అన్నొచ్చాడు.. ఆదుకుంటాడు

YS Jagan Mohan Reddy Praja Sankalpa Yatra in East Godavari district - Sakshi

ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్‌కు ప్రజల విన్నపాలు 

దారిపొడవునా వినతులు స్వీకరిస్తూ సాగిన యాత్ర 

హారతులు పట్టి, దిష్టి తీసిన అక్కాచెల్లెమ్మలు, అవ్వలు 

 వర్షంతో మధ్యాహ్నం ప్రారంభమైన పాదయాత్ర

సాక్షి, రాజమహేంద్రవరం: అందరినీ ఆదుకొనే ఆపన్నహస్తం జగనన్న అంటూ అందరూ ఆత్రంగా ఆయన కోసం ఎదురు చూశారు. అడుగడుగో అక్కడే ఉన్నాడంటూ ఆప్యాయంగా ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆయనను కలుసుకొని తమ గోడు వెళ్ల బోసుకోవాలని కొందరు ఎదురు చూశారు. ప్రభుత్వ పథకాలు అందడం లేదని కొందరు.. అనారోగ్య సమస్యలతో మరికొందరు.. కనీస వేతనాలు కూడా కరువయ్యాయని ఉద్యోగస్తులు తమ బాధలు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో ఆశాదీపం కనిపిస్తోంది. తమ సమస్యలను పరిష్కరించి.. జీవితాలను మార్చగలిగే ఏకైక శక్తి..  వైఎస్‌ జగన్‌ అంటూ వేల గొంతుకలు ఒక్కటవుతున్నాయి. సమీప గ్రామాల ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు పాదయాత్ర జరిగే సమీప గ్రామాలకు చేరుకుంటున్నారు. తమ అభిమాన నేత రాగానే ఆయనకు తమ బాధ చెప్పుకుని ఊరట చెందుతూ ఆ పాదయాత్రికుడితో అడుగు కలుపుతున్నారు.

ప్రజా సంకల్ప పాదయాత్ర 196వ రోజు రాజోలు నియోజకవర్గంలో సాగింది. జిల్లాలో పదో రోజు శనివారం పాదయాత్రకు వరుణుడి రూపంలో స్వల్ప అంతరాయం ఏర్పడింది. రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పాదయాత్ర వర్షం పడుతుండడంతో మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవిని త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. రెండు బస్సుల్లో వచ్చిన రాష్ట్ర ఒలింపిక్‌ క్రీడాకారులు చింతలపల్లి వద్ద వైఎస్‌ జగన్‌ను కలిశారు. 

ఒలింపిక్‌ రన్‌ నిర్వహించి తమ సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగేలా పాలకులు క్షేత్రస్థాయిలో వసతులు కల్పించడం లేదని, దాంతో క్రీడాకారుల్లో నైరాశ్యం పెరిగిపోతోందని తిరుపతికి చెందిన ఇంటర్నేషనల్‌ హాకీ ప్లేయర్‌ నదీముద్దిన్‌ వాపోయారు. వర్షం ఆగడంతో మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. చింతలపల్లి గ్రామంలో దారిపొడవునా గ్రామ ప్రజలు వైఎస్‌ జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. అక్కాచెల్లెమ్మలు హారతులు పట్టి విజయ తిలకం దిద్దారు. బొణం కనకరత్నం అనే అవ్వ జగన్‌మోహన్‌రెడ్డికి కొబ్బరికాయతో దిష్టి తీసింది. నూతన దంపతులు జగన్‌ను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చిన్నారులను పలకరిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి చింతలపల్లి మీదుగా కూనవరం, పాత కూనవరం, ములికిపల్లిలో రాత్రి బస ప్రాంతానికి సాయంత్రం 5:18 గంటలకు చేరుకున్నారు. పదో రోజు పాదయాత్ర 3.5 కిలోమీటర్ల మేర సాగింది.

సమస్యల వినతులు 
చింతలపల్లి నుంచి ములికిపల్లి వరకు సాగిన పాదయాత్రలో   జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేసి గోడు వెళ్లబోసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని రాజోలు నియోజకవర్గ అంగన్‌వాడీలు వినతిపత్రం ఇచ్చారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు తమ ఆవేదన చెప్పుకున్నారు. తాను ఎమ్మెస్పీ పూర్తి చేసిన నాలుగేళ్లు అయినా ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదని పెదపూడి ధనలక్ష్మి వాపోయింది. సొసైటీలో తీసుకున్న అప్పు చెల్లించకపోతే ఇంటిని వేలం వేస్తామంటున్నారని యింటిపల్లి బాల వెంకట సత్యవతి తన గోడు చెప్పుకుంది.

 తమ గ్రామాల్లో పంట భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేస్తుండడంతో పంటచేలు పాడవుతున్నాయని విప్పర్తి సతీష్‌ పేర్కొన్నారు. చింతలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల విద్యార్థులు తమకు దుస్తులు సకాలంలో అందేలా చూడాలని కోరారు. షూలు కూడా ఇప్పించాలని విన్నవించారు. తమ బిడ్డ కోన క్రిషిత గుండె ఆపరేషన్‌కు సహకరించి, ప్రాణదానం చేయాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. తన కుమారుడు జోసెఫ్‌ 9 నెలలుగా కనిపించకుండా పోయాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని సరెళ్ల అన్నపూర్ణ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయింది. అరకొర జీతాలతో తాము పని చేస్తున్నామని, జీతాలు పెంచేలా చర్యలు చేపట్టాలని పంటల బీమా చేయించే సిబ్బంది వినతిపత్రం ఇచ్చారు. అందరి సమస్యలు సావధానంగా వింటూ, పరిష్కారంపై స్పష్టమైన భరోసా ఇస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగారు. 

పాదయాత్రలో పార్టీ నేతలు...
పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ వెంట ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పీఏసీ సభ్యుడు కుడిపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పినిపే విశ్వరూప్, తలశిల రఘురామ్, సోషల్‌ మీడియా విభాగం కో ఆర్డినేటర్‌ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ కలకడ, ఐటీ విభాగం కో ఆర్డినేటర్‌ చెన్న మధుసూదన్‌ రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్‌ హర్షవర్ధన్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అల్లూరి కృష్ణంరాజు, కురసాల కన్నబాబు, పొన్నాడ సతీష్‌కుమార్, పాముల రాజేశ్వరి, కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పి.గన్నవరం మాజీ కో ఆర్డినేటర్‌ విప్పర్తి వేణుగోపాల్, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, సంయుక్త కార్యదర్శి జంపన, రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి మంగిన సింహాద్రి, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి బొమ్మిడి వెంకటేష్, ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరిశెట్టి బాబి, యువజన విభాగం నేతలు బండారు కాశీ, జక్కంపూడి వాసు, బీసీ సెల్‌ నేత పాటి శివ, దొంగ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సాగి రామరాజు, రైతు విభాగం నేత జిన్నూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top