గాలతో పాటు భరోసా ఇస్తూ ముందుకు సాగారు. బుధవారం పాదయాత్రలో కూడా పలు ముఖ్య సమస్యలపై ఆయన స్పందించారు. చేనేత కార్మికులను ఆదుకుంటానని, ప్రతి కుటుంబానికి తన ప్రభుత్వంలో లబ్ధి చేకూరేలా చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే అగ్రిగోల్డ్‌ బాధితులు, సాక్షరతా కోఆర్డినేటర్లు కూడా జగన్‌ను కలిసి విన్నవించుకున్నారు. అలాగే ఉద్యోగులు సీపీఎస్‌ పింఛన్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అయితే దీనిపై జగన్‌ ముందుగానే హామీ ఇవ్వడాన్ని వారంతా స్వాగతించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు సాకేటి నాగరాజు తదితరులు కూడా జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. అలాగే ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ ఉద్యోగా లు కోల్పోవడంపై జగన్‌కు రాజకీయ కక్షలతో వేధింపులను వివరించారు.

పాదయాత్రలో ప్రముఖులు
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం పలువురు నేతలు, ముఖ్య కార్యకర్తలు జగన్‌ను కలి శారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్‌ కోర్డినేటర్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం, అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సీతారాం, పరీక్షిత్‌రాజు, పి.ఎ.సి సభ్యు డు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు రెడ్డి శాంతి, తలశిల రఘురాం, రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, సిఈసి సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజు, ఎచ్చెర్ల, ఇఛ్చాపురం నియోజకవర్గ సమన్వయ కర్తలు గొర్లె కిరణ్‌కుమార్, పిరియా సాయిరాజ్,  పొందూరు, సరుబుజ్జిలి ఎంపీపీలు సువ్వారి ది వ్య, కిల్లి సత్యనారాయణ, పార్టీ ముఖ్య నేతలు సువ్వారి గాంధీ, తమ్మినేని చిరంజీవి నాగ్, నర్తు రామారావు, ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్, పి.జె.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

నేడు చిలకపాలెంలో బహిరంగ సభ
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం 3 గంటల నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకపాలెం కూడలిలో వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ రాçష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ తెలియజేశారు. ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మం డలం నుంచి పాదయాత్రగా వస్తూ ఎచ్చెర్ల నియోజకవర్గంలో చిలకపాలెంలో సభ అనంతరం మళ్లీ పాదయాత్రగా ఎచ్చెర్ల వరకు జగన్‌ నడవనున్నట్లు రఘురాం తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top