పులకించిన పల్లెజనం

ys jagan mohan reddy praja sankalpa yatra in vizianagaram district - Sakshi

ప్రతిపక్ష నేత జగన్‌ వెంట అడుగేసిన ఆత్మీయ జనం

విశాఖ– రాయపూర్‌ జాతీయ రహదారిపై పండగ వాతావరణం 

ఎడ్ల బళ్లతో స్వాగతం పలికిన వి.కృష్ణాపురం గ్రామస్థులు

దారిపొడవునా సమస్యలు వివరిస్తూ... వినతులిచ్చిన బాధితులు

జననేతను ఆశీర్వదించిన అభిమాన చిరుజల్లులు

సాక్షిప్రతినిధి విజయనగరం: జాతీయ రహదారి కాస్తా జనసమ్మర్దంతో నిండిపోయింది. ఆ మార్గంలో వచ్చే ప్రతీ బస్సూ ఆయనకోసం ఒక్క క్షణం ఆగింది. అందులోని ప్రయాణికుల్లో కరచాలనం చేసేవారు కొందరైతే... అభివాదం చేసేవారు మరికొందరు... సెల్‌ఫోన్‌లో తమ అభిమాన నేతను బంధించినవారు ఇంకొందరు. ఓ కుటుంబమైతే... ఏకంగా కిటికీనుంచి చంటిబిడ్డనే అందించేశారు. అదీ వారి అభిమానమంటే. అందరినీ పలకరిస్తూ... అనురాగంతో చేతులు ఊపుతూ... అడిగినవారితో కరచాలనం చేస్తూ... ముందుకు సాగారు జననేత. శాంతికి మారుపేరుగా నిలిచిన జిల్లాలో వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది.

 విశాఖ–రాయపూర్‌ జాతీయ రహదారిలో  శనివారం ఆయన యాత్ర సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. బహుదూరపు బాటసారిని చూడాలన్న బలమైన ఆకాంక్ష మండుటెండను సైతం విస్మరించేలా చేసింది. గంటల తరబడి ఎదురుచూస్తూ తమ అభిమాన నేత గ్రామాల్లో అడుగిడగానే కేరింతలు, జై జగన్‌ నినాదాలతో హోరెత్తాయి. ప్రధానంగా యువత పాదయాత్రలో హల్‌చల్‌ చేస్తూ పండగ వాతావరణం సృష్టిస్తున్నారు. యువత చూపిస్తున్న అప్యాయతకు ముగ్ధుడవుతున్న జగన్‌ వారి కోరిక మేరకు బృందాల వారీగా సెల్ఫీలు దిగారు. మరో వైపు అపన్నులు తమ  సమస్యలు, కష్టాలపై వినతులు ఇస్తూ గోడు చెప్పుకుంటున్నారు.  ఉదయం నుంచి మండుటెండలో ఎటువంటి అలుపు లేకుండా కొనసాగిన జననేతను సాయంత్రం వరణుడు చిరుజల్లులతో చల్లని దీవెనలు కురిపించాడు. 

అడుగడుగునా.. జననీరాజనం
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో 284వ రోజైన శనివారం జననీరాజనాల నడుమ సాగింది. గజపతినగరం శివారునగల శిబిరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మధుపాడ, భూదేవిపేట క్రాస్, మరుపల్లి, కొత్తరోడ్‌ జంక్షన్‌ మీదుగా మధ్యాహ్న భోజన విరామ సమయానికి గుడివాడ క్రాస్‌ వద్దకు చేరుకుంది. అనంతరం దత్తిరాజేరు మండలంలోని మానాపురం, మానాపురం సంత మీదుగా కోమటిపల్లికి చేరుకుంది. శనివారొ ఒక్కరోజు 10.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయగా... ఇప్పటివరకూ ఆయన యాత్ర 3131.5 కిలోమీటర్లకు చేరుకుంది. 

దారిపొడవునా వివిధ వర్గాలవారు తమ సమస్యలు తెలియజేస్తూ జననేతకు వినతులు సమర్పించారు. గ్రామీణ వైద్యుల సంఘం ప్రతినిధులు జగన్‌ను కలసి గ్రామాల్లో అనునిత్యం అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలందిస్తున్న తమకు గుర్తింపు లేకపోగా.. వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో తమకు ఉపాధి లేకుండా చేశారని, ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నా సర్వీసు క్రమబద్ధీకరణకు నోచుకోలేదని ఉపాధి ఫీల్డు అసిస్టెంట్లు వాపోయారు.

 సాక్షర భారత్‌ కో ఆర్డినేటర్‌లు తమకు ఎలాంటి నోటసులు లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించి తమ పొట్టలు కొట్టారని వారి గోడును వెళ్లబోసుకున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రాజకీయ వివక్ష కారణంగానే పింఛన్లు ఇవ్వటం లేదని వృద్ధులు, వికలాంగులు పిర్యాదు చేశా రు. కొర్లాం గ్రామస్తులు జననేతను కలిసి నాడు మహా నేత వైఎస్సార్‌ తమ గ్రామం నుంచే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిం చాలని కోరారు. రైతులు తాము పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదని, చంద్రబాబు ముఖ్య మంత్రి అయ్యాక బతుకులు మసిబారాయని ఆవేదన చెందారు.

 నీటి పారుదల శాఖ రిటైర్డ్‌ డీఈ దేముడు తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి గజపతినగరం బ్రాంచి కెనాల్‌పనులు పూర్తికాకపోవటంతో 15వేల ఎకరాలకు సాగు నీరందకుండా పోయిందని జననేత దృష్టికి తీసుకొచ్చారు. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించటంతో పాటు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలు కల్పించాలని సర్వశిక్ష అభియాన్‌లో కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కోరారు. న్యాయవాదులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆదుకోవాలని న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కోరారు.

నాయకుడి వెంట శ్రేణులు
పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు విజయ్‌చందర్, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాల సమన్వయకర్తలు పెనుమత్స సాంబశివరాజు, కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసప్పలనాయుడు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ఎస్‌.వి.రమణరా>జు, జిల్లా ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ పీరుబండి జైహింద్‌కుమార్, పార్టీ నేత ఇందుకూరి రఘురాజు, యువజన నేత అవనాపు విక్రమ్, గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.  

ఎడ్ల బళ్లతో స్వాగతం 
తమ అభిమాన నాయకుడు, కష్టాలు తీర్చే ధీరుడు తమ వద్దకు వస్తున్నాడన్న సమాచారంతో గజపతినగరం, దత్తిరాజేరు మండల్లాలోని గ్రామాల్లో సందడి నెలకొంది. కోమటిపల్లి గ్రామం వద్ద వి.కృష్ణాపురం పంచాయతీకి చెందిన ప్రజలు ఎడ్ల బళ్లతో వినూత్న స్వాగతం పలికారు.  ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా విశాఖ –రాయపూర్‌ జాతీయ రహదారిపై పాదయాత్ర కొనసాగించిన జననేతకు ప్రజలు ఘన నీరాజనాలు పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top