చెదరని స్థైర్యంతో మళ్లీ మన ముందుకు..

Ys Jagan Padayatra Will Start From Tomorrow - Sakshi

తనపై హత్యాయత్నం తర్వాత తొలిసారిగా విశాఖకు..

నేటి సాయంత్రం రానున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌

జననేతకు ఘన స్వాగతం పలకనున్న పార్టీ శ్రేణులు, అభిమానులు

విజయనగరంలో రేపు సంకల్పయాత్ర పునః ప్రారంభం

సాక్షి, విశాఖపట్నం: ధీరోదాత్తుడు మళ్లీ ప్రజా సంకల్పయాత్రకు సిద్ధమయ్యారు. తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కోలుకొని ప్రజలతో మమేకమయ్యేందుకు పయనమవుతున్నారు. హత్యాయత్నం జరిగిన నాటి నుంచి తమ అధినేత జగన్‌ త్వరగా కోలుకోవాలని, మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సంకల్పయాత్ర కొనసాగించాలని పార్టీ నాయకులు, అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించి నేడు సంకల్పయాత్ర పునః ప్రారంభిస్తున్నారు. హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకుని తొలిసారిగా విశాఖ వస్తున్న తమ అభిమాన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలకడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. తమ అభిమాన నేతను చూడాలని, ఆప్యాయంగా పలకరించా లని తపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు భారీ సంఖ్యలో విమానాశ్రయానికి తరలివెళ్లడానికి తహతహలాడుతున్నారు. 

ప్రజలకు దూరంగా 18 రోజులు
వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 25న విజయనగరం జిల్లా సంకల్పయాత్ర నుంచి హైదరాబాద్‌ వెళ్లడానికి విశాఖ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో వీఐపీ లాంజిలో ఉన్న జగన్‌పై ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు కత్తితో పొడిచి హత్య చేసేందుకు ప్రయత్నించడం, క్షణాల్లో ఆయన దాని నుంచి తప్పించుకోవడంతో భుజంపై బలమైన గాయం కావడం తెలిసిందే. తనపై జరిగిన హత్యాయత్నం నుంచి తప్పించుకుని, భుజానికైన గాయం నొప్పిని పంటి బిగువున భరిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి విమానంలో హైదరాబాద్‌ పయనమయ్యారు.

 ఆయన భుజానికి శస్త్రచికిత్స చేసి కుట్లు వేసిన వైద్యులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో అప్పట్నుంచి ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. విరామం అనంతరం జగన్‌ సోమవారం నుంచి విజయనగరం జిల్లాలో మళ్లీ ప్రజా సంకల్పయాత్రను కొనసాగించనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి విశాఖకు విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయనగరం జిల్లాకు పయనమవుతారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top