నన్ను కలిసేందుకు వచ్చేవారిని అడ్డుకోవద్దు

ys jagan mohan reddy requests to police - Sakshi

పోలీసులకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి 

ఎల్లకాలమూ చంద్రబాబు ప్రభుత్వమే కొనసాగదు 

సింహాల వెనుక ఉన్న గుంట నక్కలకు సెల్యూట్‌ చేయొద్దు 

మిమ్మల్ని ఎవరైనా భయపెడితే భయపడొద్దు 

మీ విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించండి 

ప్రజాసంకల్ప యాత్ర నుంచి  ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్న తనను కలిసి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలను అడ్డుకోవద్దని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా బనగానపల్లె మండలం హుసేనాపురం వద్ద నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి వస్తున్న మహిళలను పోలీసులు అడ్డగించడంపై జగన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు బాస్‌ల ఆదేశాలకు లొంగి ఇలా చేయడం తగదని, ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదనే విషయం మర్చిపోరాదని సున్నితంగా హెచ్చరించారు. ‘‘నన్ను కలుసుకుని.. నాతో మాట్లాడడానికి ఉత్సాహంగా తరలి వస్తున్న మహిళలను పోలీసులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టి, అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ఆ పోలీసు బాస్‌లకు ఈ వేదిక ద్వారా ఒకటే విషయం తెలియజేస్తున్నాను. దయచేసి వినండి. మీరంతా కూడా ప్రభుత్వం తరఫున పని చేస్తున్నారనే విషయం మర్చిపోవొద్దు. 

మీ టోపీ మీద ఉన్న మూడు సింహాల కోసం మీరు పని చేస్తున్నారనే సంగతి ప్రతి పోలీసు సోదరుడు మర్చిపోవొద్దు. మీరు విధుల్లో ఉన్నది ఆ సింహాల వెనుక ఉన్న గుంట నక్కలకు సెల్యూట్‌ చేయడానికి కాదు. ప్రతిపక్ష నాయకుడిగా నేను అక్కాచెల్లెమ్మల సమస్యలను వినడానికి ప్రజల్లోకి వస్తున్నాను. తమ సమస్యలను ప్రతిపక్ష నేతకు చెప్పుకునే అవకాశాన్ని మహిళలకు ఇవ్వకపోవడం అన్యాయం, దారుణం. అన్ని సామాజిక వర్గాల ప్రజలూ వారి సమస్యలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారు. అలాంటి వారిని అడ్డుకోవడం ధర్మం కాదని ప్రతి పోలీసు సోదరుడికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే విషయాన్ని ప్రతి పోలీసు బాస్‌కూ చెబుతున్నా. ఎల్లకాలమూ చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే కొనసాగదనే విషయం కూడా మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. మీ (పోలీసులు) విధులను నిజాయతీ, చిత్తశుద్ధితో నిర్వర్తించండి. మిమ్మల్ని ఎవరైనా భయపెడితే భయపడవద్దని పోలీసు సోదరులను కోరుతున్నా. నిజాయతీతో పని చేయాల్సిందిగా మరొక్కసారి మనవి చేస్తున్నా. ఈ రోజు కల్పించిన విధంగా మరోసారి ప్రజలకు అడ్డంకులు సృష్టించవద్దు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇక్కడికి వచ్చిన అక్కాచెల్లెమ్మలకు, అవ్వలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ నేత ఆదేశాల మేరకే..
హుసేనాపురం వద్ద వైఎస్సార్‌సీపీ సోమవారం తలపెట్టిన ‘మహిళలతో జగన్‌ ముఖాముఖి’ కార్యక్రమానికి అనుమతి లేదనే నెపంతో పోలీసులు మహిళలను రానివ్వకుండా అడ్డుకున్నారు. స్థానిక టీడీపీ నేత ఆదేశాల మేరకే పోలీసులు మహిళలను అడ్డుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హుస్సేనాపురం వద్ద జరిగిన కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top