అన్నా.. జగనన్నా..

YS Jagan Praja Sankalpa Yatra completed kurnool district - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 25వ రోజు ఆదివారం అడుగడుగునా ప్రజల ఆత్మీయత, అభిమాన జన సంద్రం నడుమ సాగింది. జన నేతను స్వయంగా కలవాలని, తమ సమస్యలు చెప్పుకోవాలని భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. మదనంతపురం క్రాస్‌ మొదలు అనంతపురం జిల్లా సరిహద్దు అయిన బసినేపల్లి వరకు పాదయాత్ర సాగిన ప్రాతంతంలో రోడ్డుపై జనం కిక్కిరిశారు. లారీలు, బస్సులపైకి ఎక్కి జననేతకు అభివాదం చేశారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పింఛన్లు రావడం లేదని కొందరు, రేషన్‌ కార్డులు మంజూరు చేయలేదని మరికొందరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఉన్న ఊరును వదిలి వెళ్లాల్సి వస్తోందని ఇంకొందరు జగన్‌కు విన్నవించారు.    

 సీఎంను కలిసినా ప్చ్‌..
‘అయ్యా.. మాకున్న ఐదెకరాల పొలం అమ్ముకుని వైద్యం చేయించినా మా కుమారుడు పురుషోత్తంకు కిడ్నీ వ్యాధి నయం కాలేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సిఫార్సులేఖతో కలెక్టర్‌ను కలిస్తే ఆయన కసురుకుని వెనక్కి పంపారు’.. అంటూ తుగ్గలి మండలం గుడిసె గుప్పరాళ్ల గ్రామానికి చెందిన నారాయణ, అంజనమ్మ దంపతులు జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. వారు ఆదివారం ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘మా కుమారుడి వైద్యం కోసం పొలం అమ్ముకుని నిరుపేదలయ్యాం.. మాకు మరో నలుగురు కుమార్తెలు కూడా ఉన్నారు’.. అని వాపోయారు.  

 స్కాలర్‌షిప్‌ ఇవ్వడం లేదన్నా..
‘మా పిల్లలకు గతంలో ఆమ్‌ఆద్మీ బీమా యోజన స్కాలర్‌షిప్‌లు ఇచ్చేవారు.. చంద్రబాబు వచ్చినప్పటి నుంచి అవి కూడా తీసేశారు. దీంతో పిల్లల్ని చదివించడం భారమవుతోంది’.. అంటూ పగిడిరాయికి చెందిన అను గ్రూపు లీడర్‌ వెంకటలక్ష్మి జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. వారి సమస్యలపై జగన్‌ స్పందిస్తూ.. ఏడాదిలో ప్రజాప్రభుత్వం వస్తుందని, సమస్యలన్నీ తీరిపోతాయని, పొదుపు రుణాలు ఎంత మొత్తంలో ఉన్నా బ్యాంకులతో సంబంధం లేకుండా ఆ మొత్తం డబ్బును నాలుగు విడతల్లో మీ చేతికే ఇస్తామని పునరుద్ఘాటించారు.  

 రూ.4 లక్షలే ఇచ్చి.. 5 లక్షలకు వడ్డీ వసూలు..
‘బ్యాంకులో డ్వాక్రా రుణం కింద రూ.ఐదు లక్షలు మంజూరుచేసి లక్ష డిపాజిట్‌ కింద ఉంచుకుని.. నాలుగు లక్షలే చేతికిచ్చారు.. అదేంటని అడిగితే తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదంటూ బ్యాంకర్లు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు’.. అంటూ పగిడిరాయికి చెందిన శ్రీలక్ష్మి గ్రూపు లీడర్‌ బాలమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాసంకల్ప యాత్రలో ఆదివారం జగన్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. చేతికివ్వని ఆ లక్ష రూపాయలకు కూడా మూడేళ్లుగా వడ్డీ కట్టించుకుంటున్నారని వాపోయారు. పలుచోట్ల డ్వాక్రా సంఘాల లీడర్లు జగన్‌ను కలిసి ఇదే సమస్యను వివరించారు. పొదుపు మహిళలకు పసుపు–కుంకుమ పేరుతో ఒక్కొక్కరికీ రూ.10 వేలు ఇస్తామని చెప్పి అనేకమందికి సొమ్ములు చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రజాసంకల్ప యాత్ర రోజు
ఇప్పటి వరకు నడిచిన దూరం
356.8కి.మీ

25వ రోజు 
నడిచిన దూరం
10.6 కి.మీ

ప్రారంభం: ఉ. 8.30 గం.లకు మదనంతపురం క్రాస్‌
ముగింపు: సా. 5.40 గం.లకు 
బసినేపల్లి (గుంతకల్లు నియోజకవర్గం, అనంతపురం జిల్లా )
ముఖ్యాంశాలు: ∙ఎర్రగుడి సమీపంలో రైతులతో ముఖాముఖి
∙అడుగడుగునా జనం ఘనస్వాగతం

నేటి పాదయాత్ర షెడ్యూల్‌
ప్రారంభం: ఉ. 8.00 గం.లకు, బసినేపల్లి
ముఖ్యాంశాలు: బసినేపల్లి, గుత్తి రైల్వేస్టేషన్‌ 
వద్ద జెండా ఆవిష్కరణ 
 గుత్తి గాంధీచౌక్‌లో సభ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top