మానవత్వం చాటిన సీఎం వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan Reddy Shows Humanity - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తానెప్పుడూ ప్రజల మనిషేనని జననేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి రుజువు చేశారు. ప్రజల గుండె చప్పుడు వినడానికి సదా సిద్ధంగా ఉంటానని చాటిచెప్పారు. విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన.. ‘బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అంటూ బ్యానర్‌ పట్టుకున్న కొంతమంది యువతీ యవకుడు కనిపించారు. వీరిని చూసిన జగన్‌ వెంటనే కాన్వాయ్‌ ఆపించి కిందికి దిగి నేరుగా వారి వద్దకు వెళ్లారు.

కేన్సర్‌తో బాధ పడుతున్న తమ స్నేహితుడు నీరజ్‌ కుమార్‌ ఆపరేషన్‌కు రూ. 25 లక్షలు ఖర్చవుతుందని, 30 తేదీగా అతడికి ఆపరేషన్‌ చేయించాలని ముఖ్యమంత్రితో వారు చెప్పారు. వారి మాటలను ఆలకించిన సీఎం జగన్‌.. ఆపరేషన్‌కు వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌కు ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి మానవత్వంతో స్పందించి తమ స్నేహితుడికి సాయం చేస్తామని చెప్పడంతో నీరజ్‌ మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. జగన్‌ లాంటి మంచి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదని, ఆయనకు చేతులెత్తి మొక్కుతున్నామని అన్నారు.

ఎవరీ నీరజ్‌?
నీరజ్ కుమార్‌... విశాఖలోని జ్ఞానాపురంకు చెందిన అప్పల నాయుడు, పద్మ దంపతుల కుమారుడు. ఇంటర్మీడియట్‌లో ఉండగా అతడికి బ్లడ్‌ కేన్సర్‌ ఉన్నట్టు గుర్తించారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీరజ్‌ ఆపరేషన్‌కు రూ. 20 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్ధిక సహాయం కోసం దాతలను కలిసినా అవసరమైన మొత్తం సమకూరకపోవడంతో అతడి స్నేహితులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అర్థించారు. సీఎం జగన్‌ తక్షణమే స్పందించడంతో నీరజ్‌ ఆపరేషన్‌కు జిల్లా కలెక్టర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top