అలుపెరగని పథికునిపై అవధి లేని మమత

YS Jagan Praja Sankalpa Yatra In East Godavari - Sakshi

తూర్పుగోదావరి :నయవంచనే నైజమైన నికృష్ట పాలనలో.. కమ్ముకున్న కష్టాల కారుచీకటిలో అలమటిస్తున్న జనానికి ఆశల పొద్దుపొడుపులా జననేత తూరుపు సీమలో పాదం మోపి రెండు నెలలు దాటింది. ‘వెతల్లో వెన్నంటి ఉండే నేస్తాన్నవుతా..కన్నీరు తుడిచే హస్తాన్నవుతా..’ అంటూ ఆ అలుపెరగని బాటసారి జిల్లాలో ఏ గడ్డన సాగినా.. ఆయనపై ప్రేమ.. వరదవేళ గోదారిలో పరవళ్లు తొక్కింది. ఎండైనా, వానైనా, రుతువేదైనా మమత కుండపోతలా కురిసింది. ‘మీ అభిమానమే ఆయుధంగా సురాజ్యసాధన తథ్యం..నా వెన్నంటి సాగిన మీ అడుగులపై ఆన.. మీ స్వప్నం అవుతుంది సత్యం’ అంటూ భరోసానిస్తూ సాగిన ఆ మహాపథికుడి పాదయాత్ర 236వ రోజు సోమవారం తుని నియోజకవర్గంలో జరిగింది. 

సీనియారిటీ ఉన్నా ప్రమోషన్‌ ఇవ్వలేదన్నా..
సీనియారిటీ ఉన్నా తనను కాదని మరొకరికి అంగన్‌వాడీ టీచర్‌గా ప్రమోషన్‌ ఇచ్చారని ఎన్‌.సూరవరానికి చెందిన అంగన్‌వాడీ హెల్పర్‌ చెయ్యేటి వెంకటలక్ష్మి జగన్‌ వద్ద గోడు చెప్పుకొన్నారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో తొమ్మిది సంవత్సరాలుగా హెల్పర్‌గా పని చేశానని, టీచర్‌గా ప్రమోషన్‌ ఇవ్వాల్సి ఉండగా తనకంటే చాలా తక్కువ కాలం పని చేసిన వ్యక్తికి అంగన్‌వాడీ టీచర్‌గా ప్రమోషన్‌ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కోర్టును సైతం ఆశ్రయించానని, తనకు న్యాయం జరిగేలా చూడాలని  కోరారు.

ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు..
‘ఏడాది క్రితం కడుపులో నీటి కణితి ఏర్పడి తీవ్రమైన నొప్పితో బాధపడేదాన్ని. ఆస్పత్రిలో చూపిస్తే కణితిని తొలగించాలని, రూ.లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పడంతో సొంత ఖర్చుతో ఆపరేషన్‌ చేయించుకున్నా’నంటూ ఆవేదన వ్యక్తం చేశారు తాటిపాకకు చెందిన అల్లు సత్యవతి. ‘ఆరునెలల తర్వాత అదే సమస్య తిరిగి రావడంతో మరో సారి ఆపరేషన్‌ చేశారు. ఇలా రెండు సార్లు సొంత ఖర్చులతో ఆపరేషన్లు చేయించుకున్నాను. ఆరోగ్యశ్రీ వర్తించదనడం బాధించింది’ అని వాపోయారు.

ఆపరేషన్‌ చేయించి ఆదుకోండి..
కంఠంపై కణితితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఆపరేషన్‌ చేయించుకునేందుకు స్తోమత లేదని, సాయం చేయాలని కోటనందూరు మండలం బొద్దవరానికి చెందిన ఎస్‌.శ్రీరాములు జగన్‌ను కోరారు. కణితి ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు అవుతుందని, నిరుపేద అయిన తనకు ఎవరూ లేరని చెప్పింది. ఆపరేషన్‌కు వైద్య సాయం అందించాలంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top