జగమంత కుటుంబం

ధర్మవరం నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగుతోన్న పాదయాత్ర

రోజంతా జగన్‌తో పాటు నడిచిన వేలాది ప్రజలు

వైఎస్సార్‌సీసీలో చేరిన డిప్యూటీ మేయర్‌ గంపన్న సోదరుడి కుమారుడు చంద్రశేఖర్, ధర్మవరం టీడీపీ కీలక నేత రవూఫ్‌ 

అడుగడుగునా సమస్యలు ఏకరువు పెట్టిన ధర్మవరం నియోజకవర్గ ప్రజలు

తమ బిడ్డ వస్తున్నాడని పెద్దలు...తమ సోదరుడు వస్తున్నాడని మహిళలు..తమ మనుమడు వస్తున్నాడని అవ్వాతాతలు...ఒక్కమాటలో చెప్పాలంటే తమ కుటుంబసభ్యుడు వస్తున్నాడని చిన్నాపెద్దా... ముసలిముతక తేడా లేకుండా ధర్మవరం నియోజకవర్గ వాసులంతా తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జగన్‌తో పాటు అడుగు కలిపారు. జగన్‌ కూడా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకున్నారు. చెప్పిన  ప్రతి సమస్యనూ ఓపికగా ఆలకించారు. సూచనలూ స్వీకరించారు. 

సాక్షిప్రతినిధి, అనంతపురం: ప్రజాసంకల్పయాత్ర 11వరోజు (మొత్తంగా36వ రోజు) శనివారం ఉదయం 8.30గంటలకు చిగిచెర్ల శివార్ల నుంచి మొదలైంది. జగన్‌ను వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి యాత్ర విజయవంతం కావాలని దీవించారు. చిగిచెర్లకు చేరుకోగానే మహిళలు హారతి పట్టారు. ఆ తర్వాత వసంతాపురానికి జ్యోతి, నారాయణమ్మతో పాటు పలువురు ఉపాధిహామీ కూలీలు వచ్చి జగన్‌ను కలిశారు. వారం రోజులు పనిచేస్తే రూ.వంద మాత్రమే కూలీ ఇచ్చారని, దీంతో 8 నెలలుగా పనికి వెళ్లకుండా మానేశామన్నారు. తర్వాత రోడ్డపై చేనేత కార్మికులు కలిసి మగ్గం బహుకరించారు. తర్వాత అనంతపురం న్యాయవాదులు కలిసి యాత్రకు సంఘీభావం ప్రకటించారు. తమ సమస్యలను వివరిస్తూ పరిష్కారానికి సహకరించాలని కోరారు. 

ఓబులేసు అనే వికలాంగుడు వచ్చి 90శాతం వైకల్యం ఉన్నప్పటికీ కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడననే కారణంతో పింఛన్‌ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తర్వాత కల్లుగీత కార్మికులు కలిశారు. సొసైటీలో లైసెన్స్‌లు ఉన్నా టీడీపీ నేతలు అక్రమంగా దుకాణాలు నడుపుతూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి బడన్నపల్లికి చేరుకోగానే జగన్‌కు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా బంతిపూలు పరిచారు. ఇళ్లముందు కల్లాపిచల్లి ముగ్గులు వేసుకున్నారు. అందరినీ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. ఇటీవల హత్యకు గురైన చెన్నారెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తర్వాత వైఎస్సార్‌సీపీ జెండా ఆవిష్కరించి శాంతికపోతాన్ని ఎగరవేశారు. ఆపై అనంతపురం డిప్యూటీ మేయర్‌ సాకే గంపన్న సోదరుడి కుమారుడు సాకే చంద్రశేఖర్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. 

మల్కాపురం క్రాస్‌ వద్దకు చేరుకోగానే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమక్షంలో పార్టీలో ధర్మవరం టీడీపీ మైనార్టీ కీలక నేత అబ్దుల్‌రవూఫ్‌ చేరారు. అక్కడి నుంచి గొట్లూరు వరకు దారి మధ్యలో పార్టీ కార్యకర్తలను జగన్‌కు కేతిరెడ్డి పరిచయం చేస్తూ వచ్చారు.  గొట్లూరులో భారీగా జనం జేజేలు పలుకుతుండగా జెండా ఆవిష్కరించారు. గొట్లూరు చేరుకోగానే యాత్ర 500కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. దీనికి గుర్తుగా గ్రామంలో వక్కమొక్కను జగన్‌ నాటారు. గ్రామంలో జగన్‌పై పూలవర్షం కురిపించారు. జగన్‌ కోసం గంటల తరబడి వేచి ఉన్న మహిళలు, వద్ధులు జగన్‌ కన్పించగానే పరుగును చెంతకు చేరారు. 

అందరినీ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. జగన్‌ ఆప్యాయతకు కొందరు మహిళలు ఆనందబాష్పాలు రాల్చారు. ‘నువ్వసల్లంగా ఉండాలి నాయనా! ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ వద్ధులు ఆశీర్వదించారు. గొట్లూరు శివార్లలో యాత్ర ముగిసింది. యాత్రలో హిందూపురం, అనంతపురం జిల్లా అధ్యక్షులు శంకర్‌నారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి, సమన్వయకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఉషాశ్రీచరణ్, నదీమ్‌ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శులు రమేశ్‌రెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, యువజన, రైతు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, సీఈసీ సభ్యుడు గిర్రాజు నగేష్, రాజారాం, పెన్నోబులేసు, కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, కంచం లీలావతి తదితరులు పాల్గొన్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top