పేదోడి ఆశలతో చంద్రబాబు ఆటలు: వైఎస్‌ జగన్‌


నంద్యాల: స్వాతంత్ర్య దినోత్సవం రోజున అబద్ధం చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబునాయుడు అని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. పేదోడి ఆశలతో చంద్రబాబు ఆటలాడుతున్నారని మండిపడ్డారు. 2014 ఆగస్టు 15 వేడుకల్లో కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలను సైతం చంద్రబాబు అమలుచేయలేదని గుర్తుచేశారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం  సాయంత్రం గుడిపాటిగడ్డలో జరిగిన జరిగిన రోడ్‌ షోలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.


గత మూడున్నరేళ్లలో ముఖ్యమంత్రి, టీడీపీకి చెందిన ప్రధాన నాయకులెవరూ నంద్యాల వైపు తిరిగి చూడలేదని అన్నారు. అదే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే ఓట్ల కోసం నంద్యాల వీధుల్లో ఎక్కడ చూసినా టీడీపీ శ్రేణులు కనిపిస్తున్నాయని చెప్పారు. 'ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు ఏ రోజైనా నంద్యాల వచ్చారా? కనీసం ఆయన కేబినేట్‌లోని మంత్రులైనా పట్టణం వైపు తిరిగిచూశారా? నేడు ఉప ఎన్నిక వచ్చేసరికి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌తో పాటు టీడీపీ నాయకులందరూ నంద్యాల రోడ్ల మీద కనపడుతున్నారు. ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ పోటీ  పెట్టింది కాబట్టే చంద్రబాబు నంద్యాలకు నిధుల కేటాయిస్తున్నారు తప్ప, నంద్యాలపై ఆయనకు ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు' అని అన్నారు.రాష్ట్ర విభజన అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కర్నూలుకు  వచ్చిన బాబు ఎయిర్‌పోర్టు, ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలులో స్మార్ట్ సిటీ, మైనింగ్‌ స్కూలు, ఫుడ్‌ పార్కు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు, పారిశ్రామిక పార్కులు నిర్మిస్తామని వాగ్ధానాలు చేసి మూడేళ్లు దాటింది. ఏ ఒక్కటైనా బాబు పూర్తి చేశారా? అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఓట్లు అడగడానికి మళ్లీ వస్తాడు. వచ్చి ఓట్లు అడుగుతాడు. అభివృద్ధి చేస్తా అని అబద్దాలు చెప్తాడు. రాజకీయ నాయకులు ఒకమాటిచ్చి తప్పితే ప్రజలు కాలర్‌ పట్టుకుని అడుగుతారనే భయం కలగాలి. నంద్యాలలో వేసే ఒక ఓటు వల్ల నేను ముఖ్యమంత్రిని కాలేకపోవచ్చు కానీ వచ్చే ఒక సంవత్సరంలో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఈ ఎన్నిక నాంది పలకాలన్నారు.చంద్రబాబు పొదుపు సంఘాలు , రైతులతో పాటు నిరుద్యోగులను కూడా మోసం చేశాడు. ఎన్నికల్లో గెలవడానికి జాబు రావాలంటే బాబు రావాలని.. టీవీలు, గోడలపై ప్రకటనలు ఇచ్చారు. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను వంచించారు. నిరుద్యోగ బృతి కింద ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికి చంద్రబాబు నెలకు రూ.2 వేల చొప్పున మూడున్నరేళ్లకు రూ.76 వేలు బాకీ పడ్డారు. ఆ డబ్బు ఇచ్చారా? అని ప్రశ్నించారు.  ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తానని బాబు అన్నారు. మూడున్నరేళ్లయింది ఒక్క ఇళ్లైన కట్టించారా?. ఎన్నికలైన తర్వాత ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు పాలనలో అక్క చెల్లెమ్మలు కన్నీరు పెట్టుకుంటున్నారు. అధికారంలోకి వస్తే రూ.14 వేలకోట్ల డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారు.


'చంద్రబాబు నాయుడుకు అభివృద్ది అంటే తెలియదు. అభివృద్ధి అంటే రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, దుకాణాలు పడకొట్టించండం, రోడ్లు తొవ్వించడం  కాదు. పోనీ బాధితులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలి. నంద్యాలలో నేడు సెంటు భూమి రూ.50 లక్షలు ఉంటే బాబు మాత్రం కేవలం 18వేలు ఇస్తానంటున్నారు. నంద్యాలను అభివృద్ధి చేసే బాద్యత నాకు ఇవ్వండి. అభివృద్ధి అంటే ప్రతి పేదవాని గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవడం. ఇవాళ చంద్రబాబు మాదిరిగా నా దగ్గర పదవి లేదు, డబ్బు లేదు, పోలీసులు లేరు, ఆయన చెప్పమన్నట్లు, రాయమన్నట్లు రాసే టీవీ చానెళ్ల, పేపర్లు లేవు. ఎన్నికలు ఉన్నప్పుడే ప్రజల ముందుకు వచ్చే బుద్ధి నా దగ్గర లేదు. నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ప్రజలు. నాకున్న ఆస్తి ఏమిటో తెలుసా?. నాన్న గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అవి ప్రజలకు చేసిన మంచి. ఇవాళ్టికి కూడా ఆయన చేసిన మంచిని ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. చంద్రబాబు దగ్గరున్నవి ఏవీ నా దగ్గరలేవు. ఉన్నవి కేవలం దేవుడి దయ, మీ అందరీ ఆశీస్సులు.

డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు అదే డబ్బుతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో డబ్బు మూటలతో బాబు ఇక్కడకు వస్తారు. ఓటుకు రూ.5 వేలు కుమ్మరిస్తారు. ఓటు తమకే వేయాలని మీ అందరితో దేవుడి మీద ప్రమాణం చేయించుకుంటాడు. మీ అందరికీ ఒకటే విషయం చెప్పదలుచుకున్నా.. వారు వచ్చినప్పుడు మీరు లౌక్యంగా ప్రవర్తించాలి. న్యాయమే గెలవాలని మనసులో ప్రార్థించాలి. న్యాయానికే ఓటు వేయండి. అధర్మానికి, ధర్మానికి మధ్య జరగుతున్న యుద్ధంలో న్యాయం వైపు నిలవండి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నంద్యాలలో పోటీ చేస్తున్న శిల్పామోహన రెడ్డికి ఓటు వేయాలని పేరుపేరునా కోరుతున్నా.' అంటూ ప్రసంగాన్ని ముగించారు.

 

Back to Top