నేడు పాదయాత్ర కొనసాగింపు

YS Jagan Praja Sankalpa Yatra Continues In East Godavari - Sakshi

మాయదారి వర్షం ఆగితే బాగుణ్ను...

వర్షంలోనూ తరలివచ్చిన అభిమాన జనం

తెరిపిలేని వర్షంతో పాదయాత్ర షెడ్యూలు ఆదివారం రద్దు

సాక్షి ప్రతినిధి, కాకినాడ/కపిలేశ్వరపురం: సమస్యలతో సతమతమవుతున్న సామాన్యులకు భరోసానివ్వడం.. యువతీ యువకులకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించడం... ఇవీ జననేత జగన్‌ పాదయాత్రలో స్పష్టంగా కనిపించే అంశాలు. ఎండా వానను లెక్క చేయకుండా అడుగులు ముందుకు వేయడమే లక్ష్యంగా సాగుతున్న పాదయాత్రలో జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. తమ సమస్యలు చెప్పుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నా అంటూ వినతిపత్రాలు అందిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యతగల పాదయాత్రకు వర్షం కారణంగా ఆటంకం కలిగింది. తెరిపివ్వని వర్షంతో ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభం కాలేదు. తెరిపిస్తే మధ్యాహ్నం పాదయాత్ర మొదలు పెడదామని భావించారు. వర్షం ఆగకపోవడంతో పాదయాత్రను రద్దు చేసుకోవల్సి వచ్చింది.

జగన్‌ కోసం జనం ఎదురు చూపులు
గొల్లలమామిడాడలో బహిరంగ సభ నిర్వహిం చిన అనంతరం శనివారం రాత్రి గ్రామంలోనే జగన్‌ బస చేశారు. ఆదివారం ఉదయం జగన్‌ పాదయాత్ర  ప్రారంభిస్తారని గొల్లలమామిడాడలో బస క్యాంపునకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన పాదయాత్రకు సిద్ధమైనా వర్షం కారణంగా కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. రోడ్లే కాకుండా బస కేంద్రం కూడా బురదమయమైంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. మాయదారి వర్షం తగ్గితే బాగుణ్ను జగనన్నను చూసేందుకు వీలవుతుందంటూ అక్క చెల్లెమ్మలు, యువతీ యువకులు, విద్యార్థులు ఆశించారు. అయితే వారి ఆశలను వర్షపు చినుకులు ఆవిరి చేశాయి. అడుగు బయట పెట్టలేని విధంగా ఏకధాటిగా వర్షం కురుస్తూ ఉండటం ఇబ్బందికరంగా మారింది. పాదయాత్ర ప్రారంభించేందుకు అనుకూలంగా లేకుండా పోయింది.

సందడిగా మారిన క్యాంపు కార్యాలయం...
పార్టీ నాయకులు, కార్యకర్తలతో గొల్లల మామిడాడ బస క్యాంపు సందడిగా మారింది. పాదయాత్ర ప్రారంభం కాకపోయినప్పటికీ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు వర్షంలోనే బారులుతీరారు. డ్వాక్రా సంఘాల మహిళలు, సంఘమిత్ర, వీఏఓలతోపాటు వెలుగు యానిమేటర్లు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పాతికేళ్లుగా ప్రభుత్వానికి ఎన్నో సేవలు అందిస్తున్నా తమనేమాత్రం పట్టించుకోవడం లేదని యానిమేటర్లు వాపోయారు. గతంలో తమకు రూ.2 వేల గౌరవ వేతనం ఇచ్చేవారని, ఇప్పుడా మొత్తం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. వారి బాధలు విన్న జననేత వారికి భరోసా ఇచ్చారు. గ్రామాల్లో పలు విధాలుగా సేవలందించే పొదుపు సంఘాలు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అందుకే పార్టీ అధికారంలోకి వస్తే యానిమేటర్లకు నెలకి రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం 2016 అక్టోబర్‌ తర్వాత బ్యాంకులకు వడ్డీ మొత్తం చెల్లించకపోవడంతో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని, అధికారంలోకి వస్తే సున్నా వడ్డీ రుణాలు అందేలా చూస్తామని చెప్పారు. బ్యాంకులకు వడ్డీ మొత్తం చెల్తిస్తామని హామీ ఇచ్చారు.

ఉద్యోగులకు ప్రతికూలంగా ఉన్న కాంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని రద్దు చేస్తామన్న ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ  రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వైఎస్‌ జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ ప్రతినిధులు పలు సమస్యలు చెప్పుకున్నారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని, ఉద్యోగ సంఘాలతో చర్చించి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని  వెల్లడించారు. హెల్త్‌ కార్డులు సక్రమంగా ఉపయోగపడటం లేదని, ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని రకాల వైద్య సహాయం అందడం లేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. అన్నింటినీ సావధానంగా విన్న జననేత భరోసా ఇచ్చారు. ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని, ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు చేసి సేవలు మరింత విస్తరిస్తామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. దీంతో ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేసి,సంఘీభావంగా ఉంటామని ప్రకటించారు. అంతకుముందు టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన 11మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

రీజినల్‌ కో ఆర్డినేటర్లతో వైఎస్‌ జగన్‌ భేటీ...
పాదయాత్ర శిబిరం వద్ద వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్లు, నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటలపాటు సమావేశమై పలు  నిర్ణయాలు తీసుకున్నారు. పాదయాత్ర శిబిరానికి పార్టీ సీనియర్‌ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ,  వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి , పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి,  భూమన కరుణాకరరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి,  మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్, సమన్వయకర్తలు సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు,  చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ తదితరులు వచ్చి జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు.

నేడు గొల్లల మామిడాడ నుంచిపాదయాత్ర ప్రారంభం
అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలోని గొల్లలమామిడాడ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభమవుతుంది.  పెద్దాడ, కైకవోలు, పెదపూడి, దోమాడ, కరకుదురు గ్రామాల్లో జగన్‌ ప్రజలతో మమేకమవుతూ పాదయాత్రను కొనసాగిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top