'అన్ని వర్గాల వారికి అండగా ఉంటా'

 ys Jagan mohan reddy promises free higher education to eligible students - Sakshi

సాక్షి, అనంతపురం: 'చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశారు. ఇపుడు ఉన్నత చదువులు చదవాలంటే రూ. లక్షల్లో ఫీజులున్నాయి. చంద్రబాబు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ. 35 వేలకే పరిమితం చేశారు. మీ అందరి ఆశీస్సులతో మనం అధికారంలోకి వచ్చాక పూర్తి రీయింబర్స్‌మెంట్‌ ఇస్తాను. పెద్ద పెద్ద కోర్సులు చదివే విద్యార్థులకు ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాను. అదేవిధంగా మీ పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ. 15 వేలు తల్లి ఖాతాలో జమ చేస్తాను. పెన్షన్‌ను రూ.1000  నుంచి రూ. 2 వేలకు పెంచేలా చర్యలు తీసుకుంటాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలకు పింఛన్‌ వయో పరిమితిని 45 ఏళ్లకు తగ్గిస్తాను. మరో వైపు జీవితాలని చిదిమేస్తున్న మద్యం రాకాసిని దశల వారీగా పూర్తిగా నిషేధిస్తాన'ని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం 38వ రోజు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని నేలకొండ తండా ప్రజలతో జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు తమ కష్టాలను జననేతకు చెప్పుకున్నారు. వారి బాధలు ఓపికగా విన్న అనంతరం జగన్‌ మాట్లాడుతూ.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారుస్తామన్నారు. అన్ని వర్గాల వారికి అండగా నిలబడతామని భరోసానిచ్చారు. 

కాగా అంతకుముందు బిల్వంపల్లి గ్రామంలో వైఎస్‌ జగన్‌ను గాండ్ల, తెలికల కులస్థులు కలిశారు. గాండ్ల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. యాత్రలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రిని ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తున్నారు. దారి పొడువునా పంట పొలాల్లోకి వెళ్లి కూలీలు, రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. ఉద్యోగుల ఇబ్బందులు తొల‌గిస్తాన‌ని హామీ ఇస్తున్నారు. దేవుడి దయ, ప్రజల అండతో త్వరలో మన ప్రభుత్వం రాబోతుందని.. అధికారంలోకి రాగానే అన్నివర్గాల వారికి న్యాయం జరిగేలా చేస్తానని రాజన్న తనయుడు  మాట ఇస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top